రామ మందిరానికి రూ.1400 కోట్లు అవసరం
ABN , First Publish Date - 2020-12-07T08:37:13+05:30 IST
అయోధ్యలో రామ మందిర నిర్మాణానికి రూ.1400 కోట్లు అవసరమని, ప్రస్తుతం రోజుకు రూ.కోటి దాకా ట్రస్టు ఖాతాకు జమవుతోందని శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్టు ముఖ్యులు...

- విశ్వప్రసన్నతీర్థ స్వామి
బెంగళూరు, డిసెంబరు 6 (ఆంధ్రజ్యోతి): అయోధ్యలో రామ మందిర నిర్మాణానికి రూ.1400 కోట్లు అవసరమని, ప్రస్తుతం రోజుకు రూ.కోటి దాకా ట్రస్టు ఖాతాకు జమవుతోందని శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్టు ముఖ్యులు, పెజావర పీఠాధిపతి విశ్వప్రసన్నతీర్థ స్వామి వెల్లడించారు. ఉడుపిలో శనివారం స్వామిజీ మీడియాతో మాట్లాడుతూ.. వచ్చే ఏడాది జనవరి 15 నుంచి ఫిబ్రవరి 27 వరకు దేశంలోని ప్రతి ఇంటి నుంచి నిధుల సేకరణ జరుగుతుందన్నారు. విశ్వహిందూ పరిషత్ కేటాయించిన కార్యకర్తలతో మాత్రమే సేకరణ ప్రక్రియ కొనసాగుతుందన్నారు. కనిష్ఠంగా పది రూపాయల నుంచి వంద రూపాయల దాకా ఒక ఇంటికి కూపన్ ఇస్తామని, ఆ మొత్తాన్ని ట్రస్టు ఖాతాకు నేరుగా జమ చేయవచ్చునన్నారు. విశ్వేశతీర్థస్వామిజీ తొలి వర్ధంతి ఈ నెల 17న బెంగళూరులోని పూర్ణ ప్రజ్ఞ విద్యాపీఠంలో ధార్మిక, సాంస్కృతిక కార్యక్రమాలతో నిర్వహిస్తామని ఆయన వెల్లడించారు.