రైతులతో అసంపూర్తిగా ముగిసిన కేంద్రం చర్చలు

ABN , First Publish Date - 2020-12-02T01:57:07+05:30 IST

దేశ రాజధాని హస్తినలో ఆందోళనకు దిగిన రైతు సంఘాలతో కేంద్రం జరిపిన చర్చలు అసంపూర్తిగా ముగిశాయి. వ్యవసాయ చట్టాలను...

రైతులతో అసంపూర్తిగా ముగిసిన కేంద్రం చర్చలు

న్యూఢిల్లీ: దేశ రాజధాని హస్తినలో ఆందోళనకు దిగిన రైతులతో కేంద్రం జరిపిన చర్చలు అసంపూర్తిగా ముగిశాయి. వ్యవసాయ చట్టాలను వెనక్కి తీసుకోవాలని రైతు సంఘాల నేతలు కేంద్రానికి తేల్చి చెప్పారు. వ్యవసాయ నిపుణులైన అధికారులతో కమిటీ వేసేందుకు కేంద్రం ప్రతిపాదన చేసింది. నవంబర్ 3న రైతు సంఘాలతో మరోసారి చర్చించాలని కేంద్రం నిర్ణయించింది. చర్చల ప్రక్రియ పూర్తయ్యే వరకు ఆందోళన కొనసాగిస్తామని రైతు సంఘలు స్పష్టం చేశాయి. రైతు సంఘాలతో చర్చల గురించి కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్రసింగ్‌ తోమర్ మాట్లాడుతూ.. నవంబర్ 3న మరోసారి సమావేశం కావాలని నిర్ణయించామని, సమస్యల పరిష్కారానికి కమిటీ ఏర్పాటును ప్రతిపాదించామని తెలిపారు. ఇతర రైతులతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని నరేంద్రసింగ్‌ తోమర్ వెల్లడించారు.


ఇదిలా ఉండగా కేంద్రం చేసిన చట్టాలను వ్యతిరేకిస్తూ రైతులు చేస్తున్న ఆందోళనకు రోజురోజుకూ మద్దతు పెరుగుతుండటం గమనార్హం. అఖిల భారత కిసాన్‌ సంఘర్ష్‌ సమన్వయ కమిటీతో పాటు 30 సంఘాల చలో ఢిల్లీ పిలుపు మేరకు వేలాది మంది రైతులు ఢిల్లీ సరిహద్దుల్లోని సంఘూ, టిక్రి పాయింట్ల వద్ద రహదారుల పైనే బైఠాయించారు. అక్కడే వండుకు తింటున్నారు. వణికిస్తున్న చలిలో అక్కడే నిద్రిస్తున్నారు. బురారి గ్రౌండ్స్‌కు (నిరంకారి మైదానం) తరలాలన్న అమిత్‌ షా విజ్ఞప్తిని తిరస్కరించిన రైతులు జంతర్‌మంతర్‌ లేదా రాంలీలా మైదానంలో నిరసనలకు అనుమతిస్తేనే ఢిల్లీలోకి ప్రవేశిస్తామంటున్నారు. పంజాబ్‌, యూపీ, ఉత్తరాఖండ్‌, హరియాణ, మధ్యప్రదేశ్‌ తదితర రాష్ట్రాల నుంచి రైతులు సోమవారం భారీగా తరలివచ్చారు. కొందరు సమాచార లోపంతో ఉత్తర ఢిల్లీలోని బురారీ గ్రౌండ్స్‌కు చేరుకున్నారు. జైలును తలపిస్తున్న ఈ మైదానాన్ని వందలాది మంది పోలీసులు చుట్టుముట్టారు. మైదానం లోపలికి వెళ్లిన వారిని బయటకు రానివ్వలేదు. దాన్ని ఓపెన్‌ జైలుగా అభివర్ణించిన రైతు సంఘాల నేతలు తమ సహచరులను తక్షణం బయటకు పోనివ్వాలని డిమాండ్‌ చేశారు.

Updated Date - 2020-12-02T01:57:07+05:30 IST