విస్మరించజాలని వీరవనితపై వెంకయ్య మనోగతం

ABN , First Publish Date - 2020-09-28T03:09:06+05:30 IST

న్యూఢిల్లీ: 1932వ సంవత్సరంలో ఓ చీకటి రాత్రి. సిక్కు వ్యక్తి వస్త్రధారణలో ఒక యువతి యూరోపిన్లు మాత్రమే ఉండే సామాజిక భవనాన్ని సమీపించింది.

విస్మరించజాలని వీరవనితపై వెంకయ్య మనోగతం

న్యూఢిల్లీ: 1932వ సంవత్సరంలో ఓ చీకటి రాత్రి. సిక్కు వ్యక్తి వస్త్రధారణలో ఒక యువతి యూరోపిన్లు మాత్రమే ఉండే సామాజిక భవనాన్ని సమీపించింది. భారతీయుల పట్ల జాత్యహంకార మరియు వివక్షాపూరిత వ్యవహార శైలికి ఆ భవనం ప్రసిద్ధి చెందింది. ‘ఇందులోకి కుక్కలు మరియు భారతీయులకు అనుమతి లేదు’ అంటూ అక్కడ రాసి ఉంచిన బోర్డు ఈ విషయాన్ని ప్రతిబింబిస్తుంటుంది.


ఇది భారతీయ స్వరాజ్య యోధులను రెచ్చగొట్టింది. అందుకే వారు ఆ భవనాన్ని లక్ష్యంగా చేసుకుని, దాడి చేయాలని నిశ్చయించుకున్నారు. సిక్కు వ్యక్తి వేషధారణలో అక్కడకు వచ్చిన అమ్మాయి 21 సంవత్సరాల ప్రీతిలతా వడ్డేదార్. చిట్టగాంగ్ లోని పహర్తాలి యూరోపియన్ సామాజిక భవనం మీద దాడి చేయడానికి వచ్చిన సేనకు ఆమె నాయకురాలు.


ఈ రోజు ఫేస్ బుక్ పోస్ట్ ద్వారా ఆమె త్యాగనిరతితో పాటు ఉత్తేజాన్ని కలిగించే వారి గాధను గుర్తు చేసుకుందాం.


చిట్టగాంగ్ లోని మధ్యతరగతి కుటుంబంలో ప్రతిభ, జగ్ బంధు వడ్డేదార్ దంపతులకు ప్రీతిలతా వడ్డేదార్ జన్మించారు. తల్లిదండ్రులు ఆమెకు మంచి విద్యను అందించారు. ఆమె చదువుల్లో రాణించి, పురస్కారాలు, స్కాలర్ షిప్ లను సంపాదించినట్లు చెప్పినప్పటికీ పై చదువులకు ఆమెకు సీటును నిరాకరించారు. దీనికి ఏకైక కారణం స్వరాజ్య సంగ్రామం పట్ల ఆమెకున్న ప్రేమ, అందులో పాల్గొనాలన్న అభిలాష.


విద్యార్థి దశలోనే ఆమెకు ఔత్సాహిక విప్లవాత్మక కార్యకలాపాలకు నాయకత్వం వహిస్తున్న కొంత మంది మహిళలతో పరిచయం ఏర్పడిందని చెబుతారు. అలాంటి వారిలో లీలానాగ్ కూడా ఒకరు. ఢాకా విశ్వ విద్యాలయంలో ఆమె విద్యార్థిని. అంతేకాదు సుభాష్ చంద్రబోస్ కు సహచరురాలు కూడా. ఆమె దీపాలి సంఘం అనే విప్లవ సమూహాన్ని స్థాపించారు. ఈ సంస్థ మహిళకు పోరాటాల్లో శిక్షణనిచ్చేది. తర్వాత ప్రీతిలత ఈ సంస్థలోనే క్రీయాశీలక సభ్యులయ్యారు.


ఉన్నత విద్య కోసం కలకత్తాలోని బెతున్ కాలేజీకి వెళ్లిన సమయంలో ‘మాస్టర్ డా’గా ప్రసిద్ది చెందిన ప్రముఖ విప్లవ నాయకుడు సూర్య సేన్ నుంచి ఆమె ప్రేరణ పొందారని విశ్వసిస్తారు. మాస్టర్ డా నేతృత్వంలోని తిరుగుబాటు బృందంలో తనను చేర్చుకోవాలని ఆమె కోరింది. ప్రారంభంలో ఆమెను బృందంలోకి తీసుకునేందుకు సూర్యసేన్ సంకోచించారు. బ్రిటీష్ పాలన నుంచి భారతదేశాన్ని విడిపించాలన్న ఆమె అచంచలమైన దృఢ నిశ్చయాన్ని గమనించిన ఆయన తర్వాత అంగీకరించారంటారు.


