బ్రిటన్లో మరోమారు దేశవ్యాప్త లాక్డౌన్!
ABN , First Publish Date - 2020-09-19T00:08:39+05:30 IST
కరోనా వైరస్ కేసులు దేశంలో రోజురోజుకు పెరుగుతుండడంతో పాటు, ఆసుపత్రుల్లో చేరే వారి సంఖ్య ప్రతి ఎనిమిది రోజులకు రెండింతలు

లండన్: కరోనా వైరస్ కేసులు దేశంలో రోజురోజుకు పెరుగుతుండడంతో పాటు, ఆసుపత్రుల్లో చేరే వారి సంఖ్య ప్రతి ఎనిమిది రోజులకు రెండింతలు అవుతుండడంతో మరోమారు దేశవ్యాప్త లాక్డౌన్ తప్పదని బ్రిటన్ ప్రభుత్వం హెచ్చరించింది. దేశవ్యాప్త లాక్డౌన్కు మరోసారి వెళ్లకూడదనే అనుకుంటున్నామని, అవసరమైతే మాత్రం అందుకు సిద్ధంగా ఉన్నట్టు ఆరోగ్య కార్యదర్శి మట్ హ్యాన్కాక్ పేర్కొన్నారు.
కరోనా బారినపడిన యూరప్ దేశాల్లో అత్యధికంగా ప్రభావితమైన దేశం బ్రిటనే. దాదాపు 42 వేల మంది కరోనా మహమ్మారి కారణంగా ప్రాణాలు కోల్పోయారు. ఇటీవలి వరకు కొంత తగ్గుముఖం పట్టిన కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. కొవిడ్ కారణంగా ఆసుపత్రులలో చేరుతున్న వారి సంఖ్య ప్రతి 8 రోజులకు రెట్టింపు అవుతుండడం విచారకరమని, కాబట్టి దీనిని కట్టడి చేసేందుకు చర్యలు తీసుకోక తప్పదని హ్యాంక్కాక్ పేర్కొన్నారు.
వైరస్ మరింత చెలరేగిపోకుండా ఉండాలంటే దేశవ్యాప్తంగా మరోమారు లాక్డౌన్ విధించడం ఒక్కటే మార్గమని ప్రభుత్వ శాస్త్రవేత్తలు ప్రతిపాదించారు. అక్టోబరులో రెండువారాలపాటు లాక్డౌన్ విధించడం ద్వారా దీనికి ముకుతాడు వేయవచ్చని అభిప్రాయపడ్డారు.