కరోనాపై పోరులో మీడియా పాత్ర అసమానం: ఉపరాష్ట్రపతి

ABN , First Publish Date - 2020-07-19T17:04:43+05:30 IST

కరోనాపై పోరులో మీడియా పాత్ర అసమానమని ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు ప్రశంసలు కురిపించారు.

కరోనాపై పోరులో మీడియా పాత్ర అసమానం: ఉపరాష్ట్రపతి

ఇంటర్నెట్ డెస్క్: కరోనాపై పోరులో మీడియా పాత్ర అసమానమని ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు ప్రశంసించారు. వైద్యులు, ఆరోగ్య కార్యకర్తలు, పోలీసులతో కలిసి మీడియా ముందు వరుసలో నిలబడి కరోనాతో పోరాటం చేస్తోందన్నారు. మీడియాను అభినందిస్తూ, దాని పాత్రను వివరిస్తూ ప్రత్యేక వ్యాసం రాసిన ఆయన... సరైన సమాచారం అందించే చర్యల ద్వారా, అభివృద్ధి దిశగా సాధికార మార్గాన్ని చూపే వ్యవస్థగా మీడియా ఉందని తెలిపారు. ప్రస్తుతం పరీక్షా కాలంలో ‘డి’ అక్షరానికి తాను చెప్పిన అభివృద్ధి (డెవలప్ మెంట్) అనే అర్థం పూర్తిగా మారిపోయిందన్నారు. బహుశా విపత్తు నిర్వహణ (Disaster management)గా అర్థం చేసుకోవచ్చని పేర్కొన్నారు. మరో విధంగా చెప్పాలంటే దీన్ని మహమ్మారితో వ్యహరించటం(Dealing with the pandemic) గానూ అనుకోవచ్చన్నారు. ప్రజల సాధికారతకు ఓ ముఖ్యమైన సాధనంగా మీడియాకు ఇంతకు ముందు తాను ఇచ్చిన నిర్వచనం ఏ పరిస్థితికైనా వర్తిస్తుందన్నారు. ప్రస్తుత మహమ్మారి నేపథ్యంలో ఇది మరింత ఎక్కువని తెలిపారు. ఈ కరోనా మహమ్మారి విస్తృతంగా విస్తరిస్తున్న నేపథ్యంలో ఎప్పటికప్పుడు సమాచారాన్ని అందించడం, అవసరమైన విధంగా అవగాహన కల్పించడం, పూర్తి వివరాలు తెలియజేయటం లాంటి అంశాల్లో మీడియా పోషించిన అపూర్వమైన పాత్రను తాని ప్రత్యేకంగా అభినందిస్తున్నానని అన్నారు. ఎటూ పాలు పోని స్థితిలో ఈ వైరస్ వ్యాప్తి వెనుక కారణాలు ఏమిటి, తదుపరి పర్యవసానాలు ఏమిటి, ఇంకెంత కాలం ఈ వైరస్ గురించి ఆందోళన చెందాలి లాంటి ప్రశ్నల నేపథ్యంలో మనమంతా సమాచారం కోసం మీడియా వైపు చూశామని తెలిపారు. ఈ ఏడాది జనవరి నుంచి వార్తా పత్రికలు, టెలివిజన్ ఛానళ్ళు, సామాజిక మాథ్యమాలు అవగాహనను మరింత పెంచే దిశలో ముందడుగు వేశాయన్నారు.  


మీడియాకు సంబంధించిన కొన్ని విభాగాలు ముఖ్యంగా టెలివిజన్ మాత్రం ఇక నుంచి పరిస్థితిని ఉన్నది ఉన్నట్టుగా తెలియజేసే ప్రయత్నాలు చేయాలే తప్ప, సంచలనాత్మక కథనాలు ప్రసారం చేయాలనే దృష్టితో అనవసరమైన భయాందోళనలను సృష్టించటం ద్వారా ఎలాంటి ప్రయోజనం ఉండదు. ఎందుకంటే ప్రజలు తమ మనసుల నుంచి కరోనా భయాన్ని ఇప్పుడిప్పుడే అధిగమిస్తున్నారని ఆయన అన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో వాస్తవదూరమైన సంచలన అంశాలు ఘోరమైన పరిణామాలకు దారి తీస్తాయన్నారు. అందుకే టెలివిజన్‌లోని కొన్ని విభాగాలకు సంబంధించి వారు జాగ్రత్త వహించాలని తెలిపారు. వాస్తవ పరిస్థితులను తెలియజేయడం ద్వారా, ప్రజల్లో నెలకొన్న భయాందోళనలు తొలగించాలి.


మిగతా వాళ్ళందరిది ఒక పరిస్థితి అయితే, సామాజిక మాధ్యమాలది మరో కథని, మరింత ప్రత్యేకమైన దీని స్వభావం కారణంగా లాక్ డౌన్ సమయంలో సులభంగా అందరికీ అందుబాటులో ఉండేందుకు ఇది చాలా సహాయపడిందన్నది నిర్వివాదాంశని తెలిపారు. ఏదేమైనా ఈ మహమ్మారి గురించి అనధికారిక, ధృవీకరణ కాని సమాచారాన్ని విస్తృతంగా వ్యాప్తి చేయడం ద్వారా అనేక అపోహలకు తావు ఇవ్వడమే గాక, ఎన్నో ప్రతికూల పరిస్థితులకు కూడా కారణమౌతోందన్నారు. దీన్ని లెక్కించలేమని, అందుకే సామాజిక మాధ్యమాలను వినియోగిస్తున్న వారు నిజానిజాలు తెలుసుకోకుండా సమాచారాన్ని వ్యాప్తి చేయకూడదని సూచించారు. ఈ విషయంలో స్వీయ నియంత్రణ చాలా అవసరన్నారు. పూర్తి ప్రామాణికమైన సమాచారాన్ని మాత్రమే వ్యాప్తి చేయాలనే విషయాన్ని నెటిజన్లు ఎల్లప్పుడూ గుర్తుంచుకోవాలన్నారు. ధృవీకరించిన సమాచారం ఎప్పుడూ సమర్థవంతమైన విస్ఫోటన సామగ్రి కంటే బలమైనదని, తాను ఎన్నో మార్లు చెబుతూ వచ్చానన్నారు. అది సానుకూలమైన పరిస్థితులను కల్పిస్తుందన్నారు. అలా కాకుండా ఎలాంటి ధృవీకరణ లేని సమాచారం వల్ల అవాంఛనీయ పరిణామాలు చోటు చేసుకునే ప్రమాదం ఉందన్నారు. 

Updated Date - 2020-07-19T17:04:43+05:30 IST