సుప్రీంకోర్టు సందర్శనకు బ్రేక్

ABN , First Publish Date - 2020-03-16T01:13:38+05:30 IST

దేశంలో అత్యున్నత న్యాయస్థానాన్ని చూడాలని, అక్కడి ప్రదర్శన శాలను సందర్శించాలని కోరుకునేవారికి సుప్రీంకోర్టు చేదు వార్త వినిపించింది. కరోనా వైరస్ మహమ్మారిని ఎదుర్కొనేందుకు తీసుకుంటున్న ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా ...

సుప్రీంకోర్టు సందర్శనకు  బ్రేక్

న్యూఢిల్లీ : దేశంలో అత్యున్నత న్యాయస్థానాన్ని చూడాలని, అక్కడి ప్రదర్శన శాలను సందర్శించాలని కోరుకునేవారికి సుప్రీంకోర్టు చేదు వార్త వినిపించింది. కరోనా వైరస్ మహమ్మారిని ఎదుర్కొనేందుకు తీసుకుంటున్న ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా సుప్రీంకోర్టు సముదాయాన్ని గైడ్‌ సహాయంతో చూపించే యాత్రలను తాత్కాలికంగా నిలిపేయాలని ఆదివారం నిర్ణయించింది. అదేవిధంగా మ్యూజియంను సందర్శించేందుకు సందర్శకులకు అనుమతి ఇవ్వరాదని నిర్ణయించింది. తదుపరి ఆదేశాలు జారీ అయ్యే వరకు ఈ నిర్ణయం అమల్లో ఉంటుందని తెలిపింది. 


కోవిడ్-19 (కరోనా వైరస్) వ్యాప్తిని నిరోధించేందుకు ప్రజలు సామూహికంగా ఒక చోట కలిసే కార్యక్రమాల పట్ల కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన హెచ్చరిక ఆధారంగా సుప్రీంకోర్టు కొన్ని చర్యలను ప్రకటించింది. అవసరం లేకుండా సుప్రీంకోర్టును సందర్శించడంపై తదుపరి ఆదేశాలు ఇచ్చే వరకు ఆంక్షలు విధిస్తున్నట్లు పేర్కొంది. 


న్యాయవాదులు, కోర్టు సిబ్బంది, వ్యాపారులు, కక్షిదారులు ప్రతి రోజూ సాయంత్రం 5.30 గంటలకు కోర్టు ప్రాంగణం నుంచి బయటికి వెళ్ళిపోవాలని, విశ్రాంతి గదులు, ప్రాంగణాలు, మెట్లు, ఇతర ప్రాంతాలను పరిశుభ్రం చేసేందుకు వీలు కల్పించాలని ఆదివారం జారీ చేసిన సర్క్యులర్‌లో సుప్రీంకోర్టు పేర్కొంది. ఎక్కడా, ఎవరూ గుమిగూడవద్దని, అధికారిక పనులు పూర్తి కాగానే ప్రాంగణం నుంచి వెళ్ళిపోవాలని తెలిపింది. 


దేశంలోని న్యాయవాదులు, కక్షిదారులు ఈ ఆంక్షలు అమల్లో ఉన్నంత కాలం సుప్రీంకోర్టుకు హాజరు కాకూడదని నిర్ణయించుకుంటే, ఆ విషయాన్ని సుప్రీంకోర్టు రిజిస్ట్రీకి ఈ-మెయిల్ ద్వారా తెలియజేయాలని తెలిపింది. తమ కేసు(ల) వివరాలు పేర్కొంటూ, ఈ ఆంక్షలు అమల్లో ఉన్నంత వరకు తమ కేసులను విచారణ జాబితాలో పెట్టవద్దని కోరాలని పేర్కొంది.


సుప్రీంకోర్టు యాత్ర :

అత్యున్నత న్యాయస్థానం ప్రాంగణం, భవనాల లోపలి భాగాలు, న్యాయమూర్తుల గ్రంథాలయం, కోర్టు గదులు సందర్శనీయ స్థలాలు. వీటిని చూసేందుకు ప్రతి శనివారం రెండు బృందాలకు అనుమతి ఇస్తారు. ఒక్కొక్క బృందంలోనూ 40 మంది సందర్శకులు ఉండవచ్చు. శనివారం ప్రత్యేకంగా సెలవు దినం అయితే ఈ టూర్ నిర్వహించరు. ఆన్‌లైన్ ద్వారా బుక్ చేసుకుని ఈ యాత్ర చేయవచ్చు. ఎటువంటి రుసుము చెల్లించనక్కర్లేదు. 


Updated Date - 2020-03-16T01:13:38+05:30 IST