వలస కూలీల ప్రయాణానికి రైల్వే శాఖకు రూ.1 కోటి బయానా చెల్లించాం : ఉత్తరాఖండ్

ABN , First Publish Date - 2020-05-14T00:43:24+05:30 IST

ఉత్తరాఖండ్‌ రాష్ట్రానికి ఇతర ప్రాంతాల నుంచి తిరిగి వెళ్లే వలస కూలీల ప్రయాణం

వలస కూలీల ప్రయాణానికి రైల్వే శాఖకు రూ.1 కోటి బయానా చెల్లించాం : ఉత్తరాఖండ్

న్యూఢిల్లీ : ఉత్తరాఖండ్‌ రాష్ట్రానికి ఇతర ప్రాంతాల నుంచి తిరిగి వెళ్లే వలస కూలీల ప్రయాణం కోసం రైల్వే మంత్రిత్వ శాఖకు రూ.1 కోటి ముందుగానే చెల్లించినట్లు ఉత్తరాఖండ్ ప్రభుత్వం పేర్కొంది.  సూరత్ నుంచి ప్రత్యేక రైలులో ప్రయాణం కోసం వలస కూలీల నుంచి టిక్కెట్ ఛార్జీలను వసూలు చేసినట్లు వచ్చిన వార్తలను తోసిపుచ్చింది. ఉత్తరాఖండ్ ప్రభుత్వ ఇన్ఫర్మేషన్ డైరెక్టరేట్ ఈ వివరాలను వెల్లడించింది. 


భారతీయ రైల్వేలకు ఉత్తరాఖండ్ ప్రభుత్వం చెల్లించిన సొమ్ము వివరాలను, రాష్ట్రానికి చెందిన వలస కూలీలను ఇతర రాష్ట్రాల నుంచి తీసుకురావడానికి ప్రత్యేక రైళ్లను నడపాలని కేంద్ర ప్రభుత్వంతో జరిపిన సంప్రదింపుల వివరాలను ఇన్ఫర్మేషన్ డైరెక్టరేట్ వెల్లడించింది. 


ఇన్ఫర్మేషన్ డైరెక్టరేట్ డైరెక్టర్ జనరల్ (డీజీ) మెహర్బన్ సింగ్ బిష్త్ మాట్లాడుతూ సూరత్ నుంచి ప్రత్యేక రైలులో ఉత్తరాఖండ్‌కు తిరిగి వచ్చిన దాదాపు 1,200 మంది వలస కూలీల టిక్కెట్ ఛార్జీలను రాష్ట్ర ప్రభుత్వం చెల్లించలేదని మంగళవారం కొన్ని పత్రికల్లో వచ్చిన వార్తలపై ప్రభుత్వం స్పందిస్తోందన్నారు. ఈ వివరాలన్నిటినీ పారదర్శకంగా ప్రజల ముందు ఉంచాలని నిర్ణయించిందన్నారు.  ఇతర ప్రాంతాల నుంచి తిరిగి వచ్చే వలస కూలీల ప్రయాణం కోసం రైల్వే మంత్రిత్వ శాఖకు రూ.1 కోటి ముందుగానే రాష్ట్ర ప్రభుత్వం చెల్లించినట్లు తెలిపారు. ప్రభుత్వ ప్రతిష్ఠను దెబ్బతీసేందుకే ఓ వర్గం మీడియా దుష్ప్రచారం చేస్తోందన్నారు. ప్రయాణం కోసం వలస కూలీల నుంచి టిక్కెట్ ఛార్జీలను వసూలు చేసినట్లు వచ్చిన వార్తల్లో వాస్తవం లేదన్నారు.


Updated Date - 2020-05-14T00:43:24+05:30 IST