మేం బీజేపీకి వ్యతిరేకం కానీ దేశానికి కాదు: ఫరూక్ అబ్దుల్లా

ABN , First Publish Date - 2020-10-25T05:22:21+05:30 IST

మేం బీజేపీకి వ్యతిరేకం కానీ దేశానికి కాదు

మేం బీజేపీకి వ్యతిరేకం కానీ దేశానికి కాదు: ఫరూక్ అబ్దుల్లా

శ్రీనగర్: జమ్మూ కశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తి పునరుద్ధరణ కోసం ఏర్పాటైన పీపుల్స్ అలయన్స్ ఫర్ గుప్కార్ డిక్లరేషన్ (పీఏజీడీ) బీజేపీకి మాత్రమే వ్యతిరేకం తప్ప దేశానికి ఏమాత్రం వ్యతిరేకం కాదని నేషనల్ కాన్ఫరెన్స్ (ఎన్‌సీ) చీఫ్ ఫరూక్ అబ్దుల్లా పేర్కొన్నారు. ‘‘పీఏజీడీ అనేది దేశానికి వ్యతిరేకంగా ఏర్పాటైందంటూ బీజేపీ చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని మీ దృష్టికి తీసుకురావాలని భావిస్తున్నాను. బీజేపీ చెబుతున్న దాంట్లో ఏమాత్రం వాస్తవం లేదు. దాన్ని మీరు నమ్మొద్దు. పీఏజీడీ అనేది బీజేపీకి మాత్రమే వ్యతిరేకం తప్ప దేశానికి ఏమాత్రం వ్యతిరేకం కాదు...’’ అని ఫరూక్ ఇవాళ జరిగిన ఓ మీడియా సమావేశంలో పేర్కొన్నారు. పీడీపీ చీప్ మెహబూబా ముఫ్తీ నివాసంలో ఇవాళ జరిగిన తొలి పీఏజీడీ సమావేశంలో శ్రీనగర్ లోక్‌సభ ఎంపీ ఫరూక్ అబ్దుల్లాను చైర్మన్‌గా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా అబ్దుల్లా మాట్లాడుతూ... ‘‘ఆర్టికల్ 370 రద్దు సహా జమ్మూ కశ్మీర్‌ను రెండు ముక్కలు చేయడం వంటి నిర్ణయాలతో దేశ సమాఖ్య నిర్మాణాన్ని దెబ్బతీసేందుకు బీజేపీ ప్రయత్నిస్తోంది. వాళ్లు దేశ రాజ్యాంగాన్ని ధ్వంసం చేసి, దేశాన్ని ముక్కలు చేసేందుకు ప్రయత్నించారు. గతేడాది ఆగస్టు 5న తీసుకున్న నిర్ణయాలతో దేశ సమాఖ్య నిర్మాణాన్ని కూడా ముక్కలు చేశారు...’’ అంటూ తీవ్ర ఆరోపణలు చేశారు. 

Updated Date - 2020-10-25T05:22:21+05:30 IST