వర్షంలో చెట్టుకింద గిరిజన మహిళ ప్రసవం

ABN , First Publish Date - 2020-08-20T15:22:47+05:30 IST

జోరుగా కురుస్తున్న వర్షంలో ఓ చెట్టు కింద గిరిజన మహిళ ప్రసవించిన ఉదంతం ...

వర్షంలో చెట్టుకింద గిరిజన మహిళ ప్రసవం

గడ్‌చిరోలీ (మహారాష్ట్ర) : జోరుగా కురుస్తున్న వర్షంలో ఓ చెట్టు కింద గిరిజన మహిళ ప్రసవించిన ఉదంతం మహారాష్ట్రలోని గడ్ చిరోలీ ప్రాంతంలో వెలుగుచూసింది. ఈటపల్లి తాలూకా జారివాడ గ్రామానికి చెందిన భారతి దోరేపేటి (27) అనే గిరిజన మహిళ నిండు గర్భవతి. భారతికి పురిటినొప్పులు రావడంతో 10కిలోమీటర్ల దూరంలోని గట్ట ప్రాథమిక ఆరోగ్యకేంద్రానికి సమాచారం అందించి అంబులెన్సు పంపించాలని ఆశా కార్యకర్త కోరారు. వర్షం కారణంగా వరదనీరు చేరడంతో అంబులెన్స్ రావడం ఆలస్యమైంది. అంబులెన్సు వచ్చే ముందే నొప్పులు అధికం కావడంతో వర్షంలో గర్భిణీని మంచంపై తీసుకొని బయలుదేరారు.  ఓ చెట్టుకింద ఆశా కార్యకర్త మహిళకు ప్రసవం చేశారు. భారతికి పండంటి ఆడబిడ్డ జన్మించింది. తల్లీబిడ్డ క్షేమంగా ఉన్నారు. ఆశా కార్యకర్త దుర్గీ చొరవతీసుకొని పురుడు పోశారు. అనంతరం తల్లీ బిడ్డలను ప్రాథమిక ఆరోగ్యకేంద్రానికి తరలించారు.

Updated Date - 2020-08-20T15:22:47+05:30 IST