కేసు దర్యాప్తు రోజే అత్యాచార బాధితురాలి తండ్రి హత్య

ABN , First Publish Date - 2020-02-12T16:29:11+05:30 IST

ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో మరో దారుణం వెలుగుచూసింది. అత్యాచార బాధితురాలి తండ్రిని హతమార్చిన ఘటన....

కేసు దర్యాప్తు రోజే అత్యాచార బాధితురాలి తండ్రి హత్య

ఫిరోజాబాద్ (ఉత్తరప్రదేశ్): ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో మరో దారుణం వెలుగుచూసింది. అత్యాచార బాధితురాలి తండ్రిని హతమార్చిన ఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని తిలక్ నగర్ లో జరిగింది. షికోహాబాద్ పట్టణానికి చెందిన ఓ బాలికపై యువకుడు అత్యాచారం చేశాడు. దీనిపై పోలీసులు ఆరు నెలల క్రితం పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. ఈ కేసు మంగళవారం విచారణకు వచ్చింది. బాలికపై అత్యాచారం కేసు దర్యాప్తు రోజే బాధిత బాలిక తండ్రిని గుర్తుతెలియని వ్యక్తి హతమార్చడం సంచలనం రేపింది. అత్యాచార బాధిత బాలిక తండ్రి తీవ్ర గాయాలతో అపస్మారక స్థితిలో ఉండగా అతన్ని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వైద్యులు పరీక్షించి బాలిక తండ్రి మరణించాడని ధ్రువీకరించడంతో మృతదేహాన్ని పోస్టుమార్టం చేయించారు. బాధిత బాలిక తల్లికి గతంలో ఆగంతకుల నుంచి బెదిరింపు ఫోన్ కాల్స్ వచ్చినా పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. దీంతో బాలిక అత్యాచారం కేసు దర్యాప్తునకు వచ్చిన రోజే తండ్రిని హతమార్చారని మృతుడి సోదరుడు పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాధిత బాలిక కుటుంబసభ్యులకు బెదిరింపులు వచ్చినా పట్టించుకోని పోలీసు అధికారులిద్దరినీ ఫిరోజాబాద్ ఎస్పీ సస్పెండ్ చేశారు. బాలిక తండ్రిని హతమార్చిన వారిని పట్టుకునేందుకు ఐదు ప్రత్యేక పోలీసు బృందాలను ఏర్పాటు చేశారు. హంతకుడి ఆచూకీ చెప్పిన వారికి రూ.50వేల రివార్డు ఇస్తామని ఆగ్రా ఐజీ సతీష్ ప్రకటించారు.

Updated Date - 2020-02-12T16:29:11+05:30 IST