సూపర్‌ స్ర్పెడర్స్‌!

ABN , First Publish Date - 2020-05-11T07:21:14+05:30 IST

దేశంలో కరోనా మహమ్మారి అంతకంతకూ విజృంభిస్తోంది. వైరస్‌ వ్యాప్తిని అరికట్టేందుకు భౌతిక దూరం పాటించడం, మాస్కులు ధరించడం, శానిటైజర్లు వాడడం తప్పనిసరని వైద్యనిపుణులు...

సూపర్‌ స్ర్పెడర్స్‌!

  • కిరాణా, కూరగాయలు, పెట్రోల్‌ బంకులు..
  • వాటిలో ఏ ఒక్కరికి వైరస్‌ ఉన్నా పెనుముప్పే
  • అహ్మదాబాద్‌లో 334 మంది గుర్తింపు 
  • 15 వరకు దుకాణాల మూసివేత
  • దేశంలో 2వేలు దాటిన కరోనా మరణాలు
  • 62,939కి చేరిన పాజిటివ్‌ కేసులు
  • అత్యధిక కేసులు మహారాష్ట్ర, గుజరాత్‌లోనే
  • 3వ స్థానంలో తమిళనాడు: ఆరోగ్య శాఖ
  • తొలి దేశీయ యాంటీబాడీ టెస్ట్‌ కిట్‌
  • ఒకేసారి 90 నమూనాల పరీక్ష: హర్షవర్ధన్‌


న్యూఢిల్లీ, మే 10: దేశంలో కరోనా మహమ్మారి అంతకంతకూ విజృంభిస్తోంది. వైరస్‌ వ్యాప్తిని అరికట్టేందుకు భౌతిక దూరం పాటించడం, మాస్కులు ధరించడం, శానిటైజర్లు వాడడం తప్పనిసరని వైద్యనిపుణులు చెబుతున్నారు. మనం ఈ జాగ్రత్తలన్నీ తీసుకున్నా.. నిత్యావసరాలైన పాలు, కూరగాయలు, కిరాణా సరుకులు వంటివి తెచ్చుకోవడానికి బయటికి వెళ్లక తప్పదు! ఇలా బయటికి వెళ్లినప్పుడు ఏ పాల బూత్‌లోనో, కిరాణా దుకాణంలోనో, పెట్రోల్‌ బంకులోనో, పారిశుధ్య కార్మికుల్లోనో కరోనా వైరస్‌ సోకిన వారుంటే.. అంతే సంగతులు! ఒక్కరి నుంచి అనేక మందికి మహమ్మారి వ్యాపిస్తుంది! ఇలాంటి వారినే సూపర్‌ స్ర్పెడర్స్‌ అంటారు! దేశంలో కేసుల పరంగా రెండో స్థానంలో ఉన్న గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో ఈ సూపర్‌ స్ర్పెడర్స్‌ వణికిస్తున్నారు.


అహ్మదా బాద్‌లో 334 మందిని సూపర్‌ స్ర్పెడర్స్‌గా గుర్తించారు. ఇలాంటి వారి వల్ల వైరస్‌ ఎక్కువ మందికి సోకుతోందని, అందుకే ఈనెల 15 వరకు కిరాణా, కూరగాయల దుకాణాలను మూసేయాలని నిర్ణయించినట్లు స్థానిక అధికారులు తెలిపారు. నగరంలో 14 వేల మందికి పైగా సూపర్‌ స్ర్పెడర్స్‌ ఉన్నట్లు భావిస్తున్నామని, వారందరికీ స్ర్కీనింగ్‌ చేస్తామన్నారు. దేశవ్యాప్తంగా గత 24 గంటల్లో కొత్తగా 3277 కేసులు నమోదవగా.. 128 మంది మృతి చెందారు. దీంతో కేసుల సంఖ్య 62,939కి.. మృతుల సంఖ్య 2,109కి చేరిందని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. 30.75ు మంది కోలుకుంటున్నారు. మరణాలు, కేసుల్లో మహారాష్ట్ర, గుజరాత్‌ రాష్ట్రాలు తొలి రెండు స్థానాల్లో ఉన్నాయి. కేసుల సంఖ్యలో మూడో స్థానంలో ఉన్న ఢిల్లీని ఆదివారం తమిళనాడు దాటేసింది. కాగా, గత 24 గంటల్లో 10 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఒక్క కేసు కూడా నమోదు కాలేదని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్‌ వెల్లడించారు. దేశవ్యాప్తంగా 4362 కరోనా కేర్‌ సెంటర్లు ఉన్నాయని, వీటిలో అతి స్వల్ప లక్షణాలున్న 3,46,856 మంది రోగులకు చికిత్స అందించవచ్చని తెలిపారు. పుణేలోని జాతీయ వైరాలజీ సంస్థ యాంటీబాడీలను గుర్తించే కిట్‌ను తయారు చేశారన్నారు. దేశీయంగా తయారు చేసిన ఈ కిట్‌తో 2.5 గంటల్లోనే ఒకేసారి 90 నమూనాలను పరీక్షించవచ్చని తెలిపారు. 


95శాతం ఢిల్లీలో విధుల్లో ఉన్నవారికే..! 

