ఆక్స్‌ఫర్డ్ వ్యాక్సిన్‌కు యూకే రెగ్యురేటర్ ఆమోదం
ABN , First Publish Date - 2020-12-30T19:01:02+05:30 IST
ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీతో కలిసి ప్రముఖ ఫార్మా సంస్థ ఆస్ట్రాజెన్‌కా సంయుక్తంగా అభివృద్ధి చేస్తున్న కోవిడ్-19 వ్యాక్సిన్ వినియోగానికి...

లండన్: ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీతో కలిసి ప్రముఖ ఫార్మా సంస్థ ఆస్ట్రాజెన్‌కా సంయుక్తంగా అభివృద్ధి చేస్తున్న కోవిడ్-19 వ్యాక్సిన్ వినియోగానికి యూకే రెగ్యులేటర్ ఆమోదం తెలిపినట్లు ఆస్ట్రాజెన్‌కా ప్రకటించింది. జనవరి 4 నుంచి ఈ వ్యాక్సిన్ బ్రిటన్‌లో అందుబాటులోకి రానుంది. యూకేలో స్ట్రెయిన్ వైరస్ కలకలం రేపుతున్న ఈ సమయంలో ఆస్ట్రాజెన్‌కా టీకా అక్కడి ప్రజలకు ఉపయోగపడనుంది. కొత్త కరోనా స్ట్రెయిన్ వైరస్‌పై వ్యాక్సిన్లు సమర్థవంతంగా పనిచేస్తాయని ఆధారాలు లేనప్పటికీ.. పనిచేయవన్న ఆధారాలు కూడా లేవని శాస్త్రవేత్తలు గుర్తుచేస్తున్నారు. యూకేతో పాటు దక్షిణాఫ్రికాలోని పలు దేశాల్లో కొత్త స్ట్రెయిన్ వైరస్ కలకలం రేపుతోంది. భారత్‌లో కూడా ఇప్పటివరకూ యూకే నుంచి వచ్చిన వారిలో 20 మందికి స్ట్రెయిన్ సోకినట్లు నిర్ధారణ అయింది.
యూకే నుంచి వచ్చిన వారిలో కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయిన శాంపిల్స్‌లో ఢిల్లీ ఎన్‌సీడీసీ ల్యాబ్‌కు 14 శాంపిల్స్‌ను పంపగా వారిలో 8 మందికి స్ట్రెయిన్ సోకినట్లు నిర్ధారణ అయింది. ఎన్‌ఐబిజి కల్యాణి(కోల్‌కత్తా సమీపంలోని) ల్యాబ్‌కు 7 శాంపిల్స్‌ను పంపగా ఒకరికి, ఎన్‌ఐవి(పుణె)కు 50 శాంపిల్స్‌ను పంపగా ఒకరికి, బెంగళూరు ల్యాబ్‌కు 15 శాంపిల్స్ పంపగా ఏడుగురికి, హైదరాబాద్ సీసీఎంబీకి 15 శాంపిల్స్ పంపగా ఇద్దరికి, ఐజీఐబీకి ఆరు శాంపిల్స్‌ను పంపగా ఒకరికి స్ట్రెయిన్‌గా నిర్ధారణ అయినట్లు కేంద్ర వైద్యఆరోగ్య శాఖ వెల్లడించింది.