‘చైనా పీఎల్ఏ డిమాండ్లకు తలొగ్గేది లేదు, యథాతథ స్థితిని పునరుద్ధరించవలసిందే’

ABN , First Publish Date - 2020-08-16T20:45:00+05:30 IST

వాస్తవాధీన రేఖ (ఎల్ఏసీ) వెంబడి యథాతథ స్థితిని పునరుద్ధరించే వరకు

‘చైనా పీఎల్ఏ డిమాండ్లకు తలొగ్గేది లేదు, యథాతథ స్థితిని పునరుద్ధరించవలసిందే’

న్యూఢిల్లీ : వాస్తవాధీన రేఖ (ఎల్ఏసీ) వెంబడి యథాతథ స్థితిని పునరుద్ధరించే వరకు కుగ్రంగ్ నది అంచుల ప్రాంతాల నుంచి కదలకూడదని భారత సైన్యం నిర్ణయించింది. చైనా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ (పీఎల్ఏ) పాంగాంగ్ ట్సో, గోగ్రా-హాట్ స్ప్రింగ్స్ వద్ద అతిక్రమణ ప్రదేశాల్లో ఆప్టికల్ ఫైబర్ కేబుల్ వేస్తుండటంతో భారత సైన్యం ఈ నిర్ణయం తీసుకుంది. 


సీనియర్ మిలిటరీ కమాండర్ ఒకరు తెలిపిన వివరాల ప్రకారం, లడఖ్‌, ఆక్రమిత ఆక్సాయ్ చిన్ ప్రాంతాల్లో పీఎల్ఏ గగనతల కార్యకలాపాలను పెద్దగా పట్టించుకోవలసిన అవసరం లేకపోయినప్పటికీ, లడఖ్‌లోని 1,597 కిలోమీటర్ల పొడవైన వాస్తవాధీన రేఖ వెంబడి చైనా ఆర్మీ పెద్ద సంఖ్యలో ఉంది. దీనినిబట్టి ఉద్రిక్తతలు తగ్గుతున్న సంకేతాలు కనిపించడం లేదు. అతిక్రమణలను చొరబాట్లుగా మార్చేందుకు పీఎల్ఏ ప్రయత్నిస్తోంది. ఈ పన్నాగాలను భగ్నం చేయాలని భారత సైన్యానికి ఆదేశాలు అందాయి. కొంత కాలంపాటు వాస్తవాధీన రేఖ వెంబడి ప్రారంభ స్థానాల్లో తిష్ఠ వేసుకుని అయినా చైనా దుస్తంత్రాన్ని తిప్పి కొట్టాలని మన దేశ సైన్యానికి ఆదేశాలు అందాయి.


లడఖ్ సెక్టర్‌లో మే నెలలో పీఎల్ఏ అతిక్రమణలకు చైనీస్ సెంట్రల్ మిలిటరీ కమిషన్ (సీఎంసీ) అనుమతి ఉన్నట్లు స్పష్టమవుతోందని భారత దేశ జాతీయ భద్రతా ప్రణాళిక వ్యూహకర్తలకు అర్థమైంది. సీఎంసీ జనరల్ సెక్రటరీగా దేశాధ్యక్షుడు జీ జిన్‌పింగ్ వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. 


ఇరు దేశాల మధ్య సైనిక, దౌత్య స్థాయులలో చర్చలు జరుగుతున్నప్పటికీ, చైనా గొంతెమ్మ కోరికలతో మంకుపట్టు పడుతుండటంతో సమస్య పరిష్కారం కావడం లేదు. పాంగాంగ్ ట్సో నుంచి పాత అడ్మినిస్ట్రేటివ్ బేస్‌ను తొలగించాలని, కుగ్రంగ్ నది అంచుల్లోని సైన్యాన్ని ఉపసంహరించాలని చైనా కోరుతోంది. ఇందుకు భారత్ ససేమిరా అంటోంది. చైనా దళాలు తప్పనిసరిగా వెనుకకు వెళ్ళవలసిందేనని స్పష్టం చేసింది.


Updated Date - 2020-08-16T20:45:00+05:30 IST