దార్శనికుడు, తపస్వి పీవీ

ABN , First Publish Date - 2020-12-28T08:24:05+05:30 IST

దేశ విశాల, విస్తృత ప్రయోజనాలకోసం కఠిన నిర్ణయాలు తీసుకోక తప్పదని మాజీ ప్రధాని పీవీ నరసింహారావు స్పష్టం చేశారని.. ఆయన ఆనాడు దార్శనికుడుగా అమలు చేసిన ఆర్థిక, పారిశ్రామిక సంస్కరణలే...

దార్శనికుడు, తపస్వి పీవీ

  • వెంకయ్య ఘన నివాళి
  • పీవీ ప్రారంభించిన సంస్కరణలనే మోదీ కొనసాగిస్తున్నారు
  • ‘విప్లవ తపస్వి-పీవీ’ పుస్తకాన్ని ఆవిష్కరించిన ఉపరాష్ట్రపతి

న్యూఢిల్లీ/హైదరాబాద్‌, డిసెంబరు 27 (ఆంధ్రజ్యోతి): దేశ విశాల, విస్తృత ప్రయోజనాలకోసం కఠిన నిర్ణయాలు తీసుకోక తప్పదని మాజీ ప్రధాని పీవీ నరసింహారావు స్పష్టం చేశారని.. ఆయన ఆనాడు దార్శనికుడుగా అమలు చేసిన ఆర్థిక, పారిశ్రామిక సంస్కరణలే ఇవాళ దేశంలో సర్వతోముఖాభివృద్ధి జరిగేందుకు కారణమయ్యాయని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు. పీవీ ప్రవేశపెట్టిన సంస్కరణల ఫలితాలు ఇప్పుడు కనిపిస్తున్నాయని, వ్యవసాయ సంస్కరణలను కూడా ఆయన ప్రారంభించి ఆహార ధాన్యాల రవాణాపై ఆంక్షలు ఎత్తివేశారని ఆయన చెప్పారు.


తన సంస్కరణలు తిరుగులేనివని పీవీ స్పష్టం చేసిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. ఆత్మనిర్భర్‌ అంటే.. స్వావలంబన, స్వయం సమృద్ధికి ఆ నాడే పీవీ పెద్ద పీట వేశారని, దాంతో పరిశ్రమలు, శాస్త్ర, సాంకేతికరంగాల్లో అంతర్జాతీయ దేశాల సరసన భారత్‌ నిలబడ కలిగిందంటూ పీవీకి ఘన నివాళి అర్పించారు. అటల్‌ బిహారీ వాజపేయి నుంచి మోదీ వరకు అంతా పీవీ దారిలోనే ఆర్థిక సంస్కరణలను వేగవంతంగా అమలు చేశారన్నారు. సీనియర్‌ జర్నలిస్టు, ఢిల్లీలో ‘ఆంధ్రజ్యోతి’ అసోసియేట్‌ ఎడిటర్‌ ఎ.కృష్ణారావు రచించిన విప్లవ తపస్వి-పీవీ అన్న పుస్తకాన్ని ఆయన ఆవిష్కరించారు. మైనారిటీ ప్రభుత్వం అయినప్పటికీ పీవీ రాజకీయ పండితుల అంచనాలను తలకిందులు చేసి దేశం ఎదుర్కొంటున్న అనేక సమస్యలను పరిష్కరించే ప్రయత్నం చేశారన్నారు. లైసెన్స్‌రాజ్‌ను రద్దు చేసి ప్రభుత్వానికి విచక్షణాధికారాలు తొలగించి ఎగుమతులకు ప్రోత్సాహం ఇవ్వడమే కాక దిగుమతుల విధానాలను సరళతరం చేశారన్నారు. విదేశీ పెట్టుబడులు,  బ్యాంకింగ్‌ , టెలికం, విమానయానం, విద్యుత్తు రంగం, కరెన్సీ, కేపిటల్‌ మార్కెట్లు, ప్రభుత్వ- ప్రైవేట్‌ భాగస్వామ్యం వంటి అనేక రంగాల్లో వినూత్న సంస్కరణలను ప్రవేశపెట్టారని తెలిపారు. దేశ ఆర్థిక వ్యవస్థను సమూలంగా మార్చేసిన పీవీకి దురదృష్టవశాత్తు ఆయన పార్టీలోనే సరైన గుర్తింపు లభించలేదని ఉపరాష్ట్రపతి ఆవేదన వ్యక్తం చేశారు. ‘పీవీ అనేక మొక్కలు నాటారు. ఆ మొక్కలు ఇప్పుడు బలమైన వృక్షాలుగా మారుతున్నాయని ఆయన చెప్పారు. ఇప్పుడిప్పుడే పెరుగుతున్న మొక్కను దారిన వెళ్లే మేక కూడా తినిపారేయగలదు. కానీ అది పెరిగి బలమైన కాండంగా, మహావృక్షంగా మారితే ఏనుగును కూడా దానికి కట్టేయగలమని పీవీయే ఒక సందర్భంలో చెప్పారు’ అని వెంకయ్య గుర్తుచేశారు. స్థానిక ఎన్నికలు, మహిళలకు రిజర్వేషన్‌, పార్లమెంట్‌ స్థాయూ సంఘాలు, ఎంపీ లాడ్స్‌ వంటి అనేక నిర్ణయాలు ఆయన తీసుకున్నారని తెలిపారు. ఒక తపస్విలా, యోగిలా దేశానికి ఏది అవసరమో అది చేపట్టిన ద్రష్ట పీవీ అనడంలో ఎలాంటి సందేహం లేదన్నారు.


బహుభాషా కోవిదుడు, సాహితీవేత్త, పండితుడు, స్వాతంత్య్ర సమరయోధుడు అయిన పీవీ లాంటి వారి జీవితాలను యువతరం అధ్యయనం చేయాలని సూచించారు. పీవీ పై పుస్తకం రచించిన కృష్ణారావు పాత్రికేయ వృత్తిలో ఎన్నో ఏళ్లుగా ఉన్నప్పటికీ రాజీపడకుండా కొనసాగుతున్నారని, ఆయన పీవీ కాలంలో అనేక ఘట్టాల గురించి తన స్వానుభవంతో ఈ పుస్తకం రాశారని ప్రశంసించారు. సమావేశంలో రాజ్యసభ సభ్యుడు, పీవీ శతజయంతి ఉత్సవాల కమిటీ చైర్మన్‌ కె. కేశవరావు, రాఘవేంద్ర పబ్లికేషన్స్‌ ప్రచురణకర్త రాఘవేంద్రరావు తదితరులు పాల్గొన్నారు. 


Updated Date - 2020-12-28T08:24:05+05:30 IST