అసెంబ్లీ ఎన్నికల్లో విజయకాంత్ పోటీ ఇక్కడ్నుంచే..?
ABN , First Publish Date - 2020-12-15T17:34:17+05:30 IST
ఎండీకే అధ్యక్షుడు, సినీ నటుడు విజయకాంత్ వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో

చెన్నై : డీఎండీకే అధ్యక్షుడు, సినీ నటుడు విజయకాంత్ వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో చెన్నై విరుగంబాక్కం నియోజకవర్గంలో పోటీ చేయనున్నారని తెలిసింది. విజయకాంత్ ఇప్పటివరకూ రెండుసార్లు శాసనసభ్యుడిగా గెలిచారు. 2006లో విరుదాచలం నియోజకవర్గంలో పోటీ చేసి విజయకాంత్ శాసనసభ్యుడిగా గెలిచి అసెంబ్లీలో అడుగుపెట్టారు. ఆ తర్వాత 2011లో అన్నాడీఎంకేతో పొత్తుపెట్టుకుని డీఎండీకే 41 స్థానాల్లో పోటీ చేసింది. రిషివంద్యం నియోజకవర్గంలో పోటీ చేసిన విజయకాంత్ గెలిచారు. అంతేకాకుండా ఆ ఎన్నికల్లో డీఎండీకే ప్రధాన ప్రతిపక్షంగా అవతరించింది.
విజయకాంత్ ప్రతిపక్షనాయకుడిగా కేబినెట్ హోదా కూడా పొందారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో వామపక్షాలు, ఎండీఎంకే పార్టీలతో తృతీయ కూటమి ఏర్పాటు చేసి పోటీ చేసిన డీఎండీకే ఓటమి పాలైంది. ఈ నేపథ్యంలో వచ్చే యేడాది జరుగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో విజయకాంత్ పోటీ చేయడానికి అనువైన నియోజకవర్గాల ఎంపికపై ఆ పార్టీ నాయకులు పరిశీలించారు. విజయకాంత్ ఆరోగ్య పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ఆయన నివాసప్రాంత శాలిగ్రామానికి చేరువగా ఉన్న విరుగంబాక్కం అసెంబ్లీ నియోజకవర్గంలో పోటీ చేయడం అన్నివిధాలా శ్రేయస్కరమని పార్టీ సీనియర్ నేతలు తెలిపారు.
విరుగంబాక్కంలో పోటీ చేస్తే విజయకాంత్ చేరువగా ఉన్న ఆ నియోజకవర్గంలో సులువుగా ప్రచారంచేసుకునే వీలుంటుందని కూడా ఆ నేతలు చెప్పారు. విజయకాంత్ కూడా ఆ నియోజకవర్గంలో పోటీ చేయడానికి ఆసక్తి కనబరుస్తున్నట్టు తెలుస్తోంది. ఇదిలా వుండగా వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో అన్నాడీఎంకేతో పొత్తు కొనసాగించడానికి 41 అసెంబ్లీ నియోజకవర్గాలను కేటాయించమంటూ డిమాండ్ చేయనున్నట్టు విశ్వసనీయంగా తెలిసింది.
