స్వదేశీ ఆకాశ్ మిసైల్ సిస్టమ్ ఎగుమతులకు ఆమోదం

ABN , First Publish Date - 2020-12-30T20:42:39+05:30 IST

దేశీయంగా అభివృద్ధిపరచిన ఆకాశ్ మిసైల్ సిస్టమ్‌ ఎగుమతుల

స్వదేశీ ఆకాశ్ మిసైల్ సిస్టమ్ ఎగుమతులకు ఆమోదం

న్యూఢిల్లీ : దేశీయంగా అభివృద్ధిపరచిన ఆకాశ్ మిసైల్ సిస్టమ్‌ ఎగుమతుల ప్రతిపాదనకు కేంద్ర మంత్రివర్గం బుధవారం ఆమోదం తెలిపింది. మన దేశంలో మోహరించిన ఆకాశ్ మిసైల్ సిస్టమ్‌కు ఎగుమతి చేసే సిస్టమ్‌కు తేడా ఉంది. ఎగుమతులకు సత్వర అనుమతుల మంజూరుకు ప్రత్యేకంగా ఓ కమిటీని ఏర్పాటు చేసేందుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. మంత్రివర్గ సమావేశం అనంతరం రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ట్విటర్ వేదికగా ఈ వివరాలను వెల్లడించారు. 


ఆత్మనిర్భర్ (స్వయం సమృద్ధ) భారత్ విజన్ ప్రకారం అనేక రకాల డిఫెన్స్ ప్లాట్‌ఫామ్స్, మిసైల్స్ తయారీ సామర్థ్యాలను భారత దేశం పెంచుకుంటోందని తెలిపారు. దేశీయంగా అభివృద్ధిపరచిన ఆకాశ్ మిసైల్ సిస్టమ్‌ను ఎగుమతి చేసేందుకు, అనుమతులను వేగవంతం చేయడానికి ఓ కమిటీని ఏర్పాటు చేసేందుకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలో జరిగిన కేంద్ర మంత్రివర్గం ఆమోదించిందని తెలిపారు. 


ఆకాశ్ మిసైల్ సిస్టమ్ మన దేశంలో ముఖ్యమైనదని తెలిపారు. ఇది 96 శాతానికిపైగా స్వదేశీ పరిజ్ఞానంతో తయారైందని అన్నారు. ఇది భూమి నుంచి గగనతలానికి ప్రయోగించగలిగే మిసైల్ అని, 25 కిలోమీటర్ల పరిథిలోని లక్ష్యాలను ఛేదించగలదని తెలిపారు. ప్రస్తుతం మన దేశ సాయుధ దళాల వద్ద ఉన్న ఆకాశ్ మిసైల్ సిస్టమ్‌కు ఎగుమతి చేయబోయేదానికి తేడా ఉందన్నారు. ప్రస్తుతం మన దేశం రక్షణ రంగానికి సంబంధించిన విడి భాగాలను ఎగుమతి చేస్తోందని, బిగ్ ప్లాట్‌ఫామ్స్‌ ఎగుమతి స్వల్పంగా జరుగుతోందని తెలిపారు. మన దేశ రక్షణ రంగ ఉత్పత్తులు మరింతమెరుగుపడటానికి, అంతర్జాతీయంగా పోటీపడటానికి మంత్రివర్గ నిర్ణయం దోహదపడుతుందని పేర్కొన్నారు. 5 బిలియన్ డాలర్ల విలువైన రక్షణ రంగ ఉత్పత్తులను ఎగుమతి చేయాలన్నలక్ష్యాన్ని సాధించడంపై దృష్టి సారించినట్లు తెలిపారు. 


Updated Date - 2020-12-30T20:42:39+05:30 IST