ఆచార్య ఎన్జీరంగా జయంత్యుత్సవాలను ప్రారంభించిన ఉపరాష్ట్రపతి

ABN , First Publish Date - 2020-11-07T22:10:58+05:30 IST

ఆచార్య ఎన్జీరంగా 120వ జయంత్యుత్సవాలను ఉపరాష్ట్రపతి నివాసంలోని సర్దార్ వల్లభభాయ్ పటేల్ సమావేశ ప్రాంగణం నుంచి అంతర్జాల వేదిక ద్వారా ఉపరాష్ట్రపతి శనివారం ప్రారంభించారు.

ఆచార్య ఎన్జీరంగా జయంత్యుత్సవాలను ప్రారంభించిన ఉపరాష్ట్రపతి

భారతీయ వ్యవసాయ రంగాన్ని సుస్థిరంగా, లాభసాటిగా మార్చేందుకు బహుముఖ వ్యూహాలతో ముందుకెళ్లాల్సిన అవసరం ఉందని గౌరవ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు సూచించారు. ప్రస్తుతం అమలుచేస్తున్న వ్యవసాయ విధానాలను పక్కనపెట్టి తక్కువ స్థలంలో ఎక్కువ వ్యవసాయ ఉత్పత్తి జరిగే దిశగా మన ఆలోచనలు సాగాలన్నారు. రంగా ట్రస్టు ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ఆచార్య ఎన్జీరంగా 120వ జయంత్యుత్సవాలను ఉపరాష్ట్రపతి నివాసంలోని సర్దార్ వల్లభభాయ్ పటేల్ సమావేశ ప్రాంగణం నుంచి అంతర్జాల వేదిక ద్వారా ఉపరాష్ట్రపతి శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘ఆచార్జ ఎన్జీ రంగా ఓ స్వాతంత్ర్య సమరయోధుడు, రైతు నాయకుడు, సంఘసంస్కర్త. వీటన్నింటితోపాటు వారు ఓ గొప్ప పార్లమెంటేరియన్. భారతమాత ముద్దుబిడ్డ అయిన శ్రీ ఎన్జీ రంగా గారు.. స్వామి సహజానంద సరస్వతి గారితో కలిసి భారత రైతు ఉద్యమపితగా కీర్తిగాంచారు’ అని పేర్కొన్నారు. రైతులకు ఆదాయ భద్రత కల్పించడమే ఆచార్య ఎన్జీ రంగా గారికిచ్చే ఘనమైన నివాళి అని ఉపరాష్ట్రపతి అభిప్రాయపడ్డారు. 


ఆచార్య రంగా గారితో తనకున్న వ్యక్తిగత అనుబంధాన్ని గుర్తుచేసుకున్న ఉపరాష్ట్రపతి, తన  జీవితంలో ఎన్జీరంగా గారి ప్రభావం ఎంతగానో ఉందని, రంగా గారు హుందాతనానికి ప్రతీక అని అభివర్ణించారు. రాజకీయాలను, ప్రజాజీవితాన్ని తమ విద్యుక్త ధర్మం (మిషన్)గా భావించి జీవితాంతం విలువలతో కూడిన రాజకీయాలతో ఎందరికో ఆదర్శంగా నిలిచారన్నారు.


ఆచార్య ఎన్జీ రంగా చూపిన నిబద్ధత, విస్తృతమైన పార్లమెంటరీ చర్చలు, వారి హుందాతనాన్ని నేటి యువత తెలుసుకుని ఆచరించాల్సిన అవసరం ఉందన్న ఉపరాష్ట్రపతి, పార్లమెంటులో ఆచార్య రంగా మాట్లాడుతున్నారంటే అందరూ ఆసక్తిగా వినేవారని గుర్తుచేశారు. పార్లమెంటు చర్చల్లో రైతుల గొంతుకను శ్రీ రంగా సమర్థవంతంగా వినిపించేవారని.. రైతులకు వారి శ్రమకు తగ్గ ఫలితాన్ని అందేలా కృషిచేశారన్నారు. కానీ ప్రస్తుతం సభాచర్చల్లో, సభలో సభ్యులు వ్యవహరించే తీరులో ప్రమాణాలు తగ్గిపోతుండటం.. రాజ్యసభ చైర్మన్‌గా తననెంతో ఆవేదనకు గురిచేస్తున్నాయన్నారు. చట్టసభల్లో చర్చలు నిర్మాణాత్మకంగా ఉండాలి తప్ప వివాదాస్పదంగా కాదనే విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోవాలని.. ఇందుకోసం ఎన్జీరంగా జీవితం నుంచి ప్రేరణ పొందాలని ఉపరాష్ట్రపతి సూచించారు. ‘శ్రీ రంగా ప్రారంభించిన రాజకీయ పాఠశాలలు వేలాదిమంది కార్యకర్తలు, నాయకులను తయారుచేశాయి’ అని రంగా కృషిని ఉపరాష్ట్రపతి  ప్రశంసించారు. 


