సీఎం హోదాలో ఉన్న వ్యక్తిని గౌరవించాలన్నది నేవీలో నేర్పలేదా? శివసేన మండిపాటు
ABN , First Publish Date - 2020-09-14T18:50:08+05:30 IST
సామ్నా వేదికగా నేవీ రిటైర్డ్ అధికారి మదన్ శర్మపై శివసేన తీవ్రంగా మండిపడింది. ముఖ్యమంత్రి హోదాలో
ముంబై : సామ్నా వేదికగా నేవీ రిటైర్డ్ అధికారి మదన్ శర్మపై శివసేన తీవ్రంగా మండిపడింది. ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్తికి గౌరవం ఇవ్వాలన్న ప్రాథమిక విషయం నేవీలో నేర్చుకోలేదా? అని ప్రశ్నించింది. ప్రజలచే ఎన్నుకోబడ్డ ముఖ్యమంత్రిని ఎలా గౌరవించాలన్నది మదన్ శర్మ గ్రహిస్తే బాగుంటుందని చురకలంటించింది.
‘‘ముంబైలో నేవీ రిటైర్డ్ అధికారిపై శివసైనికులు దాడి చేశారు. ఆ సంఘటనను ఎవరూ సమర్థించం. ఖండించాల్సిందే. కానీ ప్రజలచే ఎన్నికైన ఉద్ధవ్ ఠాక్రేపై వ్యంగ్య కార్టూన్ ను షేర్ చేయడం ద్వారా ఆ ఆఫీసర్ పొందిన లబ్ధి ఏంటి? చెప్పండి’’ అంటూ శివసేన ప్రశ్నించింది. రాజ్యాంగ బద్ధమైన పదవిలో ఉన్న వ్యక్తిని గౌరవించాలన్న నిబంధనను నేవీలో నేర్పలేదా? అని శివసేన మండిపడింది.
బీజేపీ పాలిత రాష్ట్రాల్లో కూడా జరిగాయి
మదన్ శర్మ వ్యవహారంపై బీజేపీ విమర్శలు చేయడంపై శివసేన తీవ్రంగా మండిపడింది. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో కూడా ఇలాంటి దురదృష్ట సంఘటనలు జరుగుతాయని, కానీ బీజేపీ ఎప్పుడూ రోడ్లపైకి రాలేదని విమర్శించింది. గతంలో జాల్గాన్ ఎంపీ ఉమేశ్ పాటిల్ ఓ జవానుపై దాడికి దిగారని శివసేన గుర్తు చేసింది. ఆ సమయంలో బీజేపీ ఎందుకు నిరసనకు దిగలేదని ప్రశ్నించారు? యూపీ, బీహార్ లో కూడా ఆర్మీ జవాన్లపై దాడులు జరిగాయని, అప్పుడు బీజేపీ ఏం చేసిందో చెప్పాలని సామ్నా వేదికగా శివసేన మండిపడింది.