కరోనాపై విజయం మనదే

ABN , First Publish Date - 2020-06-18T07:35:11+05:30 IST

కరోనాపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసికట్టుగా పోరాడితే విజయం మనదేనని ప్రధాని నరేంద్రమోదీ అన్నారు. ఆర్థిక కార్యకలాపాలను వేగవంతం చేస్తూనే కరోనా వ్యాప్తి చెందకుండా జాగ్రత్త చర్యలు తీసుకోవాలని...

కరోనాపై విజయం మనదే

  • మళ్లీ లాక్‌డౌన్‌ పుకార్లను ఖండించాలి : ప్రధాని
  • సీఎంలతో వీడియో కాన్ఫరెన్స్‌

న్యూఢిల్లీ, జూన్‌ 17 (ఆంధ్రజ్యోతి): కరోనాపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసికట్టుగా పోరాడితే విజయం మనదేనని ప్రధాని నరేంద్రమోదీ అన్నారు. ఆర్థిక కార్యకలాపాలను వేగవంతం చేస్తూనే కరోనా వ్యాప్తి చెందకుండా జాగ్రత్త చర్యలు తీసుకోవాలని రాష్ట్రాల ముఖ్యమంత్రులకు సూచించారు. మళ్లీ లాక్‌డౌన్‌ విధిస్తారన్న పుకార్లను ఖండించాలన్నారు. దేశంలో క్రమంగా అన్‌లాక్‌ చేస్తున్నామని తెలిపారు. ప్రజలకు సాధ్యమైనంత తక్కువ ఇబ్బందులు కలిగేలా చూడడం మన కర్తవ్యమన్నారు.


బుధవారం వివిధ రాష్ట్రాల  ముఖ్యమంత్రులతో ప్రధాని వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. కరోనా సోకిన వారిని కనిపెట్టి పరీక్షలు చేయించాల్సిన అవసరం ఉందన్నారు. దేశంలో పరీక్షా కేంద్రాలతోపాటు ఆరోగ్య మౌలిక సదుపాయాలు పుష్కలంగా ఉన్నాయని, వాటిని పూర్తిగా వినియోగించుకోవాలని సూచించారు. వర్షాకాలంలో కరోనా వ్యాప్తి చెందకుండా అప్రమత్తంగా ఉండాలన్నారు. ఇక దేశం ఆర్థికంగా కోలుకోవడం ప్రారంభమైందని, ద్రవ్యోల్బణం కూడా తగ్గిపోతోందని తెలిపారు. కొన్ని పెద్ద రాష్ట్రాలు, నగరాల్లో కరోనా వైరస్‌ అధికంగా ప్రబలిందని, జనాభా సాంద్రత ఎక్కువగా ఉండడం, భౌతిక దూరం పాటించడం కష్టతరం కావడం, పెద్ద సంఖ్యలోప్రజలు వీధుల్లో ప్రయాణించడం వల్ల సవాళ్లు ఎదురయ్యాయని ప్రధాని పేర్కొన్నారు. అయితే పరిపాలనా యంత్రాంగం సంసిద్ధంగా ఉండడం, ప్రజలు సహనం పాటించడం, కరోనా యోధుల అంకితభావం వల్ల వ్యాప్తిని నియంత్రించగలిగామని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ సమావేశంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌, ఒడిసా, మహారాష్ట్ర, తమిళనాడు, ఢిల్లీ, రాజస్థాన్‌, గుజరాత్‌, ఉత్తరప్రదేశ్‌, మధ్య ప్రదేశ్‌, పశ్చిమ బెంగాల్‌, కర్ణాటక, బిహార్‌, హరియాణా, జమ్ము కశ్మీర్‌ రాష్ట్రాలు పాల్గొన్నాయి. 

Updated Date - 2020-06-18T07:35:11+05:30 IST