బీహార్ ఎన్నికలను 'వికాస్ వెర్సస్ జైల్'గా పోల్చిన బీజేపీ
ABN , First Publish Date - 2020-09-18T21:25:38+05:30 IST
వికాస్‌కు, జైల్‌కు మధ్య (వికాస్ వెర్సస్ జైల్) జరుగుతున్న పోరుగా బీహార్ ఎన్నికలను బీజేపీ ప్రతినిధి..

పాట్నా: వికాస్‌కు, జైల్‌కు మధ్య (వికాస్ వెర్సస్ జైల్) జరుగుతున్న పోరుగా బీహార్ ఎన్నికలను బీజేపీ ప్రతినిధి సంబిత్ పాత్ర పోల్చారు. శుక్రవారంనాడు మీడియాతో మాట్లాడుతూ, ఒకవైపు నరేంద్ర మోదీ, నితీష్ కుమార్‌లు హిందుస్థాన్, బీహార్‌ను ముందుకు తీసుకువెళ్తుంటే, మరోవైపు చీఫ్ క్యాండిడేట్ జైలులో ఉన్నారని నేరుగా లాలూ ప్రసాద్ పేరును ప్రస్తావించకుండా ఆయన అన్నారు.
కాంగ్రెస్, ఆర్జేడీపై సంబిత్ పాత్ర విమర్శలు గుప్పిస్తూ... 'ఒక పార్టీలో అన్నాచెల్లెలు ఒకరితో ఒకరు పోట్లాడుకుంటారు. 23 మంది నేతల్లో కొందరు అన్నకు మద్దతుగా, మరికొందరు చెల్లికి మద్దతుగా లేఖలు రాస్తారు. అక్కడ అనిశ్చితి (కాంగ్రెస్) ఉంది. మరోవైపు, బీహార్‌లో ఇద్దరు సోదరులు ఉన్నారు. అక్కడా ఇలాంటి అనిశ్చితే ఉంది' అని ఆయన విమర్శంచారు. ఎవరిని ఎన్నుకోవాలనేది బీహార్ ప్రజలే నిర్ణయిస్తారని సంబిత్ పాత్ర పేర్కొన్నారు. కాగా, నవంబర్ 29వ తేదీతో బీహార్ అసెంబ్లీ గడువు ముగియనుంది. ఈలోపే ఎన్నికలు నిర్వహిస్తామని ఈసీ ప్రకటించింది. అయితే, ఎన్నికల తేదీలపై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు.