ఆసుపత్రి గోడలపై ఉమ్మేసిన 27 మందిపై కేసు
ABN , First Publish Date - 2020-04-07T14:52:05+05:30 IST
కరోనా ప్రబలుతున్న సమయంలో ప్రభుత్వ ఆసుపత్రిలో గోడలపై ఉమ్మి వేసిన 27 మందిపై పోలీసులు కేసు నమోదు చేసిన ఘటన....

ఆగ్రా (ఉత్తరప్రదేశ్): కరోనా ప్రబలుతున్న సమయంలో ప్రభుత్వ ఆసుపత్రిలో గోడలపై ఉమ్మి వేసిన 27 మందిపై పోలీసులు కేసు నమోదు చేసిన ఘటన ఫిరోజాబాద్ జిల్లా కేంద్ర ఆసుపత్రిలో వెలుగుచూసింది. ఢిల్లీ వెళ్లి వచ్చిన తబ్లిగ్ జమాత్ సభ్యులకు చెందిన 27 మంది కుటుంబసభ్యులకు కరోనా పరీక్షలు చేసేందుకు వారిని ఫిరోజాబాద్ ఆసుపత్రికి తీసుకువచ్చారు. తబ్లిగ్ జమాత్ సభ్యుల కుటుంబాలకు చెందిన 27 మంది ఆసుపత్రి గోడలపై ఉమ్మి వేశారు. అనంతరం ఐసోలేషన్ వార్డు బయట 27 మంది కలిసి సామూహిక ప్రార్థనలు చేశారు.
ఆసుపత్రి గోడలపై ఉమ్మి వేయడం, బహిరంగ ప్రదేశంలో సామాజిక దూరం పాటించాలనే నిబంధనలకు విరుద్ధంగా నమాజ్ చేయడంపై మొబైల్ కెమెరా సాయంతో వైద్యులే చిత్రీకరించారు. ఫిరోజాబాద్ చీఫ్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ అలోక్ కుమార్ ఫిర్యాదుపై ఫిరోజాబాద్ నార్త్ పోలీసులు ఐపీసీ సెక్షన్ 188, 269, 270, 271ల కింద 27 మంది జమాత్ సభ్యుల కుటుంబసభ్యులపై కేసు నమోదు చేశారు. పోలీసులు వచ్చి ఆసుపత్రి ఆవరణలో ప్రార్థనలు ముగించాలని ఆదేశించారు. దీంతో 27 మంది వైరస్ వ్యాప్తి చేయాలని కావాలని ఆసుపత్రి గోడలపై ఉమ్మి వేశారు. వీరిపై కేసు నమోదు చేసి చర్యలు తీసుకుంటామని పోలీసు అధికారి నీరజ్ మిశ్రా చెప్పారు.