అందరికీ టీకా

ABN , First Publish Date - 2020-11-25T07:47:46+05:30 IST

కరోనావైర్‌సపై పోరులో నిర్లక్ష్యం వహించవద్దని ప్రధాని నరేంద్ర మోదీ రాష్ట్రాలను హెచ్చరించారు. దేశంలో సెకండ్‌ వేవ్‌ జడలు విప్పొచ్చన్న ఆందోళనల మధ్య ఆయన మంగళవారం ఎనిమిది రాష్ట్రాల ముఖ్యమంత్రులతో...

అందరికీ టీకా

  • ఇది జాతీయ సంకల్పం.. కోల్డ్‌ స్టోరేజీలు సిద్ధం చేయండి
  • కరోనా కట్టడిలో నిర్లక్ష్యం వద్దు
  • ఆర్‌టీ పీసీఆర్‌ పరీక్షలు పెంచాలి
  • ముఖ్యమంత్రుల భేటీలో ప్రధాని మోదీ
  • దుష్ప్రభావం లేదని నిర్ధారించాకే  వ్యాక్సినేషన్‌
  • ప్రధానికి సీఎం కేసీఆర్‌ సూచన
  • రాష్ట్రంలో వ్యాక్సిన్‌ నిల్వ కోసం
  • శీతల గిడ్డంగుల వ్యవస్థ ఏర్పాటుకు ఆదేశాలు 


న్యూఢిల్లీ, నవంబరు 24 (న్యూఢిల్లీ): కరోనావైర్‌సపై పోరులో నిర్లక్ష్యం వహించవద్దని ప్రధాని నరేంద్ర మోదీ రాష్ట్రాలను హెచ్చరించారు. దేశంలో సెకండ్‌ వేవ్‌ జడలు విప్పొచ్చన్న ఆందోళనల మధ్య ఆయన మంగళవారం ఎనిమిది రాష్ట్రాల ముఖ్యమంత్రులతో జరిపిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఈ హెచ్చరిక చేశారు. ’’మన కృషిని వేగవంతం చేయాలి. వైరస్‌ వ్యాప్తిని నిరోధించాలి. పరీక్షలు, ధ్రువీకరణ, కాంటాక్ట్‌ ట్రేసింగ్‌, డేటా.. వీటికి మరింత ప్రాధాన్యం ఇవ్వాలి’’ అని కోరారు.


‘‘చాలా దేశాల తో పోలిస్తే భారత్‌లో వైరస్‌ వ్యాప్తి నిలకడగా ఉంది. రికవరీ రేటు బాగుంది. అయితే బాగుంది కదా..అని ఉదాసీనత వద్దు. మరింతగా ఆర్‌టీ పీసీఆర్‌ పరీక్షలు జరిపేట్లు యంత్రాంగాన్ని సమాయత్తం చేయండి. పాజిటివ్‌ కేసుల సంఖ్య 5ు కంటే దిగువగా, మరణాల రేటు 1ు కంటే తక్కువగా ఉండేట్లు లక్ష్యం నిర్దేశించుకుని పనిచేయాలి’’ అన్నారు. త్వరలో అందుబాటులోకి వచ్చే కొవిడ్‌ వ్యాక్సిన్‌ నిల్వకు తగినన్ని కోల్డ్‌ స్లోరేజీలు సిద్ధం చేయాలని ప్రధాని కోరారు. ‘‘వ్యాక్సిన్‌ అభివృద్ధి ప్రక్రియను కేంద్రం పరిశీలిస్తోంది. దేశంలోని వాక్సిన్‌ తయారీ సం స్థలతో పాటు ప్రపంచస్థాయి నియంత్రణాధికార సంస్థలతోనూ, అంతర్జాతీయ కంపెనీలతోనూ సమాలోచనలు జరుపుతున్నాం. మందు శాస్త్రీయత నిర్ధారణ అయ్యాకే తయారవుతుంది. ప్రయోగ పరీక్షలు తుది దశలో ఉన్నాయి. వ్యాక్సిన్‌ను వేగంగా అందించడం కంటే ప్రజల ఆరోగ్యంపై దృష్టి పెట్టాలి.  దేశంలో అందరికీ టీకా అందాలన్నది జాతీయ సంకల్పం’’ అని ప్రధాని పేర్కొన్నారు. కరోనా కేసులు ఎక్కువగా ఉన్న మహారాష్ట్ర, గుజరాత్‌, ఢిల్లీ, ఛత్తీ్‌సగఢ్‌, పశ్చిమ బెంగాల్‌, కేరళ, రాజస్థాన్‌, హరియాణ ముఖ్యమంత్రులు ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్నారు. కరోనా తొలుత వచ్చినప్పుడు భయం వేస్తుందని, రెండో దశలో తెలిస్తే సామాజికంగా దూరం పెడతారన్న ఆందోళన ఉంటుందని, మూడో దశలో వైరస్‌ సంక్రమించినట్లు అంగీకరించి.. మిగిలిన వారిని జాగ్రత్తగా ఉండాలని చెబుతారని.. ఇక నాలుగోదశలో రికవరీ రేటు పెరగడం చూసి ప్రాణా పాయం లేదని, స్వేచ్ఛగా తిరుగుదామని భావిస్తారని చెప్పా రు. ‘‘ఈ నాలుగో దశపైనే దృష్టి పెట్టాలి. ప్రజలను చైతన్యవం తం చేయాలి. వ్యాక్సిన్‌ పంపిణీ జరుగుతున్నా మనం మాత్రం వైరస్‌ కట్టడి మీదే కృషి చేయాలి’’అని సూచించారు. 


