గోవధ నిషేధ బిల్లుకు మద్దతివ్వం : దేవెగౌడ

ABN , First Publish Date - 2020-12-15T18:25:10+05:30 IST

కర్ణాటకలో గోవధ వ్యతిరేక బిల్లుకు మద్దతివ్వబోమని మాజీ ప్రధాన మంత్రి,

గోవధ నిషేధ బిల్లుకు మద్దతివ్వం : దేవెగౌడ

బెంగళూరు : కర్ణాటకలో గోవధ వ్యతిరేక బిల్లుకు మద్దతివ్వబోమని మాజీ ప్రధాన మంత్రి, జేడీఎస్ చీఫ్ హెచ్‌డీ దేవెగౌడ చెప్పారు. ఈ బిల్లును తీసుకొచ్చి, సమాజంలో అశాంతిని సృష్టించాలని బీజేపీ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని, దీనివల్ల మతపరమైన ఉద్రిక్తతలు ఏర్పడతాయని ఆరోపించారు. శాసన మండలిలో ఈ బిల్లును జేడీఎస్ వ్యతిరేకిస్తుందన్నారు. 


కర్ణాటక ప్రివెన్షన్ ఆఫ్ స్లాటర్ అండ్ ప్రిజర్వేషన్ ఆఫ్ కేటిల్ బిల్, 2020ని కర్ణాటక శాసన సభ ఆమోదించింది. కాంగ్రెస్, జేడీఎస్ వాకౌట్ చేశాయి. ఈ బిల్లులోని నిబంధనలను ఉల్లంఘించినవారికి 3 నుంచి ఏడేళ్ళ వరకు జైలు శిక్ష, రూ.5 లక్షల వరకు జరిమానా విదించవచ్చునని ప్రభుత్వం ప్రతిపాదించింది. రెండోసారి ఇదే నేరానికి పాల్పడినవారికి రూ.10 లక్షల వరకు జరిమానా, ఏడేళ్ళ వరకు జైలు శిక్ష విధించవచ్చునని ప్రతిపాదించారు. 


కర్ణాటక మంత్రి జేడీ మధు స్వామి మాట్లాడుతూ, ఆవులు, దూడలను వధించడాన్ని అనుమతించబోమని, 13 ఏళ్ళ వయసు పైబడిన గేదెలను వధించడానికి అనుమతిస్తామని పేర్కొన్నారు. ఆవుకు వ్యాధి సోకినట్లయితే, ఆ వ్యాధి ఇతర పశువులకు సోకే ప్రమాదం ఉంటే, దానిని వధించడానికి అనుమతి ఇస్తామన్నారు. 




Updated Date - 2020-12-15T18:25:10+05:30 IST