దేశంలో నిరుద్యోగ సెగలు!
ABN , First Publish Date - 2020-12-15T08:17:36+05:30 IST
దేశంలో నిరుద్యోగ రేటు క్రమంగా పెరుగుతోంది. డిసెంబరు 13తో ముగిసిన వారంలో ఇది 10 శాతానికి చేరుకుంది.
న్యూఢిల్లీ, డిసెంబరు 14: దేశంలో నిరుద్యోగ రేటు క్రమంగా పెరుగుతోంది. డిసెంబరు 13తో ముగిసిన వారంలో ఇది 10 శాతానికి చేరుకుంది. ఇది దాదాపు 23 వారాల గరిష్ఠ స్థాయి కావడం గమనార్హం. గత కొన్ని నెలలుగా దేశంలో నిరుద్యోగ రేటు 6-8 శాతం మధ్య కదలాడుతోంది. డిసెంబరు 13తో ముగిసిన వారంలో పట్టణప్రాంతంలో నిరుద్యోగ రేటు 11.62 శాతాన్ని తాకింది. క్రితం వారంలో ఇది 8.15 శాతంగా ఉందని సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ (సీఎంఐఈ) తాజా గణాంకాల ద్వారా వెల్లడైంది. గ్రామీణ ప్రాంతాల్లో కూడా నిరుద్యోగ రేటు పెరిగింది. ఈ ప్రాంతంలో నిరుద్యోగ రేటు 8.56 శాతం నుంచి 9.11 శాతానికి ఎగబాకింది. వరుసగా నాలుగు వారాలుగా గ్రామీణ నిరుద్యోగ రేటు పెరుగుతోంది.