నేను ఇలా కోలుకున్నాను : వెంకయ్య నాయుడు

ABN , First Publish Date - 2020-10-14T01:20:55+05:30 IST

కోవిడ్-19 నుంచి బయటపడటానికి సంప్రదాయ ఆహారం, శారీరక, మానసిక దృఢత్వం దోహదపడతాయని ఉప రాష్ట్రపతి ఎం వెంకయ్య నాయుడు

నేను ఇలా కోలుకున్నాను : వెంకయ్య నాయుడు

న్యూఢిల్లీ : కోవిడ్-19 నుంచి బయటపడటానికి సంప్రదాయ ఆహారం, శారీరక, మానసిక దృఢత్వం దోహదపడతాయని ఉప రాష్ట్రపతి ఎం వెంకయ్య నాయుడు చెప్పారు. తనకు కోవిడ్-19 సోకిన తర్వాత తాను పాటించిన ఆహార, ఆరోగ్య నియమాలను ఫేస్‌బుక్ ద్వారా ప్రజలతో పంచుకున్నారు. తనకు ఇతర ఆరోగ్య సమస్యలు ఉన్నప్పటికీ యోగా, నడక వల్ల తాను కోవిడ్ నుంచి కోలుకున్నానని తెలిపారు. 


తనకు కోవిడ్-19 పాజిటివ్ అని నిర్థరణ అయిన తర్వాత తాను సానుకూల దృక్పథంతోనే ఉన్నానని వెంకయ్య నాయుడు తెలిపారు. శారీరక, మానసిక దృఢత్వం, సంప్రదాయ ఆహారం తినడం, యోగాభ్యాసం చేయడం వంటివాటి వల్ల తాను దీని నుంచి కోలుకుంటాననే నమ్మకం తనకు మొదటి నుంచి ఉందని పేర్కొన్నారు. 


‘‘సంప్రదాయ ఆహారం మాత్రమే తినడంతోపాటు నా శారీరక దృఢత్వం, మానసిక దృఢత్వం, నిత్యం నడక, యోగా వంటి శారీరక వ్యాయామాలు చేయడం వల్ల నా వయసు, మధుమేహం వంటికొన్ని ఆరోగ్య సమస్యలు ఉన్నప్పటికీ, నేను కోవిడ్-19 ఇన్ఫెక్షన్‌ను అధిగమించగలనని గట్టిగా నమ్మాను. నేను ఎప్పుడూ దేశవాళీ ఆహారానికే ప్రాధాన్యం ఇచ్చేవాడిని. నా ఐసొలేషన్ సమయంలో కూడా దానినే కొనసాగించాను’’ అని తెలిపారు. 


కోవిడ్-19ను అధిగమించడానికి రోజూ ఏదో ఒక శారీరక వ్యాయామం చేయాలని, నడవడం, జాగింగ్ చేయడం, యోగాభ్యాసం చేయడం వంటివాటిలో ఏదో ఒకదానిని నిత్యం క్రమబద్ధంగా చేయాలని ప్రజలను కోరారు. ఇది తాను తన స్వీయానుభవాన్నిబట్టి చెప్తున్నానని తెలిపారు. 


జంక్ ఫుడ్‌ను మానుకోవాలని, ప్రొటీన్లు పుష్కలంగా ఉండే ఆహారాన్ని తీసుకోవాలని తెలిపారు. ఆత్మ విశ్వాసాన్ని కోల్పోకూడదని చెప్పారు. మాస్క్ ధరించడం, చేతులను తరచూ శుభ్రపరచుకోవడం, వ్యక్తిగత పరిశుభ్రత పాటించడం తప్పనిసరి అని పేర్కొన్నారు. 


తాను హోం క్వారంటైన్‌లో ఉన్నపుడు వార్తా పత్రికలు, మ్యాగజైన్లు, వ్యాసాలు చదివానని తెలిపారు. స్వాతంత్ర్య పోరాటంలో వెలుగులోకి రాని గొప్ప యోధుల గురించి తాను ఫేస్‌బుక్‌ పోస్టులు పెట్టినట్లు తెలిపారు. వారానికి రెండు పోస్టుల చొప్పున పెట్టినట్లు తెలిపారు. 


వెంకయ్య నాయుడుకు కోవిడ్-19 పాజిటివ్ అని  సెప్టెంబరు 29న నిర్థరణ కాగా, అక్టోబరు 12న కోవిడ్-19 నెగెటివ్ అని నిర్థరణ అయింది. తాను కోలుకోవాలని ఆకాంక్షించినవారందరికీ ఆయన ధన్యవాదాలు చెప్పారు. 


Updated Date - 2020-10-14T01:20:55+05:30 IST