వందే భారత్‌ మిషన్‌కు ట్రబుల్స్‌!

ABN , First Publish Date - 2020-05-19T08:40:05+05:30 IST

దుబాయ్‌లో పని చేస్తున్న ప్రవాసుల్లో నిజామాబాద్‌ జిల్లా బాల్కొండ మండలానికి చెందిన వారే పది వేల మంది ఉంటారు. ఏపీలోని విశాఖపట్టణం, పశ్చిమ గోదావరి జిల్లాలకు చెందిన వారి సంఖ్య కూడా అధికంగా...

వందే భారత్‌ మిషన్‌కు ట్రబుల్స్‌!

  • దుబాయ్‌లో 2లక్షల మంది దరఖాస్తుదారులు
  • ఇప్పటి వరకూ స్వదేశానికి వెళ్లింది 2 వేల మంది
  • చిన్న విమానాలే నడుపుతున్న ఎయిర్‌ ఇండియా
  • విదేశీ ఎయిర్‌లైన్స్‌కు అనుమతి ఇవ్వని కేంద్రం

(గల్ఫ్‌ నుంచి ఆంధ్రజ్యోతి ప్రతినిధి)

దుబాయ్‌లో పని చేస్తున్న ప్రవాసుల్లో నిజామాబాద్‌ జిల్లా బాల్కొండ మండలానికి చెందిన వారే పది వేల మంది ఉంటారు. ఏపీలోని విశాఖపట్టణం, పశ్చిమ గోదావరి జిల్లాలకు చెందిన వారి సంఖ్య కూడా అధికంగా ఉంటుంది. దుబాయ్‌ నుంచి తెలుగు వారితో సహా మొత్తం 2లక్షలకుపైగా మంది స్వదేశానికి తిరిగి వెళ్లడానికి దరఖాస్తు చేసుకోగా, ఇప్పటి వరకు మిషన్‌ వందే భారత్‌ కింద 2వేల మంది మాత్రమే స్వదేశానికి వెళ్లగలిగారు. గల్ఫ్‌లోని దాదాపు అన్ని దేశాల్లోనూ ఇదే రకమైన పరిస్థితి ఉంది. మొదటి దశలో 10 ప్రత్యేక విమానాలను నడపగా, కువైత్‌, అబుధాబీ నుంచి 2 విమానాలు మాత్రమే హైదరాబాద్‌కు బయలుదేరాయి. ఆ సమయంలో ఆంధ్రప్రదేశ్‌ను పూర్తిగా విస్మరించారు. ఇక, రెండో దశ కింద ఆదివారం నుంచి గల్ఫ్‌లోని అన్ని దేశాల నుంచి ప్రత్యేక విమానాలు నడపడంతోపాటు ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడ, విశాఖపట్టణం, తిరుపతిని చేర్చినా ఈ రూట్లు కూడా వయా హైదరాబాద్‌గా ఉన్నాయి. దీంతో రెండు రాష్ట్రాల వాసుల మధ్య ‘వయా’ పంచాయితీ తలెత్తుతోంది. పైగా ఈ విమానాలన్నీ  చిన్న సైజు ఎయిర్‌ బస్సులు కావడం గమనార్హం.  


అదృష్టవంతులకే అవకాశం!

కరోనా ప్రభావంతో ఉపాధి కరువై ఎడారి దేశాల నుంచి లక్షలాది మంది ప్రవాసులు మాతృభూమికి తిరుగు పయనమవుతున్నారు. నర్సులు, గర్భిణులు, రోగులు, వీసాల గడువు ముగిసిన వేలాది మంది తిరిగి వెళ్లడానికి ఎదురు చూస్తుండగా, మిషన్‌ వందే భారత్‌ విమానాల్లో ఎక్కే అవకాశం అదృష్టవంతులకు మాత్రమే దక్కుతోంది. తమను వెంటనే స్వదేశానికి పంపించాలని గర్భిణులైన నర్సులు భారతీయ అధికారులను ప్రాథేయపడుతున్నారు. వందే భారత్‌ మిషన్‌ కింద దరఖాస్తు చేసుకొంటున్న వారందరూ అర్హులే కావడంతో ఎవర్ని పంపాలో.. ఎవర్ని పంపకూడదో తెలియక అధికారులు తలలు పట్టుకుంటున్నారు. మిషన్‌ అని చెబుతున్నా విమాన టికెట్‌ ధర చాలా ఎక్కువగా ఉందని, భారత సర్కారు మాత్రం ఆర్భాటంగా ప్రచారం చేసుకుంటోందన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి.  


Updated Date - 2020-05-19T08:40:05+05:30 IST