సీఆర్‌పీఎఫ్‌ సిబ్బందిలో మరో 62 మందికి వైరస్‌ సోకింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 234కి చేరింది. బీఎ్‌సఎ్‌ఫలోనూ మరో 35 మంది జవాన్లకు పాజిటివ్‌ వచ్చింది. దీం తో మొత్తం కేసుల సంఖ్య 250కి చేరుకుంది. మరో 18 మంది సీఐఎ్‌సఎఫ్‌ సిబ్బందికి వైరస్‌ సోకిందని, కేసుల సంఖ్య 64కి చేరిందని అధికారులు తెలిపారు. ఇప్పటి వరకు 500 మందికి పైగా భద్ర తా సిబ్బందికి వైరస్‌ సోకగా.. అందులో 95ు మంది ఢిల్లీలో శాంతిభద్రతల పరిరక్షణ విధులు నిర్వహిస్తున్నవారే కావడం గమనార్హం. ఢిల్లీలో నమోదవుతున్న కేసుల్లో 75ు మందికి లక్షణాలు కనిపించడం లేదని సీఎం కేజ్రీవాల్‌ తెలిపారు. మృతుల సంఖ్య కూడా చాలా తక్కువగా ఉందన్నారు. వైరస్‌ వల్ల ఢిల్లీలో 78 మంది మరణించారన్నారు. 6,923కేసులు నమోదవగా 2,069 మంది కోలుకున్నారని తెలిపారు. 91 మంది రోగులు ఐసీయూలో ఉన్నారని, 27 మంది వెంటిలేటర్ల పై ఉన్నారని వివరించారు. మృతుల్లో 82ు మంది 50 ఏళ్లు పైబడినవారేనన్నారు. ఇలాంటి పరిస్థితుల్లోనూ ప్రతిపక్షాలు రాజకీయాలు చేయ డం బాధాకరమన్నారు. 


ఐదుగురు ఎయిరిండియా పైలట్లకూ.. 

ఎయిరిండియాకు చెంది న ఐదుగురు పైలట్లకూ వైరస్‌ సోకినట్లు అధికారులు తెలిపారు. వీరంతా 3 వారాలుగా ఎలాంటి విమానాలు నడపలేదని, ఏప్రిల్‌ 20కి ముందు చైనాకు కార్గో విమానాలు నడిపారని చెప్పారు. సంస్థ ఇంజనీరింగ్‌ విభాగంలో ఇద్దరికి వైరస్‌ సోకినట్లు తెలిపారు. కిట్లలో లోపం ఉందన్న అనుమానం కూడా ఉందన్నారు.


ఉజ్జయినిలో మరణాల రేటు 19శాతం!             

మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌ జిల్లా దేశంలోనే ఆందోళనకరమైన హాట్‌స్పాట్‌లలో ఒకటిగా మారి అధికారుల కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. ఇక ఇండోర్‌కి 54 కిలోమీటర్ల దూరంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం ఉజ్జయినిలో కరోనా వైరస్‌ మరణాల రేటు 19ు ఉండడంతో అధికారులు మరింత ఆందోళన చెందుతున్నారు. ఈ నగరంలో 239 కేసులు నమోదవగా 45 మంది మరణించారు.


తొలి ‘ప్లాస్మా’ చికిత్స పొందిన డాక్టర్‌ మృతి     

యూలో తొలి ప్లాస్మా థెరపీ చికిత్స పొంది న కరోనా రోగి మృతి చెందారు. కరోనా రోగులకు చికిత్స అందించిన ఓ ప్రభుత్వ వైద్యుడి (58)కి వైరస్‌ సోకింది. ఆయనకు ప్లాస్మా థెరపీ చేయగా కోలుకున్నారు. శనివారం రెండో సారి నిర్వహించిన పరీక్షలోనూ నెగెటివ్‌ వచ్చింది. అయితే ఆయనకు మధుమేహంతో పాటు కిడ్నీ సమస్య కూడా ఉందని వైద్యులు తెలిపారు. రెండుసార్లు డయాలసిస్‌ చేసినప్పటికీ ఫలితం లేకపోయిందని కిడ్నీ పనిచేయకపోవడంతో చనిపోయారని వెల్లడించారు. 


కేరళకు వచ్చిన మరో ముగ్గురికి పాజిటివ్‌            

కేరళలో మరో ముగ్గురికి పాజిటివ్‌ వచ్చింది. అబుధాబి, దుబాయ్‌ నుంచి 363 మంది శనివారం కేరళ చేరుకున్నారు. ప్రత్యేక విమానాల్లో వచ్చిన వీరికి పరీక్షలు చేయగా.. శనివారం ఇద్దరికి పాజిటివ్‌ రాగా.. ఆదివారం మరో ముగ్గురికి వైరస్‌ సోకినట్లు తేలింది. ఈ 5 కేసులతో కలిపి కేరళలో 20 యాక్టివ్‌ కేసులున్నా యి. విదేశాల్లో చిక్కుకున్న వారికి పరీక్షలు చేయకుండా తీసుకొస్తే ప్రమాదమని కేరళ సీఎం విజయన్‌ ప్రధానికి రాసిన లేఖలో ఆం దోళన వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే.


15 జిల్లాల్లోనే 64 శాతం కేసులు!

దేశంలోని మొత్తం కొవిడ్‌-19 కేసుల్లో 15 జిల్లాల్లోనే 64ు ఉన్నట్లు నీతి ఆయోగ్‌ సీఈవో అమితాబ్‌ కాంత్‌ తెలిపారు. వీటిలోని 5(ఢిల్లీ, పుణె, ముంబై, అహ్మదాబాద్‌, చెన్నై) జిల్లాల్లోనే 50ు కేసులున్నాయన్నారు. మొత్తం ఢిల్లీ, ముంబైలను జిల్లాలుగా పరిగణించినట్లు చెప్పారు. ‘‘ఈ ఐదు నగరాలే దేశానికి కీలకంగా మారాయి. ఆయా రాష్ట్రాలు కట్టడి వ్యూహాలను పటిష్ఠం చేయడంతో పాటు విస్తృతంగా పరీక్షలు చేయాలి. కాంటాక్ట్‌లను గుర్తించాలి’’ అని కాంత్‌ పేర్కొన్నారు. 


Updated Date - 2020-05-11T07:21:14+05:30 IST