భారత రాజ్యాంగమే సర్వోన్నతం: ఉపరాష్ట్రపతి

ABN , First Publish Date - 2020-11-26T00:15:39+05:30 IST

కెవాడియా (గుజరాత్) సర్వోన్నతమైన రాజ్యాంగానికి లోబడే న్యాయ, శాసన, కార్యనిర్వాహక వ్యవస్థలు తమ విధులను నిర్వహించాల్సి ఉంటుందని.. ఏ ఒక్క విభాగమూ రాజ్యాంగానికి అతీతమైనది కాదని గౌరవ ఉపరాష్ట్రపతి, రాజ్యసభ చైర్మన్ వెంకయ్యనాయుడు స్పష్టం చేశారు.

భారత రాజ్యాంగమే సర్వోన్నతం: ఉపరాష్ట్రపతి

గుజరాత్: కెవాడియా (గుజరాత్) సర్వోన్నతమైన రాజ్యాంగానికి లోబడే న్యాయ, శాసన, కార్యనిర్వాహక వ్యవస్థలు తమ విధులను నిర్వహించాల్సి ఉంటుందని.. ఏ ఒక్క విభాగమూ రాజ్యాంగానికి అతీతమైనది కాదని గౌరవ ఉపరాష్ట్రపతి, రాజ్యసభ చైర్మన్ వెంకయ్యనాయుడు స్పష్టం చేశారు. గుజరాత్‌లోని కెవాడియాలో ‘శాసన, కార్యనిర్వాహక, న్యాయ వ్యవస్థల మధ్య సమన్వయమే సామరస్యపూర్వకమైన ప్రజాస్వామ్యానికి కీలకం’ అనే ఇతివృత్తంతో జరుగుతున్న 80వ అఖిల భారత సభాపతుల సదస్సు ప్రారంభం సందర్భంగా ఉపరాష్ట్రపతి మాట్లాడుతూ.. కీలకమైన ఈ మూడు విభాగాలకు వేటికవే ప్రాధాన్యమైన వ్యవస్థలని, జాతి నిర్మాణంలో ఈ వ్యవస్థలు సామరస్యపూర్వకంగా కలసి పనిచేసుకుంటూ ముందుకెళ్లాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.


ఇటీవలి కాలంలో ఈ మూడు విభాగాలు ఒకరి విధుల్లో మరొకరి జోక్యం కారణంగా వస్తున్న సమస్యలపై ఆవేదన వ్యక్తం చేసిన ఆయన, ఈ విధానం ఎవరికీ మేలు చేయదని.. అంతిమంగా దేశ సమగ్రతకు, రాజ్యాగ పవిత్రతతకు భంగం కలుగుతుందని అభిప్రాయపడ్డారు. చట్టసభల పనితీరులో వస్తున్న మార్పులు ఆందోళనకరమన్న ఉపరాష్ట్రపతి, సభాపతులను ప్రజాస్వామ్య దేవాలయ పూజారులుగా అభివర్ణించారు. ఈ దేవాలయాల పవిత్రతను కాపాడాల్సిన బాధ్యత వారిమీదే ఉందని పేర్కొన్నారు.


శాసన వ్యవస్థ ప్రజాస్వామ్య మూలస్తంభమన్న రాజ్యసభ చైర్మన్ ఇక్కడ తీసుకునే నిర్ణయాలే కార్యనిర్వాహక వ్యవస్థ, న్యాయవ్యవస్థలు తమ విధులు నిర్వహించేందుకు ఆధారాన్ని కల్పిస్తాయన్నారు. అయితే కొంతకాలంగా చట్టాలను రూపొందించే సంస్థలపై, చట్టసభల సభ్యులపై ప్రజాభిప్రాయం మారుతున్న విషయాన్ని గమనించాలని సూచించారు. చట్టసభల కార్యకలాపాలకు తరచుగా అంతరాయాలు కలగటం, చట్టసభల సభ్యుల ప్రవర్తన కారణంగా ప్రజల్లో వ్యతిరేక భావన పెరుగుతోందని తెలిపారు.


2014లో కీలకమైన ప్రశ్నోత్తరాల సమయాన్ని రాజ్యసభలో 11 గంటలనుంచి 12 గంటలకు పెంచినప్పటికీ.. తరచుగా జరుగుతున్న అవాంతరాలు, వాయిదాల కారణంగా ప్రశ్నోత్తరాల సమయంలో 60శాతం వృధా అవుతున్న విషయాన్ని రాజ్యసభ చైర్మన్ ఈ సందర్భంగా గుర్తుచేశారు. 2010-14 మధ్యలో 11 గంటలకు ప్రశ్నోత్తరాల సమయం ఉన్నప్పుడు 32.39 శాతం సమయం మాత్రమే సద్వినియోగం అయ్యేదని.. 2015లో దీన్ని 12 గంటలకు మార్చినప్పటికీ.. ప్రశ్నోత్తరాల సమయంలో కేవలం 26.25 శాతం మాత్రమే సద్వినియోగం అయిన విషయాన్ని ఆయన ప్రస్తావించారు.


