ఆంగ్లంలోకి వరవరరావు కవితలు
ABN , First Publish Date - 2020-10-11T07:27:36+05:30 IST
విప్లవ రచయితల సంఘం (విరసం) నేత వరవరరావు తెలుగులో రాసిన కవితలు త్వరలో ఆంగ్లంలో ఓ పుస్తక రూపంలో ముద్రితమవ్వనున్నాయి...
- ప్రచురించనున్న పెంగ్విన్ రాండమ్ హౌస్ పబ్లిషర్స్
న్యూఢిల్లీ, అక్టోబరు 10: విప్లవ రచయితల సంఘం (విరసం) నేత వరవరరావు తెలుగులో రాసిన కవితలు త్వరలో ఆంగ్లంలో ఓ పుస్తక రూపంలో ముద్రితమవ్వనున్నాయి. ‘‘వరవరరావు: భారత విప్లవ కవి’’ పేరుతో ఆ పుస్తకాన్ని వచ్చే ఏడాది ముద్రిస్తామని పెంగ్విన్ రాండమ్ హౌస్ సంస్థ వెల్లడించింది. ఎల్గార్ పరిషత్ కేసులో 2018లో అరెస్టయిన వరవరరావు ప్రస్తుతం జైలులో ఉన్న విషయం తెలిసిందే. అరెస్టుకు ముందే.. ఆంగ్లంలోకి అనువదించాల్సిన కవితలను ఆయన ఎంపిక చేశారు. కవితలను ఆయన మేనల్లుడు వేణుగోపాల్‌తోపాటు.. మీనా కందస్వామి ఎడిటింగ్ చేస్తున్నారు. ‘‘వరవరరావు కవితా సంకలనాలు తెలుగులో 13 పుస్తకాలుగా వచ్చాయి. సాహిత్య విమర్శపై ఏడు పుస్తకాలు ఉన్నాయి. ఆయన గతంలో జైలు జీవితం గడిపినప్పుడు ‘కాప్టివ్ ఇమేజినేషన్’ పేరుతో రాసిన లేఖలు పెంగ్విన్ పబ్లిషర్స్ ద్వారా పుస్తకరూపంలో వచ్చాయి’’ అని వేణుగోపాల్ వివరించారు.