పాఠశాల ప్రారంభోత్సవం రోజే ఓ విద్యార్థికి కరోనా
ABN , First Publish Date - 2020-11-03T10:46:45+05:30 IST
పాఠశాలలు పునర్ ప్రారంభించిన మొదటిరోజే 18 ఏళ్ల ఓ విద్యార్థికి కరోనా పాజిటివ్ అని పరీక్షల్లో తేలిన ఘటన....
క్వారంటైన్‌లోకి మరో 15 మంది విద్యార్థులు
రాణిఖేట్ (ఉత్తరాఖండ్): పాఠశాలలు పునర్ ప్రారంభించిన మొదటిరోజే 18 ఏళ్ల ఓ విద్యార్థికి కరోనా పాజిటివ్ అని పరీక్షల్లో తేలిన ఘటన ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని రాణిఖేట్ పట్టణంలో వెలుగుచూసింది. ఓ విద్యార్థికి కరోనా ఉందని పరీక్షల్లో తేలడంతో అతనితో కలిసి ఉన్న మరో 15 మంది విద్యార్థులను క్వారంటైన్‌కు తరలించామని ఉత్తరాఖండ్ కొవిడ్ కంట్రోల్ రూం నోడల్ ఆఫీసర్ చెప్పారు. అనంతరం శానిటైజేషన్ చేసేందుకు పాఠశాలను మూడు రోజుల పాటు మూసివేశామని, కరోనా పాజిటివ్ అని వచ్చిన విద్యార్థితో కలిసి ఉన్న మరో 15 మంది విద్యార్థులకు కూడా కరోనా పరీక్షలు చేస్తామని నోడల్ ఆఫీసర్ జేసీ పాండే చెప్పారు.
ఉత్తరాఖండ్ రాష్ట్రంలో సోమవారం నుంచి ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు పునర్ ప్రారంభం కావడంతో ఓ విద్యార్థికి కరోనా ఉందని బయటపడింది. ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ప్రస్థుతం 3,914 కరోనా యాక్టివ్ కేసులుండగా, 57,609 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ఉత్తరాఖండ్ రాష్ట్రంలో కరోనా వల్ల 1,027 మంది మరణించారని ఆ రాష్ట్ర ఆరోగ్య, కుటుంబసంక్షేమ మంత్రిత్వశాఖ అధికారులు చెప్పారు.