కోజికోడ్ విమానాశ్రయంలో ప్రమాదం నేపథ్యంలో విమానయాన శాఖ కీలక ప్రకటన

ABN , First Publish Date - 2020-08-12T03:28:21+05:30 IST

కేరళలోని కోజికోడ్‌ విమానాశ్రయంలో విమాన ప్రమాదం నేపథ్యంలో విమానయాన శాఖ...

కోజికోడ్ విమానాశ్రయంలో ప్రమాదం నేపథ్యంలో విమానయాన శాఖ కీలక ప్రకటన

కోజికోడ్: కేరళలోని కోజికోడ్‌ విమానాశ్రయంలో విమాన ప్రమాదం నేపథ్యంలో విమానయాన శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మాన్‌సూన్(వర్షాకాలం) సీజన్ వరకూ కోజికోడ్‌ విమానాశ్రయంలో భారీ విమానాల రాకపోకలను నిషేధిస్తున్నట్లు ప్రకటించింది. భారీ వర్షం కారణంగా విమాన ప్రమాదం జరగడంతో విమానయాన శాఖ ఈ నిర్ణయం తీసుకుంది.


ఆగస్ట్ 7న రాత్రి 7:40 గంటలకు జోరుగా వర్షం పడుతుండటంతో రన్‌వే అంతా చిత్తడిగా ఉంది. 191 మందితో ఉన్న విమానం ఒకటి ల్యాండ్‌ అయ్యేందుకు గాల్లోంచి రన్‌వే వైపు దూసుకొచ్చింది. రన్‌వేను తాకగానే పట్టుకోల్పోయింది. అలాగే జారుతూ... గింగిరాలు తిరుగుతూ రన్‌వే చివరి దాకా వేగంగా దూసుకెళ్లి 50 అడుగుల లోతైన లోయలో పడింది. ఆ వెంటనే పెద్ద శబ్దంతో విమానం రెండు ముక్కలైంది! విమానంలో ఉన్నవారిలో 20 మంది ప్రాణాలు కోల్పోయారు. ఎయిర్‌ ఇండియాకు చెందిన బోయింగ్‌ 737 ఐఎక్స్‌ 1344, ఎక్స్‌ప్రెస్‌ విమానం ఇలా ఘోర ప్రమాదం బారిన పడింది. 


భారీ వర్షం పడుతుండగా ఆకాశంలో చక్కర్లు కొడుతూ ల్యాండింగ్‌ కోసం రెండుసార్లు ప్రయత్నించింది. మూడో ప్రయత్నంలో ల్యాండింగ్‌ అవుతూ పదో నంబరు రన్‌వేను తాకిన వెంటనే విమానం ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో విమానంలోని ఇద్దరు పైలట్లూ కూడా మృతి చెందారు. చినుకులతో రన్‌వే చిత్తడిగా ఉండటంతోనే ల్యాండింగ్‌ సమయంలో విమానం పట్టుకోల్పోయి ప్రమాదానికి గురైందని కేరళ మంత్రి రాజు అన్నారు. అయితే రన్‌వే మీద నిర్ధారిత వేగం కన్నా మించిన వేగంతో ల్యాండింగ్‌ కావడంతోనే ప్రమాదం జరిగివుంటుందని నిపుణులు విశ్లేషిస్తున్నారు.Updated Date - 2020-08-12T03:28:21+05:30 IST