బడా కార్పొరేట్లపై వార్‌

ABN , First Publish Date - 2020-12-10T07:14:53+05:30 IST

‘చావో బతుకో తేల్చుకోవాల్సిన సమయం వస్తే ఈ చలి మాకు లెక్క కాదు..’ అని రైతు ప్రతినిధులు అంటున్నారు. యూపీ-

బడా కార్పొరేట్లపై వార్‌

అంబానీ, ఆదానీ గ్రూప్‌ ఉత్పత్తుల బహిష్కరణ!

రిలయన్స్‌ మాల్స్‌, జియో... అన్నింటి బహిష్కరణ

రైతుల నిర్ణయం.. 14 నుంచి ఆందోళన ఉధృతం 

ఎంఎస్పీని కొనసాగిస్తాం.. మండీలు యథాతథం

ఏడు ప్రతిపాదనలను పంపిన మోదీ సర్కార్‌

తిరస్కరించిన రైతు సంఘాల నేతలు


 ‘చావో బతుకో తేల్చుకోవాల్సిన సమయం వస్తే ఈ చలి మాకు లెక్క కాదు..’ అని రైతు ప్రతినిధులు అంటున్నారు.  యూపీ- ఢిల్లీ పొలిమేరల్లో గత 14 రోజులుగా నిరసన ప్రదర్శనలు నిర్వహిస్తున్న  రైతుల వద్దకు ’ఆంధ్రజ్యోతి’  వెళ్లినపుడు వారు ఎంతసేపూ తమకు మోదీ ప్రభుత్వ విఽధానాల గురించి మాట్లాడుతున్నారే కానీ చలి గురించి మాట్లాడడం లేదు.  ‘చలి ఎక్కువగా ఉంది... మీరెలా తట్టుకుంటున్నారు..?’ అని అడిగితే ఒక రైతన్న నవ్వాడు. ‘మోదీకి చలి పుట్టిస్తున్నాం. అదెలా ఉంది..’ అని కవితాత్మకంగా అడిగాడు.


న్యూఢిల్లీ, డిసెంబరు 9 (ఆంధ్రజ్యోతి): సాగు చట్టాలపై కదం తొక్కిన రైతాంగం తన ఆందోళనను మరింత పదునుదేల్చింది  చట్టాల్లో సవరణలు తెస్తామంటూ కేంద్ర ప్రభుత్వం చేసిన ప్రతిపాదనలను రైతు సంఘాలు ఏకగ్రీవంగా తిరస్కరించాయి. తాము వాటి రద్దు కోరుతూంటే సవరణలు తెస్తామన్న పాత వైఖరినే వినిపించడమేంటని మండిపడ్డాయి. అంతేకాదు... బడా కార్పొరేట్‌ సంస్థల ఒత్తిడి మేరకు నరేంద్ర మోదీ ప్రభుత్వం నడుచుకుంటోందని, అమిత్‌ షా తమను చర్చలకు పిలవడం కూడా ఆ కోవలోనిదేనని భావించిన రైతు సంఘాలు- ఆ కార్పొరేట్లపై యుద్ధం ప్రకటించాయి. ముఖ్యంగా అంబానీ, ఆదానీ గ్రూప్‌లను బహిష్కరించాలని నిర్ణయించాయి.


రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ ఉత్పత్తులను కొనుగోలు చేయరాదని, రిలయన్స్‌ మాల్స్‌ను బాయ్‌కాట్‌ చేయాలని, ఆఖరికి రిలయన్స్‌ సంస్థకు చెందిన జియో సిమ్‌లను కూడా వాడరాదని నిశ్చయించాయి. రైతుల ఆందోళనలో ఇదో కొత్త మలుపు. అంబానీ, ఆదానీ గ్రూపుల మూలాలు మోదీ స్వరాష్ట్రమైన గుజరాత్‌లో ఉండడం రైతుల ఆగ్రహానికి మరో కారణంగా చెబుతున్నారు. జియో నెట్‌వర్క్‌ను కూడా వదలేయాలని అన్నదాతలు నిశ్చయించుకోవడం ఒక ఊహించని పరిణామంగా ఇండస్ట్రీ పరిశీలకులు అభివర్ణిస్తున్నారు.


