థాకరేకు అయోధ్య కొత్త కాదు, ఆహ్వానంతో పనేముంది?: శివసేన

ABN , First Publish Date - 2020-07-21T01:08:11+05:30 IST

అయోధ్యకు రమ్మని మహారాష్ట్ర ముఖ్యమంత్రికి ఆహ్వానం అవసరం ఏముందని శివసేన ఎంపీ సంజయ్ రౌత్..

థాకరేకు అయోధ్య కొత్త కాదు, ఆహ్వానంతో పనేముంది?: శివసేన

ముంబై: అయోధ్యకు రమ్మని మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరేకి ఆహ్వానం అవసరం ఏముందని శివసేన ఎంపీ సంజయ్ రౌత్ అన్నారు. అయోధ్యకు ఆయన ఎప్పుడూ వెళ్తూనే ఉంటారని గుర్తు చేశారు. సోమవారంనాడిక్కడ మీడియాతో సంజయ్ రౌత్ మాట్లాడుతూ, మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన వెంటనే ఉద్ధవ్ థాకరే అయోధ్యకు వెళ్లారని, రామాలయ నిర్మాణానికి ఉన్న అవరోధాలను శివసేన తొలగించిందని, అయోధ్య వెళ్లడానికి ఆహ్వానించాల్సిన అవసరం లేదని అన్నారు.


'అయోధ్యకు థాకరే ఎప్పుడూ వెళ్లి వస్తూనే ఉంటారు. ఇది రాజకీయాలకు సంబంధించిన అంశం కాదు. ముఖ్యమంత్రి కాకముందు కూడా థాకరే అయోధ్యకు వెళ్లారు. శివసైనికులకు అయోధ్యతో ప్రత్యేక అనుబంధం ఉంది. హిందుత్వ కోసం వారెన్నో త్యాగాలు చేశారు' అని సంజయ్ రౌత్ తెలిపారు.


ఆగస్టు 5న అయోధ్యలో రామాలయ శంకుస్థాపన జరగనుంది. ప్రధాని మోదీ వెళ్లే అవకాశాలున్నాయి. ఈ క్రమంలో అయోధ్య ట్రస్టు ఎవరిని ఆహ్వానించనుందనే విషయం ఒకింత ఉత్సుకత రేపుతోంది. తమను ఆహ్వానించినా, ఆహ్వానించకపోయినా పట్టింపేమీ లేదని శివసేన ఎంపీ అరవింద్ సావంత్ ఆదివారం అన్నారు. ఉద్ధవ్ థాకరే ఇప్పటికే రెండుసార్లు అయోధ్య వెళ్లారని, మసీదు కూల్చివేత అనంతరం బాలాసాహెబ్ థాకరే కూడా చాలా పదునైన ప్రకటనలు చేశారని చెప్పారు. రామాలయం కోసం తాము చేయాల్సినదంతా చేశామని, తమ అనుబంధమంతా నేరుగా రాముడితోనేనని ఆయన పేర్కొన్నారు.

Updated Date - 2020-07-21T01:08:11+05:30 IST