ఆ తర్వాత తీసుకున్న వివిధ నిర్ణయాల కారణంగా 2015-19 మధ్యలో ప్రశ్నోత్తరాల సమయం సద్వినియోగం 42.39 శాతానికి పెరిగిందన్నారు. అయినప్పటికీ దాదాపు 60 శాతం మేర విలువైన సమయం వృధా అవుతున్న విషయం ఆందోళనకరమని తెలిపారు.1997లో భారత స్వాతంత్ర్యానికి 50 ఏళ్లు పూర్తయిన సందర్భంగా.. ప్రశ్నోత్తరాల సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలని, సభ్యులు చట్టసభల వెల్‌లోకి రాకూడదని.. పార్లమెంటు ఉభయసభలు ఏకగ్రీవంగా నిర్ణయించినప్పటికీ రాజ్యసభలో ప్రశ్నోత్తరాల సమయం నూరు శాతం సద్వినియోగం  కావడం లేదన్న ఉపరాష్ట్రపతి, గత 30 ఏళ్లుగా ప్రశ్నోత్తరాల సమయం సద్వినియోగం తగ్గుతూ వస్తోందన్నారు.


‘ప్రజాస్వామ్య దేవాలయాల సభ్యత, మర్యాద, గౌరవాన్ని కాపాడాలి. అది కేవలం చర్చించడం, తార్కిక విశ్లేషణ, సరైన నిర్ణయాలు తీసుకోవడం ద్వారానే సాధ్యమవుతుంది’ అని స్పష్టం చేసిన ఉపరాష్ట్రపతి, 1993లో ప్రవేశపెట్టిన వివిధ విభాగాలకు సంబంధించిన పార్లమెంటు స్టాండింగ్ కమిటీలను ప్రశంసించారు. పార్లమెంటు తరపున బిల్లుల సంపూర్ణ పరిశీలన, నిధులు అడగటం సహా అనేక ఇతర అంశాల్లో ఈ కమిటీలు పోషిస్తున్న పాత్ర అభినందనీయమన్నారు. ఇలాంటి కమిటీలను రాష్ట్ర అసెంబ్లీల్లోనూ ప్రవేశపెట్టడంపై దృష్టి సారించాలని సభాపతులకు సూచించారు.


శాసన, న్యాయ, కార్యనిర్వాహక వ్యవస్థల సామరస్యపూర్వక విధుల నిర్వహణ అత్యవసరమన్న ఉపరాష్ట్రపతి, రాజ్యాంగం తమకు కల్పించిన హక్కులను అధిగమించి, లక్ష్మణరేఖను దాటాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. ‘ఈ మూడు కీలకమైన వ్యవస్థలు ఇతరుల విధుల్లో జోక్యం చేసుకోకుండా.. తమ విధులను సరిగ్గా నిర్వహిస్తే ఏ సమస్యా ఉండదు. ఇటీవలి కాలంలో జరుగుతున్న ఘటనలు పునరావృతం కాకుండా.. రాజ్యాంగ పరిధులకు లోబడి పనిచేయాలి. మరొకరిపై తమదే పైచేయి అనే భావన ఎవరికీ ఉండకూడదు’ అని ఉపరాష్ట్రపతి సూచించారు.


దీపావళి సందర్భంగా టపాసులు కాల్చే విషయంలో నిర్ణయం, పోలీసు విచారణ పర్యవేక్షణ, జడ్జీల నియామకం లాంటి న్యాయవ్యవస్థ జోక్యం చేసుకున్న సందర్భాలను సైతం ఉపరాష్ట్రపతి ప్రస్తావించారు.ఈ కార్యక్రమంలో భారత రాష్ట్రపతి శ్రీ రామ్‌నాథ్ కోవింద్, లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా, గుజరాత్ ముఖ్యమంత్రి  విజయ్ రూపాణి, గుజరాత్ గవర్నర్ ఆచార్య దేవ్‌వ్రత్, పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి  ప్రహ్లాద్ జోషి, పార్లమెంటరీ వ్యవహారాల సహాయమంత్రి  అర్జున్ రామ్ మేఘ్వాల్, లోక్‌సభలో విపక్ష పార్టీ నాయకుడు అధిర్ రంజన్ చౌదరీ, గుజరాత్ అసెంబ్లీ స్పీకర్ రాజేంద్ర త్రివేది సహా.. వివిధ రాష్ట్రాలకు చెందిన సభాపతులు పాల్గొన్నారు.

Updated Date - 2020-11-26T00:15:39+05:30 IST