రామ మందిరం కోసం ప్రాణాలే పణంగా పెట్టా.. ఆహ్వానం అందితే వెళ్తా : ఉమా భారతి

ABN , First Publish Date - 2020-07-23T00:55:43+05:30 IST

రామ మందిరం కోసం ప్రాణాలనే పణంగా పెట్టానని, ఆగస్టు 5 న జరిగే భూమి పూజకు ట్రస్టు నుంచి

రామ మందిరం కోసం ప్రాణాలే పణంగా పెట్టా.. ఆహ్వానం అందితే వెళ్తా : ఉమా భారతి

లక్నో : రామ మందిరం కోసం ప్రాణాలనే పణంగా పెట్టానని, ఆగస్టు 5 న జరిగే భూమి పూజకు ట్రస్టు నుంచి ఆహ్వానం అందిందే మాత్రం కచ్చితంగా వెళ్తానని బీజేపీ ఫైర్ బ్రాండ్ ఉమా భారతి ప్రకటించారు. రామ మందిర ఉద్యమం 500 సంవత్సరాలుగా కొనసాగుతోందని, దీనిని ప్రపంచంలోని 1.5 బిలియన్ ప్రజలు చూశారని ఆమె తెలిపారు. కరోనా కాలంలో భూమిపూజ జరుగుతోంది కాబట్టి... ప్రోటోకాల్‌ను తప్పకుండా పాటించాలని, ఇప్పటి వరకైతే ట్రస్టు నుంచి తనకు పిలుపు అందలేదని ఆమె వెల్లడించారు.


రామ మందిర ఉద్యమంలో పాల్గొన్నందుకు ఎప్పుడూ విచారం వ్యక్తం చేయని నేతల్లో తాను కూడా ఉన్నానని ఆమె తెలిపారు. బాబ్రీ మసీదు కూల్చివేత కేసు గురించి ప్రస్తావిస్తూ... ఈ కేసులో తాను నిందితురాలని, ఇటీవలే సీబీఐ కోర్టులో హాజరయ్యానని ఆమె తెలిపారు. రామ జన్మభూమి ఉద్యమంలో పాల్గొనడం గర్వకారణమని, గర్వాన్ని మరింత రెట్టింపు చేస్తుందన్నారు.


ఆగస్టు 5 న జరిగే భూమి పూజకు ప్రధాని మోదీ హాజరైతే తప్పేంటని, ఇది కరోనాపై ప్రకటించిన యుద్ధాన్ని ఎలా ప్రభావితం చేస్తుందో అర్థం కావడం లేదని మండిపడ్డారు. కరోనా పై యుద్ధం, రామ మందిర నిర్మాణం రెండూ వేర్వేరు అంశాలని, ఒకదానితో ఒకటి సంబంధం లేని అంశమని ఉమా భారతి స్పష్టం చేశారు. 

Updated Date - 2020-07-23T00:55:43+05:30 IST