శృంగారం ‘కరోనా’?

ABN , First Publish Date - 2020-05-09T09:15:38+05:30 IST

కరోనా రోగి స్పర్శ, దగ్గు, తుమ్ము, లాలాజలం, స్వేదం ద్వారా కొవిడ్‌ సోకుతుందన్న విషయం అందరికీ తెలిసిందే.

శృంగారం ‘కరోనా’?

వీర్యంలో వైరస్‌.. ఓ అధ్యయనంలో వెల్లడి


వాషింగ్టన్‌, మే 8: కరోనా రోగి స్పర్శ, దగ్గు, తుమ్ము, లాలాజలం, స్వేదం ద్వారా కొవిడ్‌ సోకుతుందన్న విషయం అందరికీ తెలిసిందే. అందుకే ప్రభుత్వాలు భౌతికదూరం పాటించాలని, మాస్కులు ధరించాలని, ఇళ్లకే పరిమితం కావాలని ప్రజలకు సూచిస్తున్నాయి. ఇప్పుడు తాజాగా ఓ అధ్యయనం శృంగారం ద్వారా కూడా కరోనా సంక్రమించే అవకాశాలు ఉన్నాయంటోంది. చైనాకు చెందిన ఓ అధ్యయన బృందం.. ఈ అంశంపై చైనాలో ఇటీవల ఓ చిన్నపాటి పరిశోధన చేసింది. అక్కడి ఓ ఆసుపత్రిలోని 38 మంది కరోనా రోగుల వీర్యాన్ని పరీక్షించగా.. అందులో ఆరుగురి వీర్యంలో వైరస్‌ ఉన్నట్లు తేలింది.


ఈ ఆరుగురిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉండగా.. మరో ఇద్దరు కోలుకున్నారు. వీర్యంలో ఈ వైరస్‌ ఇలా ఎన్నిరోజులు ఉంటుందన్న విషయం మాత్రం తెలియడం లేదని పరిశోధకులు చెబుతున్నారు. అలాగే శృంగారం ద్వారా భాగస్వామికి ఈ వైరస్‌ సంక్రమిస్తుందా అనే విషయంలో కూడా స్పష్టత లేదన్నారు. కరోనా నుంచి కోలుకుని 8 రోజుల నుంచి మూడు నెలలు పూర్తయిన వారి వీర్యాన్ని పరీక్షించగా.. వైరస్‌ ఆనవాళ్లు కనిపించలేదని, శృంగారం ద్వారా కరోనా సంక్రమిస్తుందో లేదో తేలడానికి మరిన్ని పరిశోధనలు అవసరమని చెబుతున్నారు. 

Updated Date - 2020-05-09T09:15:38+05:30 IST