సోషల్ మీడియా దిగ్గజాలకు కళ్లెం వేస్తూ ట్రంప్ ఆదేశాలు

ABN , First Publish Date - 2020-05-29T16:10:57+05:30 IST

గూగుల్, ఫేస్‌బుక్, ట్విటర్ సహా సోషల్ మీడియా దిగ్గజాలు ఆన్‌లైన్‌ కంటెంట్‌ను తనిఖీ చేయడంపై చర్యలు తీసుకునే విధంగా...

సోషల్ మీడియా దిగ్గజాలకు కళ్లెం వేస్తూ ట్రంప్ ఆదేశాలు

వాషింగ్టన్: గూగుల్, ఫేస్‌బుక్, ట్విటర్ సహా సోషల్ మీడియా దిగ్గజాలు ఆన్‌లైన్‌ కంటెంట్‌ను తనిఖీ చేయడంపై చర్యలు తీసుకునే విధంగా అమెరికా విచారణ సంస్థలకు అధికారం కల్పిస్తూ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇవాళ ఓ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్‌పై సంతకం చేశారు. దేశంలోని అతిపెద్ద సోషల్ మీడియా సంస్థలు రాజకీయ వివక్షకు పాల్పడకుండా నివారించే ప్రయత్నంలో భాగంగానే ట్రంప్ ఈ ఆదేశాలను అమల్లోకి తీసుకొచ్చినట్టు ది వాషింగ్టన్ పోస్ట్ పేర్కొంది. మెయిల్‌-ఇన్ బ్యాలెట్ విధానానికి వ్యతిరేకంగా ఇటీవల తాను పెట్టిన పోస్టులపై ట్విటర్ ఫ్యాక్ట్ చెక్ లేబుల్ వేయడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన ట్రంప్... వడివడిగా ఈ మేరకు నిర్ణయం తీసుకోవడం గమనార్హం. ‘‘ఓ పెను ప్రమాదం నుంచి భావ ప్రకటనా స్వేచ్ఛను కాపాడడం కోసమే ఈ నిర్ణయం తీసుకుంటున్నాం..’’ అంటూ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్‌పై సంతకం చేసే ముందు ట్రంప్ పేర్కొన్నారు. కాగా ట్రంప్ ముసాయిదా ప్రతిపాదనకున్న చట్టబద్దతపై టెక్ రంగానికి చెందిన న్యాయవాదులు, కాంగ్రెస్‌లోని చట్టసభ్యులు, రాజకీయ న్యాయకోవిదులు పలు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. 

Updated Date - 2020-05-29T16:10:57+05:30 IST