ఎమర్జెన్సీ రోజుల్ని గుర్తు చేసుకున్న ఉపరాష్ట్రపతి వెంకయ్య

ABN , First Publish Date - 2020-06-26T02:39:06+05:30 IST

21 నెలల సుదీర్ఘకాలం ఆ చట్టవిరుద్ధమైన నిర్బంధంలో, పౌరులు జీవన హక్కుతో సహా అన్ని ప్రాథమిక హక్కులను కోల్పోయారు. లక్షలాది మంది రాజకీయ నాయకులు, కార్యకర్తలు, అమాయక పౌరులు జైళ్లలో బంధించబడ్డారు

ఎమర్జెన్సీ రోజుల్ని గుర్తు చేసుకున్న ఉపరాష్ట్రపతి వెంకయ్య

న్యూఢిల్లీ: దేశంలో ఎమర్జెన్సీ విధించి 45 సంవత్సరాలు నిండిన సందర్భంగా అప్పటి రోజుల్ని, పరిస్థితుల్ని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు గుర్తు చేసుకున్నారు. ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా చేసిన పోరాటంతో పాటు అప్పటి రాజకీయ, సామాజిక పరిస్థితులను నెమరు వేసుకున్నారు. 21 నెలల పాటు కొనసాగిన ఎమర్జెన్సీలో ఎక్కువ కాలం పాటు జైలులోనే ఉన్న వెంకయ్య.. అప్పటి తన సహచరులు, నాయలకులతో గల అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు.


‘‘21 నెలల సుదీర్ఘకాలం ఆ చట్టవిరుద్ధమైన నిర్బంధంలో, పౌరులు జీవన హక్కుతో సహా అన్ని ప్రాథమిక హక్కులను కోల్పోయారు. లక్షలాది మంది రాజకీయ నాయకులు, కార్యకర్తలు, అమాయక పౌరులు జైళ్లలో బంధించబడ్డారు. అది అత్యవసర కాలం. నేను 3 వేర్వేరు జైళ్ళలో పదిహేడున్నర నెలలు జైలు శిక్ష అనుభవించాను. ప్రజల హక్కులను అనాగరికంగా హరించడాన్ని వ్యతిరేకిస్తూ కొనసాగిన జాతీయ తిరుగుబాటులో పాలు పంచుకున్నాను. చట్టవిరుద్ధమైన, చట్టబద్ధమైన చర్యల మధ్య వ్యత్యాసాన్ని ప్రజలకు తెలియజేసేందుకు మహోద్యమం నడిపాం. పదిహేడున్నర నెలల జైలు జీవితం అనంతరం 1977 జనవరిలో జైలు నుండి విడుదలయ్యాను’’ అని వెంకయ్యనాయుడు చెప్పుకొచ్చారు.


‘‘ఎమర్జెన్సీ అనే తప్పుడు నిర్ణయం 1977 మార్చిలో లోక్‌సభ ఎన్నికలకు దారితీసింది. ఆ ఎన్నికల్లో నేను పోటీ చేసి ఓటమి పాలయ్యాను. ఏమైతేనేమి.. ప్రజలు కోరుకున్నట్లే జనతా పార్టీ ఆధ్వర్యంలో ప్రభుత్వం ఏర్పడింది. జనతా పార్టీ ప్రభుత్వం 44 వ రాజ్యాంగ సవరణ ద్వారా రాజ్యాంగంలోని సంబంధిత నిబంధనలలో గణనీయమైన మార్పులను తీసుకువచ్చింది. అత్యవసర పరిస్థితిని యుద్ధాలు లేదంటే విపత్కర పరిస్థితుల ఆధారంగా మాత్రమే విధించేందుకు రాజ్యాంగ సవరణ చేసింది. జీవించే హక్కును ప్రధానంగా పేర్కొంది’’ అని ఎమర్జెన్సీ అనంతర విషయాల్ని చెప్పుకొచ్చారు.


ఇక ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా పోరాడుతున్న సమయంలో ప్రముఖలతో పరిచయం, వారితో సహవాసం.. జైలు జీవితంలోని జ్ఞాపకాల్ని గుర్తు చేసుకున్నారు. ఇక ఎమర్జెన్సీని కరోనా లాక్‌డౌన్‌తో తనదైన శైలిలో వెంకయ్య చమత్కరించారు. 1975 నాటి ఎమర్జెన్సీ ప్రజలపై రుద్దబడిందని, అయితే నేటి లాక్‌డౌన్ ప్రజల అంగీకారంతో జరిగిందని అన్నారు.

Updated Date - 2020-06-26T02:39:06+05:30 IST