ఆదానీలకు కూడా పంట ఉత్పత్తుల నిర్వహణతో సంబంధం ఉన్నందున ఆదానీ గ్రూప్‌ను కూడా బాయ్‌కాట్‌ చేస్తామని కొందరు రైతులు బుధవారంనాడు  ప్రకటించారు. అయితే ఆదానీ గ్రూప్‌ వారి అభియోగాన్ని తిరస్కరించింది. తామేమే రైతుల వద్ద నుంచి పంట ఉత్పత్తులను కొనుగోలు చేయడం లేదనీ, వాటి ధర నిర్ణాయక వ్యవస్థతో కూడా తమకు సంబంధం లేదనీ, అది భారత ఆహార సంస్థ (ఎఫ్‌సీఐ) బాధ్యత అనీ, కేవలం ఎఫ్‌సీఐ గోడౌన్లు, కోల్డ్‌ స్టోరేజీల నిర్వహణ వరకే తమ బాధ్యత అనీ ఓ ప్రకటనలో స్పష్టం చేసింది. 




రాతపూర్వక ప్రతిపాదనలు

మంగళవారం రాత్రి హోంశాఖ మంత్రి అమిత్‌ షాతో జరిగిన చర్చల్లో తీసుకున్న నిర్ణయం మేరకు బుధవారం కేంద్రం.. సాగు చట్టాల్లో చేయాలని భావిస్తున్న సవరణలకు సంబంధించిన ప్రతిపాదనలను 13 రైతు  సంఘాల నాయకులకు  పంపింది.. పంటలకు ఇప్పటివరకూ ఉన్న కనీస మద్దతు ధర కొనసాగిస్తామనీ, మండీల వ్యవస్థను బలోపేతం చేస్తామనీ, ఒప్పంద సేద్యంపై రైతు అనుకూల నిర్ణయాలకు రాష్ట్రాలకు అధికారమిస్తామనీ.... మొదలైన ఏడు ప్రతిపాదనలు పంపారు. వాటిపై నేతలు సింఘూ సరిహద్దుల్లో సమావేశమై చర్చించారు. 


సమావేశంలో అఖిల భారత కిసాన్‌ మజ్దూర్‌ సభ నేత వేములపల్లి వెంకట్రామయ్య కూడా పాల్గొన్నారు.  ఇందులో కొత్తదేమీ లేదని, పాత వైఖరినే ఈ రూపంలో వల్లె వేశారని అంటూ నేతలు ఆ ప్రతిపాదనలను తిరస్కరించారు. ఐదు రౌండ్ల చర్చల్లో నరేంద్ర తోమర్‌ వినిపించిన వాణినే అమిత్‌ షా కూడా ప్రతిపాదనల రూపంలో పంపారు... ఎందుకిది..? అని ప్రశ్నించారు.  ప్రభుత్వ వైఖరికి నిరసనగా ఈ నెల 14వ తేదీన దేశవ్యాప్త ఆందోళనలకు పిలుపునిచ్చారు. పోరాటాన్ని మరింత ఉధృతం చేయాలని నిర్ణయించామని రైతు సంఘం నేత దర్శన్‌పాల్‌ వెల్లడించారు.


ఈ నెల 12వ తేదీ నాడు ఢిల్లీ -జైపూర్‌ జాతీయ రహదారిని, ఢిల్లీ -ఆగ్రా ఎక్స్‌ప్రె్‌సవేను పూర్తిగా దిగ్భందిస్తామని ప్రకటించారు. అదే రోజు అన్ని రహదారులపై ఉన్న టోల్‌ ప్లాజాల వద్ద ధర్నా నిర్వహిస్తామని తెలిపారు. దేశవ్యాప్తంగా ప్రతీ బీజేపీ ఎంపీని, ఎమ్మెల్యేనూ ఘెరావ్‌ చేయాలని నిర్ణయించారు. కార్పొరేట్‌ పెత్తనాలను సహించేది లేదని స్పష్టం చేస్తున్న రైతు సంఘాలు ముఖేశ్‌ అంబానీకి చెందిన రిలయన్స్‌ మాల్‌లను బహిష్కరించాలని పిలుపునిచ్చారు. 




రైతులను అవమానించడమే విస్సా కిరణ్‌ కుమార్‌

రైతులు లేవనెత్తిన అంశాలను పరిష్కరించే దిశగా ప్రభుత్వ ప్రతిపాదనలు లేవని, అనేక దఫాల చర్చలు జరిపిన తర్వాత కూడా ప్రభుత్వం అర్థరహితంగా స్పందిస్తోందని రైతు స్వరాజ్య వేదిక నేతల విస్సా కిరణ్‌ కుమార్‌ స్పష్టం చేశారు. ఇది రైతులను అవమానించడమేనని తెలిపారు. ‘‘కనీస మద్ధతు ధరల కొనసాగింపుపై లిఖితపూర్వక హామీ ఇస్తామని ప్రభుత్వం ప్రతిపాదించింది. అది ఆమోదయోగ్యం కాదు. కనీస మద్ధతు ధరలపై చట్టం తీసుకురావాలి. అన్పి పంటలకు కనీస మద్ధతు ధరలు ప్రకటించాలి. ’’ అని డిమాండ్‌ చేశారు. 


