దేశ చరిత్రలో సరికొత్త అధ్యాయం.. నూతన పార్లమెంట్ భవనం శంకుస్థాపనపై ఉపరాష్ట్రపతి

ABN , First Publish Date - 2020-12-11T00:23:43+05:30 IST

నూతన పార్లమెంటు భవన శంకుస్థాపన భావితరాల అభ్యున్నతికి పునాది వంటిదని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు. భారతీయ పార్లమెంటరీ ప్రజాస్వామ్య చరిత్రలో సరికొత్త అధ్యాయం మొదలైందని...

దేశ చరిత్రలో సరికొత్త అధ్యాయం.. నూతన పార్లమెంట్ భవనం శంకుస్థాపనపై ఉపరాష్ట్రపతి

న్యూఢిల్లీ: నూతన పార్లమెంటు భవన శంకుస్థాపన భావితరాల అభ్యున్నతికి పునాది వంటిదని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు. భారతీయ పార్లమెంటరీ ప్రజాస్వామ్య చరిత్రలో సరికొత్త అధ్యాయం మొదలైందని వ్యాఖ్యానించారు. పూర్వీకులతో పాటు భవిష్యత్ తరాలకు కూడా నూతన పార్లమెంట్ ఐకానిక్ సింబల్‌గా మారనుందని విశ్లేషించారు. ఈ మేరకు తన అధికారిక ట్విటర్ ఖాతా ద్వారా ఆయన ఓ సందేశాన్ని షేర్ చేశారు. నూతన పార్లమెంట్ భవన నిర్మాణం విషయంలో తాను ఎంతో సంతోషంగా ఉన్నానని, అంతటి మహత్కార్యాన్ని స్వయంగా ప్రారంభిస్తున్న ప్రధాని నరేంద్ర మోదీకి ప్రత్యేక అభినందనలని వెంకయ్య తెలిపారు. నూతనంగా నిర్మించనున్న పార్లమెంటు భవనం దేశ ప్రజాస్వామ్య మూలాలకు మరింత బలం చేకూర్చాలని, భారత సంప్రదాయమైన మాటల ద్వారా చర్చించుకోనే విధానానికి మరింత వన్నె తీసుకురావాలని ఆశిస్తున్నానంటూ వెంకయ్య అన్నారు.
దేశ రాజకీయాలతో పాటు ప్రజల జీవితాల్లోనూ ఈ సౌధం మార్పు తీసుకురావాలని కోరుకుంటున్నానని, ఈ చారిత్రక దినాన పార్లమెంటు సభ్యులందరితో పాటు దేశ ప్రజలకు కూడా మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నానని చెప్పారు. దేశ ప్రజాస్వామ్యానికి పవిత్ర పుణ్యక్షేత్రం వంటి ఈ మహాసౌధం అతి త్వరలో పూర్తి కావాలని కోరుకుంటున్నట్లు తన ట్వీట్‌లో పేర్కొన్నారు.

Updated Date - 2020-12-11T00:23:43+05:30 IST