మన సంప్రదాయ వ్యవసాయ విధానానికి, ఆధునిక సాంకేతికతను సమన్వయం చేస్తూ ముందుకెళ్లడం ద్వారానే వ్యవసాయోత్పత్తి పెరిగి అన్నదాత శ్రమకు సరైన గుర్తింపు లభిస్తుందన్న ఉపరాష్ట్రపతి, స్థానికంగా జరిగే పరిశోధనలు, ప్రయోగాలను గుర్తించి సరైన ప్రోత్సాహం అందించడం ద్వారా ఇతర ప్రాంతాల్లో వీటిని సద్వినియోగం చేసుకునేందుకు వీలవుతుందన్నారు. వ్యవసాయ రంగంలో అధునాతన సాంకేతికతను ఉటంకించిన ఆయన, నాగళ్ల స్థానంలో ట్రాక్టర్లు వచ్చినట్లే.. సాంకేతికతలో వచ్చే చిన్న చిన్న మార్పులను స్వాగతించాలని సూచించారు. ప్రపంచవ్యాప్తంగా సాంకేతిక పరిజ్ఞానం కారణంగా వ్యవసాయ రంగంలో వస్తున్న పరివర్తనను గమనించాలని.. వాటికి అనుగుణంగా మనం కూడా ముందుకెళ్లాలని ఈ సందర్భంగా ఉపరాష్ట్రపతి పిలుపునిచ్చారు. బిందుసేద్యం, డ్రోన్లు, సెన్సార్ల వినియోగం లాంటివి భారతీయ వ్యవసాయరంగ వేగాన్ని పెంచిన విషయాన్ని ఆయన ఈ సందర్భంగా గుర్తుచేశారు.


అన్ని వాతావరణ పరిస్థితులను తట్టుకునేలా ఉండే విత్తనాల రకాలను వృద్ధి చేయడంపై శాస్త్రవేత్తలు దృష్టిపెట్టాలన్న ఉపరాష్ట్రపతి.. ఆ దిశగా వ్యవసాయ విశ్వవిద్యాలయాలు మరింత కృషిచేయాలని సూచించారు. కృత్రిమ మేధ వినియోగంతో జపాన్ తదితర దేశాల్లో జరుగుతున్న వ్యవసాయాన్ని అధ్యయనం చేయాలని.. అలాంటి సాంకేతికత వినియోగంలో వెనుకడుగు వేయొద్దని ఆయన సూచించారు.


కరోనా మహమ్మారి నేపథ్యంలోనూ భారత వ్యవసాయ రంగం సాధించిన అద్భుతమైన ఫలితాలపై హర్షం వ్యక్తం చేసిన ఉపరాష్ట్రపతి, మన ఆహారపు అలవాట్లను మార్చుకోవాలని కరోనా మనకు సూచించిన విషయాన్ని గుర్తుచేశారు. తాజా పరిస్థితుల్లో వినియోగదారులు చక్కటి పౌష్టికాహారాన్ని ఆశిస్తున్నారని.. ఇది వ్యవసాయ రంగానికి సరికొత్త అవకాశాన్ని అందించిందనే విషయాన్ని అర్థం చేసుకుని ఆ దిశగా మరింత కృషి చేయాలని సూచించారు. వ్యవసాయాన్ని సుస్థిరం చేయడంతోపాటు లాభసాటిగా మార్చాల్సిన అవసరాన్ని ఉపరాష్ట్రపతి నొక్కిచెప్పారు. 


