10 కోట్లు చెల్లించిన శశికళ.. జైలు నుంచి రిలీజ్ ఎప్పుడంటే..!

ABN , First Publish Date - 2020-11-19T16:37:06+05:30 IST

అక్రమార్జన కేసులో సుప్రీంకోర్టు విధించిన రూ.10.10 కోట్ల అపరాద

10 కోట్లు చెల్లించిన శశికళ.. జైలు నుంచి రిలీజ్ ఎప్పుడంటే..!

చెన్నై : అక్రమార్జన కేసులో సుప్రీంకోర్టు విధించిన రూ.10.10 కోట్ల అపరాద రుసుమును దివంగత మాజీ ముఖ్యమంత్రి జయలలిత సన్నిహితు రాలు శశికళ బుధవారం ఉదయం బెంగళూరు ప్రత్యేక కోర్టులో చెల్లించారు. దీంతో వచ్చే యేడాది జనవరి 27న ఆమె జైలు నుంచి విడుదల కావడం ఖరారైంది. అక్రమార్జన కేసులో శశికళ, ఆమె బంధువులకు నాలుగేళ్ల జైలు శిక్ష విధిస్తూ సుప్రీంకోర్టు తీర్పు వెలువరించింది. 2017 ఫిబ్రవరి 15 నుంచి శశికళ బెంగళూరు పరప్పణ అగ్రహారం జైలులో శిక్ష అనుభవిస్తున్నారు. సత్ప్రవర్తన, పెరోలు అధికంగా వాడకపోవడం తదితర కారణాల వల్ల శశికళ డిసెంబర్‌లోగా విడుదలవుతారని ఆమె తరఫు న్యాయవాదులు చెబుతూ వచ్చారు. శశికళ విడుదలకు సంబంధించి బెంగళూరుకు చెందిన డి. నరసింహమూర్తి అనే ప్రముఖుడు ఆర్టీఐ చట్టం ప్రకారం కర్ణాటక జైలు శాఖ ఉన్నతాధికారులను ప్రశ్నించగా, శశికళ అపరాధ సొమ్మును డిసెంబర్‌లోగా చెల్లిస్తే వచ్చే యేడాది జనవరి 27న విడుదలవుతారని జైలు శాఖ అధికారులు ఆయనకు బదులిచ్చారు.


ఈ పరిస్థితుల్లో తనకు విధించిన అపరాదపు సొమ్మును చెల్లించేందుకు అనుమతించాలని శశికళ బెంగళూరు సిటీ సివిల్‌ కోర్టులో దరఖాస్తు చేసుకున్నారు. అపరాధ సొమ్మును చెల్లించేందుకు కోర్టు అనుమతివ్వడంతో బుధవారం ఉదయం బెంగళూరు ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి శివప్ప సమక్షంలో శశికళ తరఫు న్యాయవాది రూ.10.10 కోట్ల విలువైన చెక్కును సమర్పించారు. శశికళ కోసం అపరాధ సొమ్మును సమకూర్చిన వారి పేర్లను కూడా ప్రకటించారు. ఆ మేరకు పళనివేల్‌ అనే వ్యక్తి స్టేట్‌బ్యాంక్‌ నుంచి రూ.3.25కోట్ల డీడీని, వసంతదేవి అనే మహిళ రూ.3.75 కోట్ల విలువైన డీడీని, హేమా అనే వ్యక్తి ఆక్సిస్‌ బ్యాంక్‌ నుంచి రూ.3 కోట్ల డీడీని, వివేక్‌ అనే వ్యక్తి ఆక్సిస్‌ బ్యాంక్‌ నుంచి రూ.10వేల డిడీని శశికళ తరఫు న్యాయవాదులకు అందించారని, వీటిని శశికళ బ్యాంకు ఖాతాలో జమచేసిన మీదట రూ.10.10 కోట్ల చెక్కును ప్రత్యేక కోర్టులో సమర్పించారు. శశికళ అపరాధపు సొమ్మును చెల్లించడంతో కర్నాటక జైళ్ల శాఖ ఉన్నతాధికారులు ప్రకటించినట్టు వచ్చే యేడాది జనవరి 27న ఆమె విడుదల కావడానికి మార్గం సుగమమైంది.

Updated Date - 2020-11-19T16:37:06+05:30 IST