చైనాపై అమెరికా చర్యలు షురూ..?

ABN , First Publish Date - 2020-04-29T01:46:48+05:30 IST

అమెరికాకు చెందిన సెమీ కండెక్టర్ పరికరాలు, అత్యాధునిక సాంకేతికత.. చైనా మిలిటరీ చేతుల్లోకి వెళ్లకుండా ఉండేందుకు చర్యలు తీసుకుంటామని అమెరికా ప్రభుత్వం సోమవారం ప్రకటించింది.

చైనాపై అమెరికా చర్యలు షురూ..?

వాషింగ్టన్: అమెరికాకు చెందిన సెమీ కండెక్టర్ పరికరాలు, అత్యాధునిక సాంకేతికత.. చైనా మిలిటరీ చేతుల్లోకి వెళ్లకుండా ఉండేందుకు చర్యలు తీసుకుంటామని అమెరికా ప్రభుత్వం సోమవారం ప్రకటించింది. కొత్తగా నిబంధనల ప్రకారం చైనాకు ఆయా ఉత్పత్తులు ఎగుమతి చేసే అమెరికా సంస్థలు ముందుగా ప్రభుత్వం నుంచి లైసెన్స్ పొందాల్సి ఉంటుంది. మిలిటరీ అవసరాలకే కాకుండా పౌరులప్రయోజనార్థం చైనాకు ఎగుమతి చేయాలన్నా కూడా ఇకపై ప్రభుత్వ అనుమతి తప్పనిసరి అని తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన ముసాయిదా నిబంధనలపై అమెరికా ప్రభుత్వం ప్రజల అభిప్రాయాలను కోరింది. అభిప్రాయ సేకరణ అనంతరం ట్రంప్.. వీటిపై తుది నిర్ణయం తీసుకుంటారని సమాచారం. కరోనా సంక్షోభం విషయంలో చైనా అమెరికా తీవ్ర ఆరోపణలు చేస్తున్న నేపథ్యంలో ఈ పరిణామాలు చోటు చేసుకోవడం గమనార్హం. అమెరికా సాంకేతికతను సైనిక అవసరాలకు మళ్లిస్తున్న దేశాలతో వ్యాపారం చేస్తే వచ్చే పర్యవసానాలను లోతుగా పరిశీలించాలని కామర్స్ సెక్రెటరీ విల్‌బర్ రాస్ ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. మరోవైపు.. ఇది అమల్లోకి వస్తే అమెరికా సెమీకండక్టర్ రంగంపై పెను ప్రభావం చూపుతుందని మార్కెట్ విశ్లేషకులు భావిస్తున్నారు. 

Updated Date - 2020-04-29T01:46:48+05:30 IST