కొవిడ్‌తో కేంద్ర మంత్రి కన్నుమూత

ABN , First Publish Date - 2020-09-24T07:09:11+05:30 IST

రైల్వే శాఖ సహాయమంత్రి సురేష్‌ అంగడి(65) కరోనా వైరస్‌ సోకి మరణించారు.

కొవిడ్‌తో కేంద్ర మంత్రి కన్నుమూత

ఎయిమ్స్‌లో  తుదిశ్వాస విడిచిన రైల్వేశాఖ సహాయమంత్రి సురేశ్‌ అంగడి

కర్ణాటకలోని బెళగావి నుంచి 4 సార్లు వరుసగా లోక్‌సభకు ఎన్నిక

ఐదో రోజూ కేసుల్ని మించి రికవరీలు


న్యూఢిల్లీ, సెప్టెంబరు 23: రైల్వే శాఖ సహాయమంత్రి సురేష్‌ అంగడి(65) కరోనా వైరస్‌ సోకి మరణించారు. కొవిడ్‌ వల్ల కన్నుమూసిన తొలి కేంద్ర మంత్రి ఆయన. వైరస్‌ సోకడంతో 2 వారాల కిందటే ఢిల్లీలోని ఎయిమ్స్‌లో చేరారు.  చికి త్స పొందుతున్న సమయంలో శ్వాసకోశ ఇబ్బందులు తలెత్తా యి. వెంటిలేటర్‌, ఎక్మోల సాయంతో చికిత్స అందించినా ఫలి తం లేకపోయింది. ఆయనకు భార్య మంగళ్‌, కుమార్తెలు స్ఫూర్తి, శారద ఉన్నారు. సురేశ్‌ ఆకస్మిక మృతిపై రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌, ప్రధాని మోదీ, కేంద్రమంత్రులు, సీఎంలు సంతాపం ప్రకటించారు. కొవిడ్‌ వల్ల చనిపోయిన ఎంపీల్లో సురేశ్‌ నాలుగోవారు. తమిళనాడుకు చెందిన వసంతకుమార్‌, కర్ణాటకకు చెందిన అశోక్‌ గస్తీ, ఏపీకి చెందిన బల్లి దుర్గాప్రసాదరావు వైరస్‌ సోకి ప్రాణాలొదిలారు. కాగా, దేశంలో వరుసగా ఐదో రోజు కరోనా కొత్త కేసుల కన్నా రికవరీల సంఖ్య ఎక్కువగా నమోదైంది.


గత 24 గంటల్లో కొత్తగా 83,347 కేసు లు, 1085 కరోనా మరణాలు నమోదు కాగా.. 89,746 మంది కోలుకున్నారు. దేశంలో కరోనా రికవరీ రేటు 81.25ు ఉందని కేంద్రం తెలిపింది. ప్రపంచంలోనే అత్యధిక కొవిడ్‌ రికవరీ కేసులు భారత్‌లో నమోదైనట్టు వెల్లడించింది. దేశవ్యాప్తంగా ఇప్పటిదాకా 6.6 కోట్ల కరోనా టెస్టులు చేసినట్టు భారత వైద్య పరిశోధన మండలి ప్రకటించింది. దేశంలో సగటున ప్రతి 10 లక్షల జనాభాకూ టెస్టుల సంఖ్య 48,028కి చేరింది. కాగా.. ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీశ్‌ సిసోడియా ఆస్పత్రిలో చేరారు. సెప్టెంబరు 14న ఆయనకు కరోనా పాజిటివ్‌ రాగా.. అప్పట్నుంచీ హోం ఐసోలేషన్‌లో ఉండి చికిత్స పొందుతున్నారు. బుధవారం ఆయన్ను ఆస్పత్రిలో చేర్చినట్టు సమాచారం. మరోవైపు, కర్ణాటకలో ఈ వైరస్‌కు చికిత్స పొందుతున్న కాంగ్రెస్‌ ఎమ్మెల్యే బి.నారాయణరావు పరిస్థితి విషమంగా ఉన్నట్టు ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. 


సూక్ష్మ కట్టడి ప్రాంతాలపై దృష్టి: ప్రధాని

కరోనాను సమర్థంగా అరికట్టడానికి సూక్ష్మ కట్టడి ప్రాంతాలపై దృష్టి సారించాలని కేసులు ఎక్కువగా వస్తున్న రాష్ట్రాల ముఖ్యమంత్రులకు ప్రధాని మోదీ సూచించారు. కరోనా పాజిటివ్‌లు విస్తృతంగా నమోదవుతున్న మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్‌, కర్ణాటక, ఉత్తరప్రదేశ్‌, తమిళనాడు, ఢిల్లీ, పంజాబ్‌ రాష్ట్రాల సీఎంలతో బుధవారం ఆయన ఆన్‌లైన్‌ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఆయా రాష్ట్రాల ఆరోగ్య మంత్రులు కూడా ఈ వర్చువల్‌ భేటీలో పాల్గొన్నారు. దేశంలో 700కు పైగా జిల్లాలుండగా ఆ ఏడు రాష్ట్రాల్లోని 60 జిల్లాల్లోనే ఆందోళన కలిగించే స్థాయిలో కేసులున్నాయన్న మోదీ కరోనాను ఎదుర్కొంటూనే ఆర్థిక కార్యకలాపాలను విస్తృతంగా జరపాలన్నారు. 

Updated Date - 2020-09-24T07:09:11+05:30 IST