రికార్డు స్థాయిలో కోవిడ్ కేసులు.. 5 రాష్ట్రాలతో హెల్త్ సెక్రటరీ సమీక్ష

ABN , First Publish Date - 2020-09-06T21:42:49+05:30 IST

ప్రపంచంలోనే కోవిడ్ బాధిత దేశాల్లో రెండు స్థానానికి ఇండియా చేరువవుతుండటం, ఆదివారంనాడు..

రికార్డు స్థాయిలో కోవిడ్ కేసులు.. 5 రాష్ట్రాలతో హెల్త్ సెక్రటరీ సమీక్ష

న్యూఢిల్లీ: ప్రపంచంలోనే కోవిడ్ బాధిత దేశాల్లో రెండు స్థానానికి ఇండియా చేరువవుతుండటం, ఆదివారంనాడు రికార్డు స్థాయిలో 90,633 కరోనా కేసులు నమోదు కావడంతో కేంద్రం మరింత అప్రమత్తమైంది. కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి వీడియా కాన్ఫరెన్స్ ద్వారా ఐదు రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతానికి చెందిన ఆరోగ్య శాఖ కార్యదర్శులతో సమీక్షా సమావేశం జరిపారు. ఆయా రాష్ట్రాల పరిధిలోని 35 జిల్లాల్లో కోవిడ్-19 మేనేజిమెంట్‌పై ఆరా తీశారు. పశ్చిమబెంగాల్, మహారాష్ట్ర, గుజరాత్, జార్ఖండ్, ఢిల్లీ పుదుచ్చేరి ఆరోగ్య కార్యదర్శులు ఈ సమీక్షా సమావేశంలో పాల్గొన్నారు.


దేశంలో కోవిడ్-19 తీవ్ర ప్రభావం ఉన్న 35 జల్లాల్లో నాలుగు జిల్లాలు పశ్చిమబెంగాల్‌లో ఉన్నాయి. కోల్‌కతా, హౌరా, నార్త్ 24 పరగణాలు, 24 సౌత్ పరగణాలు ఇందులో ఉన్నాయి. మహారాష్ట్రలో పుణె, నాగపూర్, థానె, ముంబై, ముంబై సబర్బన్, కొల్హాపూర్, సాంగ్లి, నాసిక్, అహ్మద్‌నగర్, రాయగఢ్, జల్గావ్, షోలాపూర్, సతార, పాల్ఘర్, ఔరంగాబాద్, థులే, నాందేడ్ జిల్లాలు ఉన్నాయి. గుజరాత్‌లో సూరత్, పుదుచ్చేరిలో పాండిచ్చేరి, జార్ఖాండ్‌లో ఈస్ట్ సింగ్భూమ్, ఢిల్లీలోని 11 జిల్లాలు ఉన్నాయి. వీడియో కాన్ఫరెన్స్‌లో రాష్ట్ర కార్యదర్శులతో పాటు, జిల్లా కలెక్టర్లు, మున్సిపల్ కమిషనర్లు తదితరులు పాల్గొన్నారు. ఆయా జిల్లాల్లో కోవిడ్-19 ప్రస్తుత పరిస్థితిపై హెల్త్ కార్యదర్శులు ప్రెజంటేషన్ ఇచ్చారు.


యాక్టివ్ కేసుల వివరాలు...

కేంద్ర హోం శాఖ వివరాల ప్రకారం, పశ్చిమబెంగాల్‌లో 23,390 యాక్టివ్ కేసులు ఉండగా, మహారాష్ట్రలో 2,21,012 యాక్టివ్ కేసులు ఉన్నాయి. గుజరాత్‌లో 16,334, పుదుచ్చేరిలో 5,161, జార్ఖండ్‌లో 15,005, ఢిల్లీలో 19,870 యాక్టివ్ కేసులు నమోదయ్యాయి. మరోవైపు, ఒక్క ఆదివారంనాడే దేశ వ్యాప్తంగా 90,633 కేసులు నమోదు కావడంతో మొత్తం కరోనా కేసుల సంఖ్య 41 లక్షలు దాటింది. గత 24 గంటల్లో 1,065 మందికి పైగా మృతి చెందారు. దీంతో దేశంలో కరోనా మృతుల సంఖ్య 70,626కు చేరింది.

Updated Date - 2020-09-06T21:42:49+05:30 IST