కలకత్తాలోని ఓ రహస్య కర్మాగారం నుంచి బాంబు కేసింగ్ లను సేకరించే అత్యంత కష్టమైన పనిని ప్రీతిలతాకు తమ నియామక ప్రారంభంలో అప్పగించారు. ఆ తర్వాత ఆమె బెంగాల్ లోని వివిధ రహస్య సంఘాలకు చెందిన మహిళలు హాజరైన మహిళా సమావేశాలను నిర్వహించడం ప్రారంభించారు. జైళ్ళ పాలైన విప్లవ యోధులకు బంధువుగా నటిస్తూ, వారిని కలిసి, రహస్య సమాచారం సేకరించడం ప్రారంభించారు. ఆమె ప్రతి పనిని అంకితభావంతో, నేర్పుగా చేసేవారు.


1930లో సూర్యసేన్ తమ ప్రఖ్యాత చిట్టగాంగ్ ఆయుధ దాడులకు ప్రణాళికలను రచించినప్పుడు ప్రీతిలత తమ తోటి విప్లవకారులతో కలిసి, ఈ సాహసోపేతమైన మిషన్ లో చురుగ్గా పాల్గొన్నారు. ఈ సంఘటన తర్వాత బ్రిటీష్ వారు ఆమె బృందం మీద పూర్తి బలగాలతో దాడి చేశారు. చాలా మందిని అరెస్టు చేయగా, ప్రీతిలతతో పాటు మరికొందరు సభ్యులు తప్పించుకోగలిగారు.


1932లో, భారతీయుల పట్ల వివక్షాపూరిత వ్యవహారశైలికి చిహ్నమైన చిట్టగాంగ్ లోని పహర్తాలి యూరోపియన్ సామాజిక భవనం మీద దాడి చేయాలని వారు నిర్ణయించుకున్నారు. ప్రీతిలత నిబద్ధత గల విప్లవయోధుల బృందాన్ని ఏర్పాటు చేసి, వారికి ఆయుధ శిక్షణ ఇచ్చి, దాడికి సన్నాహాలు ప్రారంభించారు.


1932, సెప్టెంబర్ 23న, ఆమె తన తోటి విప్లవకారులతో కలిసి బ్రిటీష్ ఆధిపత్యానికి చిహ్నమైన ఆ సామాజిక భవనం మీద ధైర్యంగా దాడి చేశారు. భీకర తుపాకీ యుద్ధం మొదలైంది. దురదృష్టవశాత్తు ప్రీతిలతా కాళ్ళలోకి బుల్లెట్లు దూసుకెళ్ళాయి. వెంటనే పోలీసు బలగాలు ఆమెను చుట్టుముట్టాయి.


శతృవులు తనను చుట్టుముడుతున్నారని గ్రహించి, వారికి ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రాణాలతో దొరకకూడదనే అచంచల ధైర్యంతో, ఆ భారతమాత వీరపుత్రిక ఆత్మార్పణ గావించారు. తన జేబులోంచి ఓ సైనైడ్ గుళిక తీసి, నోట్లో వేసుకున్నారు. అంతిమంగా మాతృభూమి రక్షణకోసం తమ జీవితాన్ని త్యాగం చేశారు.


బ్రిటీష్ పాలన నుంచి మాతృభూమి విముక్తి కోసం ప్రీతిలతా వడ్డేదార్ లాంటి చాలా మంది మహిళా స్వాతంత్ర్య సమరయోధులు చేసిన నిస్వార్థ త్యాగాల ఫలితమే ఈ రోజు మనమంతా అనుభవిస్తున్న స్చేచ్ఛా ఫలాలు. వారి స్ఫూర్తిదాయకమైన గాధలను పదే పదే గుర్తు చేసుకోవడం, కీర్తించడమే వారికి మనమిచ్చే గౌరవం. వారి త్యాగాల గాథలను మన చరిత్ర పాఠ్యపుస్తకాల్లో చేర్చాల్సిన అవసరం ఉంది.


- ఎం. వెంకయ్య నాయుడు, ఉపరాష్ట్రపతి 


Updated Date - 2020-09-28T03:09:06+05:30 IST