కరోనాకు చైనానే కారణం.. ఈ విషయాన్ని ప్రపంచానికి తెలియజేస్తాం: ట్రంప్
ABN , First Publish Date - 2020-04-25T23:39:35+05:30 IST
ప్రపంచాన్ని కరోనా ఎంతలా వణికిస్తుందో అందరికీ తెలిసిందే. ఈ మహమ్మారి కోరల్లో చిక్కుకున్న అమెరికా ఆర్థికంగా...

వాషింగ్టన్: ప్రపంచాన్ని కరోనా ఎంతలా వణికిస్తుందో అందరికీ తెలిసిందే. ఈ మహమ్మారి కోరల్లో చిక్కుకున్న అమెరికా ఆర్థికంగా తీవ్ర నష్టాన్ని చవిచూడడమే కాక వేల ప్రాణాలను కోల్పోయింది. దీంతో ఆ దేశం ఎలాగైనా ఈ వైరస్ మూలాలను బయటపెట్టాలనే పట్టుదలతో ఉంది. ఈ నేపథ్యలో ఓ ఇంటర్వ్యూలో పాల్గోన్న అమెరికా ప్రధాన కార్యదర్శి మైక్ పోంపియో మాట్లాడుతూ, కరోనా మహమ్మారి చైనాలోని వూహాన్‌లోనే పుట్టిందనే విషయాన్ని ప్రపంచదేశాలకు అర్థమయ్యేలా వివరిస్తామని చెప్పారు. దీని కారణంగా ప్రపంచ ఆర్థిక పరిస్థితి దిగజారిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. కరోనా వైరస్ గురించి డిసెంబరులోనే చైనాకు తెలుసని, అయినా బయటపెట్టలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రపంచంలోని అనేక దేశాలకు సాయం చేసేందుకు అమెరికా ఇప్పటికే చేయూతనందిస్తోందని, ఆయా దేశాల్లో ఆర్థిక స్థితిని మెరుగుపరిచేందుకు కూడా సాయం అందిస్తోందని చెప్పుకొచ్చారు. ఇదిలా ఉంటే ‘దీనికి కారణమైన వారిని వదిలిపెట్టం. అమెరికా కోల్పోయిన ప్రతి ప్రాణానికి వారిని జవాబుదారీగా నిలబెడతాం’ అని పోంపియో పేర్కొన్నారు.