కేంద్రం ప్రతిపాదనలు

ప్రస్తుత కనీస మద్దతు ధర (ఎంఎస్పీ) విధానం కొనసాగిస్తాం.. ఆ మేరకు రాతపూర్వక హామీ

వ్యవసాయ ఉత్పత్తుల మార్కెటింగ్‌ కమిటీల (ఏపీఎంసీల)ను బలహీనపరచం.. ప్రైవేటు మండీలు, ప్రైవేటు వ్యాపారులకూ కూడా రిజిస్ట్రేషన్‌ తప్పనిసరి చేస్తాం. ఆ ప్రైవేటు వ్యాపారులపై కూడా ఏపీఎంసీల్లో రైతులు చెల్లించే మాదిరే పన్నులూ, సెస్సులూ కట్టేట్లు చేస్తాం. ఏపీఎంసీలన్నీ రాష్ట్రాల అధీనంలో నడుస్తాయి. మండీలకు వెలుపల పాన్‌ కార్డున్న వారెవరైనా రైతులను మోసగించే అవకాశం ఉందన్న భయాలను పోగొట్టేందుకు గాను-  ఆ వ్యాపారులకు రిజిస్ట్రేషన్‌ తప్పనిసరి చేసేలా రాష్ట్రాలకు అధికారం కల్పిస్తాం. అంతేకాక- స్థానిక అవసరాలకు తగినట్లుగా నిబంధనలను కూడా రాష్ట్రాలు రూపొందించుకునేట్లు చేస్తాం

ఒప్పంద సేద్యంలో వివాదాలు తలెత్తితే వాటి పరిష్కారానికి రైతులు సివిల్‌ కోర్టులను ఆశ్రయించే వీలు. కొత్త చట్టాల్లో ఇది సబ్‌డివిజనల్‌ మెజిస్ట్రేట్‌ కోర్టు (ఎస్‌డీఎం)ల్లోనే జరగాలన్న రూలు పెట్టారు. దీన్ని సవరించడానికి సిద్ధం

ఒప్పంద సేద్యంపై కాంట్రాక్టులకు విధివిధానాలను రాష్ట్ర ప్రభుత్వాలు రూపొందించేదాకా ఓ ప్రత్యామ్నాయ రిజిస్ట్రేషన్‌ విధానం అమలవుతుంది. దీని ప్రకారం రైతులు తాము ఏదేనా ఒప్పందాన్ని సంబంధిత సంస్థలతో కుదుర్చుకోవచ్చు.. దాని కాపీని ఎస్‌డీఎం కోర్టులో 30 రోజుల్లోగా సమర్పించాలి.

ఒప్పంద సేద్యం కుదుర్చుకున్న సంస్థ లేదా వ్యక్తులు.. రైతులకు చెందిన  వ్యవసాయ భూమిని తనఖా పెట్టడానికి వీల్లేకుండా లేదా దానిపై రుణం తీసుకోడానికి అవకాశం లేకుండా సవరణ చేస్తాం. తమ భూములను కార్పొరేట్లు కాలక్రమేణా కబ్జా చేస్తారని రైతులు భయం చెందకుండా చట్టంలోనే సవరణ తెస్తాం. 

 రైతులకు చెందిన వ్యవసాయ భూమిలో వ్యాపారులు లేక ఒప్పందానికి వచ్చిన సంస్థలు ఎలాంటి నిర్మాణాలు చేపట్టినా వాటిని తనఖా పెట్టే వీల్లేకుండా, వాటిపై రుణాలు పొందే వీలూ లేకుండా నిబంధనలు తెస్తాం

వ్యవసాయ విద్యుత్‌ బిల్లుల చెల్లింపునకు సంబంధించి ప్రస్తుతం ఉన్న విధానం కొనసాగింపు.

పంట కోతల తరువాత గడ్డి దుబ్బుల దహనానికి పాల్పడితే జరిమానా విధిస్తామంటూ ఈ మధ్య తెచ్చిన చట్టంలో మార్పులకు సంసిద్ధత. రైతుల సూచనలకు అనుగుణంగా మార్పులు.



Updated Date - 2020-12-10T07:14:53+05:30 IST