రికార్డు స్థాయిలో ఉత్పాదకత నమోదు: రాజ్యసభలో వెంకయ్య
ABN , First Publish Date - 2020-09-15T02:53:13+05:30 IST
కరోనా మహమ్మారి నేపథ్యంలో చాలాకాలంగా ఎదురుచూస్తున్న పార్లమెంటు సమావేశాలు అసాధారణమైన..
కరోనా మహమ్మారి నేపథ్యంలో చాలాకాలంగా ఎదురుచూస్తున్న పార్లమెంటు సమావేశాలు అసాధారణమైన ముందుజాగ్రత్త చర్యల నడుమ సోమవారం ప్రారంభమయ్యాయి. చట్టాలు, ముఖ్యమైన అంశాలపై అర్థవంతమైన, విస్తృతమైన చర్చల ద్వారా సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలని రాజ్యసభ చైర్మన్ ముప్పవరపు వెంకయ్యనాయుడు ఈ సందర్భంగా సభ్యులకు సూచించారు.
భారతపార్లమెంటు చరిత్రలో తొలిసారిగా పార్లమెంటు ఉభయసభలను ఒక సభ సమావేశానికి వినియోగిస్తున్నారు. కరోనా నేపథ్యంలో నిబంధలను పాటిస్తూ సభాకార్యక్రమాలు నిర్వహించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇందులో భాగంగా రాజ్యసభ కూడా ఇప్పుడున్న చాంబర్లు, గ్యాలరీలతోపాటు రాజ్యసభ చాంబర్‌ను కూడా వినియోగిస్తోంది.
రాజ్యసభ సమావేశాల ప్రారంభం సందర్భంగా చైర్మన్ ముప్పవరపు వెంకయ్య నాయుడు మాట్లాడుతూ సమావేశాల్లో చర్చించేందుకు విస్తృతమైన, ప్రజాప్రయోజన అంశాలున్నందున సభ్యులందరూ సమావేశాలు సజావుగా జరిగేలా సహకరించాలని సూచించారు. కరోనా మహమ్మారిని అదుపు చేయడం, ఆర్థిక వ్యవస్థ పునరుజ్జీవనంతో పాటు సాధారణ సామాజిక స్థితులు నెలకొనాలని ఆశిస్తున్న ప్రజలు.. ఈ సమావేశాలపై ఎన్నో అంచనాలు పెట్టుకున్నారని, వారి ఆకాంక్షలకు అనుగుణంగా సరైన మార్గదర్శనం జరిగేలా సమావేశ నిర్వహణకు సహకరించాలని ఆయన కోరారు. కేవలం 18 రోజులపాటు జరగనున్న ఈ సమావేశాల షెడ్యూల్ నేపథ్యంలో.. కీలకమైన చట్టాలు, కరోనా సహా ఇతర సమాజ ప్రయోజనకర అంశాలకు సంబంధించిన బిల్లులపై అర్థవంతమైన చర్చలో భాగస్వాములు కావడంపైనే అందరూ దృష్టిసారించాలన్నారు.
175 రోజుల విరామం తర్వాత సభ్యులందరినీ కలుసుకోవడం ఆనందంగా ఉందన్న చైర్మన్, 100 ఏళ్ల క్రితం విధ్వంసం సృష్టించిన స్పానిష్ ఫ్లూ తర్వాత అదే స్థాయిలో మానవాళిని కరోనా మహమ్మారి ప్రభావితం చేసిందని పేర్కొన్నారు. ప్రపంచంలోనే జనాభాపరంగా రెండో అతిపెద్ద దేశమైన భారత్.. కరోనా బాధితులు, మరణాల రేటును వీలైనంతగా తగ్గించడంలో విజయం సాధించిందన్నారు.
కరోనా మహమ్మారి కారణంగా దేశం, ఆర్థిక వ్యవస్థ తీవ్రంగా ప్రభావితమయ్యాయన్న చైర్మన్.. ఈ దిశగా కరోనా పోరాటయోధులైన డాక్టర్లు, నర్సులు, వైద్య సిబ్బంది, పోలీసులు, పారామిలటరీ బలగాలు, పారిశుద్ధ్య కార్మికులు, మీడియా, అత్యవసర సేవలు అందించేవారు చేసిన కృషిని ప్రత్యేకంగా వెంకయ్య అభినందించారు. లాక్‌డౌన్ ఆంక్షల నేపథ్యలోనూ అన్నదాతలు రికార్డు స్థాయిలో ఆహార ఉత్పత్తిని నమోదు చేయడంలో విజయం సాధించారని ఆయన ప్రశంసించారు. శాస్త్రవేత్తలు చేస్తున్నకృషి సఫలీకృతమై.. త్వరలోనే కరోనాకు వ్యాక్సిన్ సిద్ధమవ్వాలని అభిలషించారు.
