కరోనా ఎఫెక్ట్: గడప దాటని ట్రాన్స్‌జెండర్లు

ABN , First Publish Date - 2020-03-24T22:56:48+05:30 IST

దేశవ్యాప్తంగా కల్లోలం రేపుతున్న కరోనా వైరస్ కారణంగా ఇప్పుడు ట్రాన్స్‌జెండర్ల పరిస్థితి దయనీయంగా మారింది. భిక్షమెత్తుకుంటే తప్ప ...

కరోనా ఎఫెక్ట్: గడప దాటని ట్రాన్స్‌జెండర్లు

బెంగళూరు: దేశవ్యాప్తంగా కల్లోలం రేపుతున్న కరోనా వైరస్ కారణంగా ఇప్పుడు ట్రాన్స్‌జెండర్ల పరిస్థితి దయనీయంగా మారింది. అత్యధిక శాతం మంది భిక్షమెత్తుకునే వాళ్లే కావడంతో ఇప్పుడు బయటికి వెళ్లే పరిస్థితి లేక బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. టాన్స్‌జెండర్లలో ఎక్కువ మంది వేర్వేరు ప్రాంతాల నుంచి వలసవచ్చిన కారణంగా కనీసం రేషన్ కార్డులు, ఇతర ప్రభుత్వ పథకాలకు నోచుకోని పరిస్థితి నెలకొంది. ‘‘నేను ఓ జంక్షన్‌లో భిక్షమెత్తుకునేందుకు ప్రయత్నించాను. అయితే బెంగళూరులో కోవిడ్‌-19 పాజిటివ్ కేసులు పెరగడంతో భయపడి వెనక్కి వచ్చేశాను..’’ అని ట్రాన్స్‌జెండర్ చాందిని పేర్కొన్నారు.


కాగా కరోనా వైరస్ మహమ్మారి రోజురోజుకూ విస్తరిస్తున్న నేపథ్యంలో... తమ సభ్యుల మధ్య అవగాహన పెంచేందుకు ట్రాన్స్‌జెండర్ కమ్యునిటీ స్వచ్ఛందంగా ముందుకొచ్చింది. వాట్సాప్ గ్రూప్‌లు సహా పలు సోషల్ మీడియా వేదికల ద్వారా అవగాహన కార్యక్రమాలు చేపట్టింది. ‘‘ఆరోగ్య శాఖ సలహాలు, సూచనలను మా వాట్సాప్‌ గ్రూపుల్లో షేర్ చేస్తున్నాం. ఎవరితోనూ సన్నిహితంగా మెలగొద్దంటూ హెచ్చరిస్తున్నాం...’’ అని సామాజిక కార్యకర్త మధుమిత పేర్కొన్నారు. కాగా ఇప్పటికే హెచ్ఐవీతో పాటు పలు ఇన్ఫెక్షన్ల ముప్పు ఎదుర్కొంటున్న సెక్స్ వర్కర్లను ఇళ్ల వద్దనే ఉండాలంటూ కమ్యూనిటీ నాయకులు సూచిస్తున్నారు. దాదాపు 7 వేలకు పైగా సెక్స్ వర్కర్లు, సెక్సువల్ మైనారిటీలు, ఇతర సభ్యులు ఉన్న అషోదయా ఫౌండేషన్.. గత పది రోజులుగా కరోనా వైరస్‌పై పెద్ద ఎత్తున అవగాహన కార్యక్రమాలు చేపట్టింది. 

Read more