టార్గెట్‌ బీజేపీ

వ్యాక్సిన్‌ పంపిణీలో కేంద్రంతో కలిసి పనిచేస్తామని బెంగాల్‌ సీఎం మమతా బెనర్జీ ప్రధానికి హామీ ఇచ్చారు. ఈ సమయంలో రాజకీయాలకు పాల్పడడం, పోటాపోటీ ర్యాలీలు వద్దని ఆమె స్పష్టం చేశారు. కొవిడ్‌ వ్యాక్సిన్‌ బీజేపీ పుణ్యమేనని, ప్రధాని మోదీ చొరవ వల్లే వ్యాక్సిన్‌ అందుబాటులోకి వస్తోందన్న బెంగాల్‌ బీజేపీ నేతల ప్రచారం నేపథ్యంలో ఆమె ఈ మాటలన్నారు. మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్‌ ఠాక్రే కూడా పరోక్షంగా బీజేపీపై దాడి చేశారు. ‘‘కరోనా సెకండ్‌ వేవ్‌ పొంచి ఉన్న వేళ కొన్ని పార్టీలు రాజకీయం చేస్తున్నాయి. నిరసన ప్రదర్శనలకు దిగుతున్నాయి. ఇలాంటి సమయంలో రాజకీయాలు తగవని ఆ పార్టీలకు చెప్పాలి. ప్రధాని, హోంమంత్రి షా అన్ని పార్టీలతో సమావేశం ఏర్పాటు చేసి పరిస్థితిని వివరించాలి’’ అని బాహాటంగా చెప్పారు. మహారాష్ట్రలో దేవాలయాలను తిరిగి తెరవడంపై బీజేపీ ముంబైలో ప్రదర్శనలు నిర్వహించడాన్ని పరోక్షంగా ఆయన లేవనెత్తారు. దీనికి ప్రధాని బదులివ్వలేదు. ఇక కొవిడ్‌ ఉధృతి గురించి హరియాణ సీఎం మనోహర్‌ ఖట్టార్‌ వివరిస్తూండగా మోదీ అడ్డుకున్నారు. ‘మనోహర్‌జీ! మీ రాష్ట్ర లెక్కలన్నీ మా వద్ద ఉన్నాయి. కొవిడ్‌ అదుపుకు మీరు తీసుకుంటున్న చర్యలేంటి? వ్యాక్సిన్‌ పంపిణీపై మీ ఆలోచనలేంటి.. అన్నవి చెప్పండి’ అని సూటిగా అడిగారు. దాంతో ఆయన వాటిని ఏకరువు పెట్టి రాష్ట్రంలో మూడో వేవ్‌ నడుస్తోందన్నారు. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌ కూడానగరంలో మూడో వేవ్‌ ఉధృతంగా ఉందంటూ దీనికి ఒక కారణం విపరీతమైన కాలుష్యమని చెప్పారు. పంజాబ్‌, హరియాణల్లో గడ్డి దుబ్బుల దహనం వల్ల కాలుష్యం పెరుగుతోందన్నారు. 


