నిలకడగా బ్రిటన్ ప్రధాని ఆరోగ్యం
ABN , First Publish Date - 2020-04-08T08:21:57+05:30 IST
కరోనా బారిన పడి ఐసీయూలో చికిత్స పొందుతున్న బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ పరిస్థితి ప్రస్తుతానికి నిలకడగా ఉందని..

స్వయంగా ఊపిరి పీల్చుకుంటున్నారు
న్యూమోనియా లక్షణాలు లేవు
బ్రిటన్ ప్రభుత్వ వర్గాల వెల్లడి
ముందు జాగ్రత్త కోసమే ఐసీయూ చికిత్స
టెన్ డౌనింగ్ స్ట్రీట్ వర్గాల వెల్లడి
బోరిస్ కోలుకోవాలని మోదీ ఆకాంక్ష
లండన్, ఏప్రిల్ 7: కరోనా బారిన పడి ఐసీయూలో చికిత్స పొందుతున్న బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ పరిస్థితి ప్రస్తుతానికి నిలకడగా ఉందని.. ఎలాంటి ఉపకరణాల సాయం లేకుండానే ఆయన ఊపిరి పీల్చుకోగలుగుతున్నారని బ్రిటన్ సర్కారు ఒక ప్రకటనలో తెలిపింది. ఆయనకు న్యూమోనియా లక్షణాలు లేవని.. ముందుజాగ్రత్త చర్యగానే వైద్యులు ఆయనను ఐసీయూకు తరలించారని పేర్కొంది.
బోరిస్ ఆరోగ్య పరిస్థితి గురించి ఎలిజబెత్ రాణికి వైద్యవర్గాలు ఎప్పటికప్పుడు సమాచారం అందిస్తున్నాయి. ఆయనకు 4 లీటర్ల ఆక్సిజన్ అందించినట్టు వార్తలు వస్తుండటంతో బోరిస్ ఆరోగ్య పరిస్థితి గురించి సర్కారు నిజాలు దాచిపెడుతోందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. బోరిస్ జాన్సన్ ఆఖరుసారి గురువారం నాడు కనిపించారని, ఆ తర్వాత ఆయన మీడియాకు కనిపించలేదంటే పరిస్థితి తీవ్రంగా ఉన్నట్టేనని కొందరంటున్నారు. కాగా.. బోరిస్‌ను త్వరలోనే పూర్తి ఆరోగ్యంతో చూస్తానన్న ఆశాభావాన్ని భారత ప్రధాని నరేంద్రమోదీ వ్యక్తం చేశారు. ఇక, కరోనా వైర్‌సపై పోరులో తయారుచేస్తున్న ప్రయోగాత్మక ఔషధాలను బోరిస్‌కు పంపాలని అమెరికాలోని ఔషధ కంపెనీలను కోరినట్టు ఆ దేశాధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చెప్పారు.
బోరిస్ జాన్సన్ త్వరగా కోలుకోవాలని ట్రంప్ కుమార్తె ఇవాంక, జపాన్ ప్రధాని షింజో అబే, ఫ్రాన్స్ అధ్యక్షుడు మేక్రాన్, రష్యా అధ్యక్షుడు పుతిన్, స్పెయిన్ ప్రధాని పెడ్రో శాంచెజ్ తదితరులు ఆకాంక్షించారు. ఇక.. బ్రిటన్ ప్రధాని, ఆరోగ్యమంత్రి ఇప్పటికే కరోనా బారిన పడగా.. తాజాగా మరో మంత్రి గోవే ఐసోలేషన్లోకి వెళ్లారు.