కొన్ని దశాబ్దాలుగా వాతావరణపరంగా వస్తున్న మార్పులను ప్రస్తావిస్తూ.. రైతులే ఈ వాతావరణమార్పులకు ప్రధాన బాధితులన్నారు. అతివృష్టి, అనావృష్టి ఓ పక్క ఇబ్బందులు పెడుతుంటే మరోవైపు వ్యవసాయ కూలీల లభ్యత  తగ్గడం, సరైన సమయంలో సరైన సూచనలు అందకపోవడం, యాంత్రీకరణ వైపు మొగ్గుచూపకపోవడం, శీతల గిడ్డంగుల సంఖ్య తగినంత లేకపోవడం, సరైన మార్కెటింగ్ వసతులు లేకపోవడం వంటి సమస్యలకు పరిష్కారాలను కనుగొనాల్సిన అవసరం ఉందన్నారు. రైతులు తమకు నచ్చిన చోట ఉత్పత్తులను విక్రయించుకునే దిశగా కేంద్రం తీసుకొచ్చిన కొత్త చట్టాలతోపాటు వ్యవసాయ రంగంలో తీసుకొచ్చిన పలు సంస్కరణలు అన్నదాతకు మేలుచేకూర్చేవని ఉపరాష్ట్రపతి ప్రశంసించారు. 


రైతులు వ్యవసాయంతోపాటు ఉద్యానపంటలు, చేపల పెంపకం, పాడి, పౌల్ట్రీ పరిశ్రమ, ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమ వంటివాటిపైనా దృష్టిపెట్టాలని సూచించిన ఉపరాష్ట్రపతి, తద్వారా వివిధ మార్గాల్లో ఆదాయాన్ని పొందేందుకు వీలవుతుందన్నారు. సిరిధాన్యాలతోపాటు వాణిజ్య పంటలపైనా ఆలోచన చేయాలన్నారు. వివిధ రకాల వ్యవసాయ పద్ధతుల కారణంగా భూసారం తగ్గిపోతోందని ఆవేదన వ్యక్తం చేసిన ఆయన.. రసాయన ఎరువులపై ఆధారపడటాన్ని తగ్గించుకుని, భూసార ఆరోగ్య కార్డుల వినియోగాన్ని పెంచాలన్నారు. ‘పరిశోధనశాల నుంచి వ్యవసాయ క్షేత్రానికి అనేది వ్యవసాయ విశ్వవిద్యాలయాల మంత్రం కావాలి’ అని ఆయన సూచించారు. ‘ఇన్నొవేషన్, జనరేషన్, మోటివేషన్’ నినాదాన్ని ఇచ్చిన ఉపరాష్ట్రపతి.. సాంకేతికత లాభాన్ని రైతులకు అదించడం, వ్యవసాయం సవాళ్లను తర్వాతి తరం అందిపుచ్చుకోవడం, రైతులకు మద్దతిచ్చి వారిని ప్రోత్సహించే దిశగా కార్యాచరణ జరగాలని సూచించారు.


ఈ కార్యక్రమంలో నాబార్డ్ చైర్మన్ జీఆర్ చింతల, ఎన్ఏఏఆర్ఎమ్ డైరెక్టర్ డాక్టర్ చెరుకుమల్లి శ్రీనివాసరావు, మాజీ పార్లమెంటు సభ్యుడు యలమంచిలి శివాజీ, రాష్ట్రీయ సేవాసమితి వ్యవస్థాపక ప్రధానకార్యదర్శి డాక్టర్ జి.మునిరత్నం నాయుడు, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ వాతావరణ మార్పుల సలహాదారు డాక్టర్ అంచా శ్రీనివాసన్, రంగా ట్రస్టు నుంచి ఆర్. కిషోర్ బాబు, ఒంగోలు రంగా ట్రస్ట్ చైర్మన్ ఆళ్ల వెంకటేశ్వరరావు సహా పలువురు ప్రజాప్రతినిధులు, వ్యవసాయ రంగ నిపుణులు, ప్రముఖులు అంతర్జాల వేదిక ద్వారా పాల్గొన్నారు. 

Updated Date - 2020-11-07T22:10:58+05:30 IST