అమెరికాలో టీకా మార్గదర్శకాలు: అలర్జీ వస్తే.. రెండో డోసు వద్దు!

ABN , First Publish Date - 2020-12-20T15:35:46+05:30 IST

కరోనా టీకాతో అలర్జీ వచ్చిన సందర్భాల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అమెరికా ప్రభుత్వం కొత్త మార్గదర్శకాలను విడుదల చేసింది.

అమెరికాలో టీకా మార్గదర్శకాలు: అలర్జీ వస్తే.. రెండో డోసు వద్దు!

వాషింగ్టన్: కరోనా టీకాతో అలర్జీ వచ్చిన సందర్భాల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అమెరికా ప్రభుత్వం కొత్త మార్గదర్శకాలను విడుదల చేసింది. మొదటి టీకా డోసు తీసుకున్న వారిలో తీవ్రమైన అలర్జీ తలెత్తితే రెండో డోసు తీసుకోవద్దని సూచించింది. అంటువ్యాధుల పరిశోధన సంస్థ సెంటర్ ఫర్ డీసీజ్ కంట్రోల్ నిర్వచనం ప్రకారం.. అలర్జీ రియాక్షన్‌ను తగ్గించేందుకు ఆస్పత్రి చికిత్స అవసరమైన సందర్భాలను తీవ్రమైన కేసులుగా పరిగణించాలి. అయితే..ఆహారం, లేటెక్స్, ఇతర పర్యావరణ కారణాల రీత్యా అలర్జీకి గురయ్యే వారు ముందుగా డాక్టర్లను సంప్రదించి, ఆ తరువాత టీకా తీసుకోవాలని చెప్పింది. ఇప్పటివరకూ అమెరికా ప్రభుత్వం ఫైజర్, మోడర్నా టీకాలకు అత్యవసర అనుమతులు ఇచ్చిన విషయం తెలిసిందే. కానీ ఫైజర్ టీకా తీసుకున్న ఐదుగురిలో అలర్జీ లక్షణాలు కనిపించాయి. దీని వెనుక కారణాలు కునుగునేందుకు అక్కడి ప్రభుత్వం విస్తృత స్థాయి అధ్యయనం చేస్తోంది.


చైనాలో కొత్త వ్యూహం!

ఇక టీకాల ద్వారా సమాజంలో హెర్డ్ ఇమ్యూనిటీ(60 శాతం జనాభాలో కరోనా రోగినిరోధక శక్తి అభివృద్ధి చెందడం) తీసుకొచ్చేందుకు చైనా ప్రయత్నిస్తోంది. ఈ క్రమంలో..ముందుగా కరోనా రిస్క్ ఎక్కువగా ఉన్న ప్రాధాన్య వర్గాలకు టీకా ఇచ్చేందుకు అక్కడి ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. శీతలీకరణ కేంద్రాల సిబ్బంది, క్వారంటైన్ కేంద్రాలు, రావాణా రంగం, ఫుడ్ మార్కెట్లు, ఆరోగ్య సిబ్బందికి తొలుత టీకా అందిస్తామని చైనాలోని నేషనల్ హెల్త్ కమిషన్ ప్రకటించింది. 

Updated Date - 2020-12-20T15:35:46+05:30 IST