రజనీ నిష్క్రమణం.. విజయ్ అనూహ్య నిర్ణయం..?
ABN , First Publish Date - 2020-12-30T16:26:34+05:30 IST
అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తుండటంతో ప్రముఖ తమిళ సినీనటుడు ‘ఇళయదళపతి’ విజయ్ తన మక్కల్ మయ్యం జిల్లా ...

అన్నాడీఎంకేకు విజయ్ మద్దతు ?
చెన్నై(ఆంధ్రజ్యోతి): అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తుండటంతో ప్రముఖ తమిళ సినీనటుడు ‘ఇళయదళపతి’ విజయ్ తన మక్కల్ మయ్యం జిల్లా శాఖల నాయకులు, కార్యదర్శులతో విరివిగా చర్చలు జరుపుతున్నారు. ఎన్నికల్లో ఏ పార్టీ కూటమి మద్దతు ఇవ్వాలనే విషయంపైనే గత వారం రోజులుగా విజయ్ మక్కల్ మయ్యం నేతలతో సుదీర్ఘంగా చర్చిస్తున్నారు. గత ఏప్రిల్‌లో షూటింగ్ పూర్తి చేసుకున్న విజయ్ చిత్రం ‘మాస్టర్’ సంక్రాంతి పండుగకు విడుదలవుతోంది. ప్రస్తుతం థియేటర్లలో 50 శాతం మంది ప్రేక్షకులనే అనుమతిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో తన ‘మాస్టర్’ చిత్రానికి ఆశించినంత కలెక్షన్లు రావని భావించిన విజయ్ ఆదివారం రాత్రి ముఖ్యమంత్రి పళనిస్వామిని కలుసుకున్నారు. జనవరి నుంచి థియేటర్లలో పూర్తి సామర్థ్యం మేరకు ప్రేక్షకులను అనుమతించేలా ఉత్తర్వులు జారీ చేయాలని ముఖ్యమంత్రికి విజ్ఞప్తి చేశారు.
విజయ్ వినతిని సానుభూతితో పరిశీలిస్తానని సీఎం హామీ ఇచ్చారు. ఈ పరిస్థితుల్లోనే విజయ్ రాజకీయ ప్రవేశంపై తన నిర్ణయాన్ని ఆకస్మికంగా వాయిదా వేసుకున్నారని తెలుస్తోంది. అంతేకాకుండా తన మక్కల్ ఇయక్కమ్ నేతలతో చర్చించిన మీదట అసెంబ్లీ ఎన్నికల్లో ఏ పార్టీ కూటమికి మద్దతివ్వాలన్న విషయంపై ఈ పాటికే విజయ్ ఓ నిర్ణయానికి వచ్చినట్టుగా తెలుస్తోంది. ఎన్నికల నోటిషికేషన్ విడుదలైన తరువాత విజయ్ మక్కల్ మయ్యం నిర్వాహకులకు ఎవరికి ఓటు వేయాలనే విషయంపై సుదీర్ఘ ప్రకటన చేస్తారని చెబుతున్నారు. ఆ ప్రకటనలో అధికార అన్నాడీఎంకేకు ఓటువేయాలని నేరుగా ప్రకటించకున్నా, పరోక్షంగా ఆ పార్టీ పేరును ప్రస్తావిం చకుండా మద్దతివ్వమంటూ విజయ్ కోరనున్నారని మక్కల్ ఇయక్కమ్ నిర్వాహకులు చెబుతున్నారు. ప్రస్తుతం చెన్నై శివారు ప్రాంతమైన పనయూరులోని విజయ్ ఫామ్‌హౌస్‌లో మక్కల్ ఇయ్యక్కమ్ నిర్వాహకులు గత రెండు వారాలుగా తిష్టవేశారని తెలిసింది. అసెంబ్లీ ఎన్నికల్లో ఎవరికి మద్దతు ఇవ్వాలనే ప్రకటనను రూపొందించడంలో వారు బిజీగా ఉన్నారని కూడా చెబుతున్నారు.