ఆరోగ్యంపై మార్గదర్శకాలు

వ్యాక్సినేషన్‌ జరిగాక ఆరోగ్య సమస్యల పరిష్కారంపైనా రాష్ట్రాలను కేంద్రం అప్రమత్తం చేసింది. ఈ మేరకు ఆరోగ్యశాఖ అదనపు కార్యదర్శి డాక్టర్‌ మనోహర్‌ అగ్నానీ రాష్ట్రాలకు రాసిన లేఖలో గైడ్‌లైన్స్‌ పంపారు. గుండెపోటు, ఊపిరితిత్తుల వ్యాధులు, నరాల బలహీనతలు ఉన్న వారికి టీకా వేయడం వల్ల ఏ ఇబ్బందులు రావొచ్చన్నది అంచనావేసుకుని.. కార్డియాలజిస్టులు, న్యూరాలజిస్టులు, పెడియాట్రీషియన్స్‌, శ్వాసకోశ నిపుణులు.. మొదలైన వారు అందుబాటులో ఉండేట్లు చూసుకోవాలన్నారు. ప్రతీ రాష్ట్రంలో ఒక మెడికల్‌ కాలేజీని ఏఈఎ్‌ఫఐ సెంటర్‌గా ప్రభుత్వాలు ఏర్పాటు చేసుకోవాలన్నారు. 




తొలి వ్యాక్సినేషన్‌ ఆరోగ్య కార్యకర్తలకే!

కొవిడ్‌ వ్యాక్సిన్‌ను తొలి విడతలో దేశంలోని కోటి మంది వైద్యులు, నర్సులు, వైద్యరంగ సిబ్బందికే అందించేందుకు రంగం సిద్ధమైంది. రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోని 92శాతం ప్రభు త్వ ఆస్పత్రులు, 55శాతం ప్రైవేటు ఆస్పత్రుల సిబ్బంది వివరాల ను ప్రభుత్వం ఇప్పటికే సేకరించినట్లు తెలుస్తోంది. మిగిలిన వారి వివరాల సేకరణ వారంలోగా పూర్తవుతుందని సమాచారం. కరోనా వ్యాక్సినేషన్‌ కేంద్రాల ఎంపిక, సేవలందించే సిబ్బంది వివరాలు, ఆధార్‌కార్డు ద్వారా లబ్ధిదారుల వెరిఫికేష న్‌, రద్దీ నిర్వహణ, సమన్వయం వంటి అంశాలపై ప్రణాళిక లు సిద్ధం చేసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాల ను కేంద్రం కోరింది. 2021 జూలైలోగా 2 కోట్ల మంది మునిసిపల్‌ వర్కర్లు, పోలీసులు, సాయుధ దళాలు, 26 కోట్ల మంది 50 ఏళ్లకు పైబడినవారు, దీర్ఘకాలిక వ్యాధులు కలిగిన 50 ఏళ్లలోపువారికి వ్యాక్సినేషన్‌ చేస్తారని అంచనా. ఆక్స్‌ఫర్డ్‌ వ్యాక్సిన్‌కు బ్రిటన్‌లో అనుమతి లభించగానే భారత్‌ సైతం దాని అత్యవసర వినియోగానికి ఆమోదం తెలిపే అవకాశాలు ఉన్నాయని బయోకాన్‌ కంపెనీ ఎగ్జిక్యూటివ్‌ చైర్‌పర్సన్‌ కిరణ్‌ మజుందార్‌ షా అంచనా వేశారు. 


Updated Date - 2020-11-25T07:47:46+05:30 IST