ఏడాదిలో 70% మందికి టీకా

ABN , First Publish Date - 2020-12-11T09:10:03+05:30 IST

వచ్చే ఏడాది చివరిలోగా దేశంలో 70 శాతం మంది ప్రజలకు వ్యాక్సిన్‌ అందే అవకాశం ఉందని.. ప్రపంచ ఆరోగ్యం సంస్థ సలహా సంఘ సభ్యుడు,

ఏడాదిలో 70% మందికి టీకా

  • రెండు వారాల్లో మనకు ఆక్స్‌ఫర్డ్‌  వ్యాక్సిన్‌!.
  • రెగ్యులేటరీ అనుమతులు అందడమే తరువాయి
  •  వ్యాప్తి తగ్గే వరకూ జాగ్రత్తలు పాటించాలి
  •  ‘ఆంధ్రజ్యోతి’కి ప్రపంచ ఆరోగ్య సంస్థ సలహా సంఘ సభ్యుడు కె. శ్రీనాథ్‌ రెడ్డి


వచ్చే ఏడాది చివరిలోగా దేశంలో 70 శాతం మంది ప్రజలకు వ్యాక్సిన్‌ అందే అవకాశం ఉందని.. ప్రపంచ ఆరోగ్యం సంస్థ సలహా సంఘ సభ్యుడు, ప్రజారోగ్య సంస్థ అధ్యక్షుడు డాక్టర్‌ కె.శ్రీనాథ్‌ రెడ్డి తెలిపారు. ఆక్స్‌ఫర్డ్‌ ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్‌ (కొవిషీల్డ్‌).. రెండు, మూడు వారాల్లో భారతీయులకు అందుబాటులోకి వస్తుందని.. భారత్‌ బయోటెక్‌ టీకా కొవాగ్జిన్‌ , బయోలాజికల్‌-ఇ వ్యాక్సిన్‌ కూడా త్వరలోనే వస్తాయని వెల్లడించారు. ఇప్పటికే బ్రిటన్‌లో ఇచ్చిన ఫైజర్‌ వ్యాక్సిన్‌తో పోలిస్తే ఈ మూడు టీకాలూ భారతదేశంలో మారుమూల ప్రాంతాల ప్రజలకు సైతం ఇచ్చేందుకు అనుకూలం అని ఆయన వివరించారు. మన దేశంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వ్యాక్సినేషన్‌కు వేగంగా ఏర్పాట్లు చేస్తున్న నేపథ్యంలో.. వ్యాక్సిన్‌కు సంబంధించిన పలు అంశాలపై డాక్టర్‌ కె. శ్రీనాథ్‌రెడ్డి ‘ఆంధ్రజ్యోతి’తో ప్రత్యేకంగా ముచ్చటించారు. ఆ విశేషాలు..


మనదేశంలో ఏ టీకా, ఎప్పటి నుంచి ప్రజలకు అందే అవకాశం ఉంది?

ఆక్స్‌ఫర్డ్‌ ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్‌ కొవిషీల్డ్‌ మొదట మన దేశంలోకి వచ్చే అవకాశం ఉంది. బ్రిటన్‌ ప్రజలకు పంపిణీ చేసిన ఫైజర్‌ వ్యాక్సిన్‌ను మన దేశంలో కూడా సరఫరా చేసేందుకు ఆ సంస్థ ఆసక్తి చూపుతోంది. ఫైజర్‌ మన దేశంలో క్లినికల్‌ ట్రయల్స్‌ నిర్వహించలేదు. అత్యల్ప ఉష్ణోగ్రతలో భద్రపరచాల్సిరావడం ఫైజర్‌కు ప్రతికూలాంశం. మోడెర్నా టీకానూ మైనస్‌ 50 డిగ్రీల ఉష్ణోగ్రతలో భద్రపరచాలి.

మన దేశంలో అంత తక్కువ ఉష్ణోగ్రతలో నిల్వ చేసే గిడ్డంగులు అన్నిచోట్లా అందుబాటులో లేవు. కొవిషీల్డ్‌ వ్యాక్సిన్‌ డోస్‌లు కోట్ల సంఖ్యలో ఇప్పటికే పంపిణీకి సిద్ధంగా ఉన్నాయి. డీసీజీఐ అనుమతి రాగానే వ్యాక్సినేషన్‌ మొదలవుతుంది. రెగ్యులేటరీ అనుమతులు వచ్చేందుకు మరో 2-3 వారాల సమయం పడుతుంది. కొత్త సంవత్సరం ప్రారంభంలోగా వ్యాక్సిన్‌ భారత మార్కెట్‌లోకి వస్తుంది.


కొవిషీల్డ్‌కు ఇంకా ఎలాంటి అనుమతులు రావాల్సి ఉంది?

అక్స్‌ఫర్డ్‌ ఆస్ట్రాజెనెకా టీకాకు ఇంకా బ్రిటన్‌ ప్రభుత్వం అనుమతులు రాలేదు. డబ్ల్యూహెచ్‌ఓ అనుమతీ రావాల్సి ఉంటుంది. ఆ   తరువాత భారత్‌లో డీసీజీఐ అనుమతి పొందాలి. ఆ వెంటనే వ్యాక్సిన్‌ ఇవ్వడం ప్రారంభించవచ్చు.