రవాణా ఆంక్షలు కాస్త సడలించిన తర్వాత డిపార్ట్ మెంట్లకు సంబంధించిన స్టాండింగ్ కమిటీలు తమ కార్యకలాపాలను ప్రారంభించాయని చైర్మన్ తెలిపారు. ఈ మధ్య కాలంలో కరోనా మహమ్మారి, దాని ప్రభావం తదితర అంశాలను ఈ కమిటీలు క్షుణ్ణంగా అధ్యయనం చేశాయని వెంకయ్య వ్యాఖ్యానించారు. ఇలాంటి ఏడు రాజ్యసభ కమిటీలు 26సార్లు సమావేశమయ్యాయని.. దాదాపు 56 గంటల 40 నిమిషాలపాటు కరోనా, దాని ప్రభావం, ఈ మహమ్మారిని అదుపులోకి తీసుకురావడం వంటి వివిధ అంశాలపై చర్చించాయని ఆయన వెల్లడించారు.
గత నెలలో ఉపరాష్ట్రపతిగా, రాజ్యసభ చైర్మన్‌గా మూడేళ్ల పదవీకాలాన్ని పూర్తి చేసుకున్న వెంకయ్యనాయుడు.. రాజ్యసభాకార్యకలాపాలు ప్రారంభమైనప్పటినుంచి సభ పనితీరుకు సంబంధించిన వివిధ అంశాలపై పూర్తి స్థాయి అధ్యయనం జరపాలని తన సెక్రటేరియట్ సభ్యులకు ఆదేశించినట్లు తెలిపారు.
1978 నుంచి అందుబాటులో ఉన్న వివరాల ప్రకారం, గత 25 ఏళ్లుగా రాజ్యసభ ఉత్పాదకత గణనీయంగా తగ్గుతున్న విషయాన్ని సభ దృష్టికి తీసుకొచ్చారు. అయితే ఈ పరిస్థితుల్లోనూ గత ఐదేళ్లలో చివరి మూడు సమావేశాల్లో 94.60% ఉత్పాదకత నమోదవడం సానుకూల అంశమని వెంకయ్యనాయుడు పేర్కొన్నారు. ఇక ముందు కూడా ఇవే పరిస్థితులు కొనసాగుతాయని ఆశాభావం వ్యక్తం చేస్తున్నట్లు తెలిపారు.
రాజ్యసభకు సంబంధించిన 8 డిపార్ట్ మెంట్లు స్టాండింగ్ కమిటీలు తొలిసారిగా 50 శాతానికిపైగా (సెప్టెంబర్ 2019- మార్చి 2020కి గానూ) సార్లు సమావేశమయ్యాయని చైర్మన్ వెల్లడించారు. 2017-18 ఏడాదిలో ఇది 44.78%గా నమోదైందన్నారు.
అసాధారణ సమయాల్లో అదేస్థాయిలో ముందుజాగ్రత్త చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందన్న రాజ్యసభ చైర్మన్.. మనందరి ఓర్పు, క్రమశిక్షణ, దృఢ సంకల్పంతో ఈ విపత్కర పరిస్థితులు తొలగిపోతాయని వెంకయ్య అభిప్రాయపడ్డారు. తొలిరోజు రాజ్యసభ మధ్యాహ్నం 3 గంటలకు సమావేశం కాగా.. 14 మంది నూతన, తిరిగి ఎంపికైన సభ్యులు ప్రమాణస్వీకారం చేశారు.
కేంద్ర హోంశాఖ ఇచ్చిన మార్గదర్శకాలకు అనుగుణంగా కొందరు సభ్యులు ఈ వర్షాకాల సమావేశాల్లో పాల్గొనేందుకు మినహాయింపు కోరగా.. సభ అనుమతితో వారి విజ్ఞప్తికి ఆమోదం లభించింది.
కాగా, సోమవారం హిందీ భాషా దినోత్సవాన్ని పురస్కరించుకుని అన్ని భారతీయ భాషలకు సమాన గౌరవం కల్పించాలని హిందీతోపాటు అన్ని భారతీయ భాషలను నేర్చుకునేందుకు ప్రోత్సాహం కల్పించాల్సిన అవసరముందని వెంకయ్య తన ప్రసంగంలో పేర్కొన్నారు. అనంతరం, శ్రీ హరివంశ్ రాజ్యసభ 14వ డిప్యూటీ చైర్మన్‌గా ఎన్నికయ్యారు. వారికి చైర్మన్ ముప్పవరపు వెంకయ్యనాయుడు, ఇతర సభ్యులు శుభాకాంక్షలు తెలిపారు.