ట్విటర్ సంచలన నిర్ణయం... ట్రంప్ గద్దె దిగకపోయినా...!

ABN , First Publish Date - 2020-11-21T23:58:45+05:30 IST

మైక్రో బ్లాగింగ్ సైట్ ట్విటర్ సంచలన నిర్ణయం తీసుకుంది. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఓడిపోయిన డొనాల్డ్ ట్రంప్ గద్దె దిగకపోయినా...

ట్విటర్ సంచలన నిర్ణయం... ట్రంప్ గద్దె దిగకపోయినా...!

లాస్ ఏంజిల్స్: మైక్రో బ్లాగింగ్ సైట్ ట్విటర్ సంచలన నిర్ణయం తీసుకుంది. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఓడిపోయిన డొనాల్డ్ ట్రంప్ గద్దె దిగకపోయినా అధ్యక్షుడి అధికారిక ట్విటర్ ఖాతాను నూతన అధ్యక్షుడు జో బైడెన్‌కు అప్పగించాలని నిర్ణయించింది. జనవరి 20న బైడెన్ ప్రమాణ స్వీకారం చేసిన మరుక్షణమే ఈ ఖాతాను ఆయనకు బదిలీ చేస్తామని స్పష్టం చేసింది. ప్రస్తుతం ట్రంప్ వాడుతున్న వ్యక్తిగత ఖాతాకు విడిగా అధ్యక్షుడి హోదాలో వినియోగించేందుకు అధికారిక ఖాతా ఉంది. ఇటీవల జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో విజేతగా నిలిచిన 78 ఏళ్ల బైడెన్... అమెరికా 46వ అధ్యక్షుడిగా ప్రమాణం చేయనున్నారు. అమెరికా అధ్యక్షుడి అధికారిక ఖాతా బదలాయింపు కోసం ట్రంప్ బృందానికి, బైడెన్ బృందానికి మధ్య ఎలాంటి చర్చలు అవసరం లేదని ట్విటర్ పేర్కొంది. బైడెన్ బాధ్యతలు స్వీకరించిన రోజే అన్ని అధికారిక ఖాతాల్లోని సమాచారాన్ని సేకరించి వైట్ హౌస్ అధికారులకు అందచేస్తామని తెలిపింది.


‘‘2021 జనవరి 20న వైట్ హౌస్ అధికారిక ఖాతాలను బదలాయించేందుకు ట్విటర్ కసరత్తు చేస్తోంది. 2017లో నాటి నూతన అధ్యక్షుడికి వీటిని బదలాయించినట్టు గానే ఇప్పుడు కూడా నేషనల్ ఆర్కైవ్స్, రికార్డ్ అడ్మినిస్ట్రేషన్‌ అధికారులను సంప్రదించి ఈ ప్రక్రియ పూర్తిచేస్తాం..’’ అని ట్విటర్ ప్రతినిధి నిక్ పసిలియో పేర్కొన్నారు. ప్రస్తుతం అమెరికా అధ్యక్షుడి ఖాతాకు 32 మిలియన్ల మంది ఫాలోవర్లు ఉన్నారు. కాగా జో బైడెన్‌కు విజయాన్ని కట్టబెడుతూ వెలువడిన ఎన్నికల ఫలితాన్ని అంగీకరించేందుకు ట్రంప్ నిరాకరించడంతో వివాదం రేగిన విషయం తెలిసిందే. 

Updated Date - 2020-11-21T23:58:45+05:30 IST