టీకా సమర్థతను ఎంత వరకూ విశ్వసించవచ్చు?

గతంలో పోలిస్తే టెక్నాలజీ పెరిగింది. చింపాంజీలకు సోకే వైర్‌సల మీద ఆస్ట్రాజెనెకా గతంలో విస్తృతంగా పనిచేసింది. ఆ అనుభవంతోనే ఆ సంస్థ వేగంగా వ్యాక్సిన్‌ తయారు చేయగలిగింది. గతంలో వైర్‌సలను కట్టడి చేసేందుకు ఏదో ఒక దేశంలో మాత్రమే పరిశోధనలు జరిగేవి. కానీ, కరోనాకు అడ్డుకట్ట వేసే వ్యాక్సిన్‌ తయారుచేసేందుకు అనేక దేశాల్లో వందలాది సంస్థలు రంగంలోకి దిగాయి. నాణ్యమైన టీకాలు రూపొందించగలిగారు.

ఏ టీకా అయినా ఎంత సమర్థంగా పనిచేస్తుంది? టీకా తీసుకున్నాక ఆరోగ్యపరమైన ఇబ్బందులు వస్తాయా? టీకా ఎంత కాలం పనిచేస్తుందనేవి ప్రధానంగా చూడాల్సిన అంశాలు. ఆస్ట్రాజెనెకా, ఫైజర్‌, మోడెర్నాతో పాటు పలు టీకాలు 90 శాతం వరకూ సమర్థంగా పనిచేస్తున్నట్లు వెల్లడైంది. ఈ టీకాలన్నీ ఆరు నెలలకు పైగా వైర్‌సను కట్టడి చేయగలవని భావిస్తున్నారు. ఇంతకు మించి టీకా సమర్థత గురించి ఆలోచించాల్సిన అవసరం లేదేమో!


కొన్ని వ్యాక్సిన్‌లకు సంబంధించి మూడో దశ క్లినికల్‌ ట్రయల్స్‌ ఇంకా పూర్తి కాలేదు కదా?

ప్రస్తుతం అమెరికాతో పాటు యూరప్‌, కొన్ని ఆసియా  దేశాల్లో కూడా కేసుల సంఖ్య ఆందోళనకరమైన స్థాయులో పెరుగుతోంది. ప్రాథమికంగా వ్యాక్సిన్‌లు సంతృప్తికర ఫలితాలు ఇస్తున్నాయి కాబట్టి మూడో దశ క్లినికల్‌ ట్రయల్స్‌ ఫలితాల గురించి వేచి చూడకుండానే ప్రభుత్వాలు ముందడుగు వేస్తున్నాయి. భవిష్యత్తులో ఏవైనా ప్రతికూల ఫలితాలు కనిపించినా కాలక్రమంలో వ్యాక్సిన్‌లో మార్పులు చేసుకోవ వచ్చు. 


కంపెనీల మధ్య పోటీ కారణంగా టీకాలు తక్కువ ధరకు అందుబాటులోకి వస్తాయా?

ఆక్స్‌ఫర్డ్‌ టీకాను సీరమ్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియా రూ.250కే ఇచ్చే అంశంపై కేంద్ర ప్రభుత్వంతో చర్చలు జరుపుతోంది. పలు సంస్థలు ఇప్పటికే కోట్లాది టీకా డోస్‌లను ఉత్పత్తి చేశాయి. కంపెనీల మధ్య పోటీ కారణంగా ఇతర సంస్థలు కూడా తక్కువ ధరకే టీకాలను అందించే అవకాశం ఉంది. 





దేశప్రజలందరికీ టీకా ఎప్పటిలోగా అందొచ్చు?

మన దేశంలో భారత్‌ బయోటెక్‌, బయోలాజికల్‌-ఇ, సీరంతో పాటు పలు కంపెనీలకు కోట్ల సంఖ్యలో వ్యాక్సిన్‌లను ఉత్పత్తి చేసి పంపిణీ చేసే సామర్థ్యం ఉంది. వీటితో పాటు ఇంకా అనేక సంస్థల వ్యాక్సిన్‌లు త్వరలో మార్కెట్‌లో క్యూ కట్టనున్నాయి. ఈ నేపథ్యంలో 2021 చివరి నాటికి 70 శాతం మంది భారతీయ ప్రజలకు వ్యాక్సిన్‌ అందే అవకాశం ఉంది. 


టీకాతో కరోనా ముప్పు తొలగినట్టేనా?

కరోనా వ్యాప్తి ఇంకా ఎంత కాలం కొనసాగుతుందనేది ఎవరికీ తెలియదు. టీకా ద్వారా ఇమ్యూనిటీ వచ్చినా టీకాలు వెంటనే అందరికీ అందవు. వ్యాక్సిన్‌ తీసుకునే వరకూ ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. వైరస్‌ వ్యాప్తి తగ్గిందని పూర్తిగా నమ్మకం కలిగే వరకూ ప్రజలు అన్ని రకాల జాగ్రత్తలు పాటించాల్సిందే. 

                                                                                           - స్పెషల్‌ డెస్క్‌

Updated Date - 2020-12-11T09:10:03+05:30 IST