కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు దసరా కానుక... 30 లక్షల మందికి ప్రయోజనం...

ABN , First Publish Date - 2020-10-21T21:25:53+05:30 IST

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర మంత్రివర్గం బుధవారం లక్షలాది

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు దసరా కానుక... 30 లక్షల మందికి ప్రయోజనం...

న్యూఢిల్లీ : ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర మంత్రివర్గం బుధవారం లక్షలాది మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు సంతోషం కలిగించే నిర్ణయం తీసుకుంది. పండుగల సీజన్‌లో ఇంటిల్లిపాదీ ఆనందంగా గడపటానికి ఈ నిర్ణయం దోహదపడుతుంది. 2019-20 ఆర్థిక సంవత్సరానికి ప్రొడక్టివిటీ లింక్డ్, నాన్ ప్రొడక్టివిటీ లింక్డ్ బోనస్‌ను చెల్లించేందుకు ఆమోదించింది. దీంతో ప్రభుత్వంపై రూ.3,737 కోట్ల భారం పడుతుంది. 


కేంద్ర మంత్రి ప్రకాశ్ జవదేకర్ మాట్లాడుతూ సుమారు 30 లక్షల మంది కేంద్ర ప్రభుత్వ నాన్ గెజిటెడ్ ఉద్యోగులకు ప్రయోజనం కలిగించే నిర్ణయాన్ని కేంద్ర మంత్రివర్గం తీసుకున్నట్లు తెలిపారు. 2019-20 ఆర్థిక సంవత్సరానికి ప్రొడక్టివిటీ లింక్డ్, నాన్ ప్రొడక్టివిటీ లింక్డ్ బోనస్‌ను చెల్లించేందుకు ఆమోదించినట్లు తెలిపారు. ఈ నిర్ణయం వల్ల ప్రభుత్వంపై రూ.3,737 కోట్ల భారం పడుతుందన్నారు. విజయ దశమి పండుగకు ముందే ఈ బోనస్‌ను అర్హులైనవారికి ఒకేసారి డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్‌ఫర్ (డీబీటీ) ద్వారా అందజేస్తామన్నారు. మధ్య తరగతి వర్గాల చేతిలో సొమ్ము ఉంటే, మార్కెట్లో డిమాండ్ పెరుగుతుందన్నారు. 


పండుగల సమయంలో మార్కెట్లో డిమాండ్‌ను పెంచడానికి ఈ చర్య ఉపయోగపడుతుందని నిపుణులు చెప్తున్నారు. రైల్వేలు, తపాలా కార్యాలయాలు, ఈపీఎఫ్ఓ, ఈఎస్ఐసీ వంటి ప్రభుత్వ కమర్షియల్ ఎస్టాబ్లిష్‌మెంట్స్‌లో పని చేసే ఉద్యోగులు ఈ బోనస్ పొందుతారు. వీరికి అందే బోనస్ ప్రొడక్టివిటీ లింక్డ్ బోనస్. వీరు దాదాపు 17 లక్షల మంది ఉంటారు, వీరికి రూ.2,791 కోట్లు చెల్లిస్తారు. నాన్ ప్రొడక్టివిటీ లింక్డ్ బోనస్ పొందేందుకు 13 లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగులు అర్హులు, వీరికి రూ.946 కోట్లు అందజేస్తారు.


Updated Date - 2020-10-21T21:25:53+05:30 IST